Travelling Hacks: బిజినెస్ పని మీదో, కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేయటానికో, ఫ్రెండ్స్‌తో జాలీ ట్రిప్‌పో చేస్తూనే ఉంటాం. మన జీవితాల్లో ట్రావెలింగ్ ఒక భాగం. కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు అక్కడ హోటల్ రూంల్లో ఉండాల్సివస్తుంది. ఎన్ని వసతులున్నా, ఇంట్లో లేని లోటు తెలుస్తుంటుంది. చిన్న చిన్న ఇబ్బందులే మూడ్ పాడు చేసి, ట్రిప్ చెడగొడతాయి. ఇలాంటపుడే ఈ చిన్న చిన్న హ్యాక్స్ మీకు ఎంతో బాగా ఉపయోగపడుతాయి. ఈసారి ట్రిప్లో ఇవి తప్పకుండా ఫాలో చేయండి.


పరదాల మధ్య నుంచి వచ్చే వెలుతురు


హోటల్ రూము విండోకు ఉండే పరదాలు అందంగా, పొద్దున్న కాస్త జరపగానే ఫుల్ గా సన్లైట్ కనపడేలా అమర్చి ఉంటాయి. కానీ, రాత్రి పూట రెండు పరదాల మధ్య ఉండే సన్నని గ్యాప్ నుంచి వచ్చే లైట్ గదిలో నిండిపోతుంది. దీని వల్ల నిద్ర చెడిపోతుంది. అలాంటపుడు ఏం చేయాలో తోచదు కదూ! అపుడే క్లాత్ క్లిప్స్, అవీ లేకపోతే హెయిర్ క్లిప్స్ తో రెండు పరదాలను కలిపి మూసేయొచ్చు. దీనితో మీకు గుడ్నైట్ స్లీప్ దొరుకుతుంది. పొద్దున ట్రిప్ ను హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.


ఫుడ్ సమస్యలు


తిరిగి తిరిగి అలిసిపోయాక మళ్లీ బయటకెళ్లి తినే ఓపిక ఉండదు. అలాగనీ అస్తమానూ రూం సర్వీస్ వాళ్లు బెల్ కొట్టి ఫుడ్ తీసుకొస్తే ప్రైవసీ దెబ్బతింటుంది. కాస్త చిరాగ్గా కూడా ఉంటుంది. అందుకని, ఫుడ్ ఆర్డర్ చేసుకోవటానికి ఎన్నో యాప్స్ ఉన్నాయి. మీకు నచ్చిన హోటల్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మీరే వంట చేసుకొని తినాలనుకుంటే కూడా గ్రోసరీ డెలివరీ చేసే యాప్స్ కూడా ఎన్నో ఉన్నాయి. కావల్సిందల్లా మీరు జస్ట్ యాప్ డౌన్లోడ్ చేస్కోవటమే.


మ్యూజిక్ స్పీకర్ తీసుకెళ్లటం మర్చిపోయారా?


చాలా మందికి ప్రతిరోజూ మ్యూజిక్ వినే అలవాటు ఉంటుంది. అలవాటు లేకపొయినా కొత్త ప్రదేశంలో సరదాగా ఆడి పాడటానికి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనుకునే వారికోసం ఈ టిప్ బాగా పనికొస్తుంది. మీరు స్పీకర్ తీసుకెళ్లటం మర్చిపోయినా, చిన్న ప్లాస్టిక్ కప్ లో ఫోన్ ను స్పీకర్ లోపలివైపునకు ఉండేలా పెట్టి మ్యూజిక్ వినొచ్చు. ఇది స్పీకర్ లాంటి ఎఫెక్ట్ ఇస్తుంది. పెద్ద సౌండ్ తో పక్క వారిని ఇబ్బంది పెట్టదు కూడా.


మేకప్ రిమూవర్ గానీ, షేవింగ్ క్రీం గానీ తీసుకెళ్లలేదని ఫీల్ అవుతున్నారా?


హోటల్ గదుల్లో చాలా కామన్ గా కనిపించే వస్తువులు, లోషన్, కండీషనర్..ఎవరూ వాడకుండా అలా పడుంటాయి. మీరు కండీషనర్ ను మేకప్ రిమూవర్ గా వాడుకోవచ్చు. అలాగే షేవింగ్ క్రీం లా కూడా కండీషనర్ పని చేస్తుంది.


బట్టలు ముడతబడిపోయాయా?


వెళ్లిన చోటుకల్లా ఐరన్ బాక్స్ మోసుకెళ్లి అక్కడ క్లాత్స్ ఐరన్ చేసుకోవటమంటే అయ్యే పని కాదు. అలాగని ముడతబడిపోయిన బట్టలు వేసుకుంటే అస్సలు బాగుండదు. ఇలాంటపుడే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ముడతబడిపోయిన బట్టలను హ్యాంగర్ కు తగిలించి, బాత్రూంలో హ్యాంగ్ చేస్తే మీరు హాట్ వాటర్ బాత్ చేసినపుడు, ఆ ఆవిరి వల్ల బట్టల ముడతలు వదిలిపోతాయి.


కాఫీ మెషిన్ను ఇలా వాడండి


చాలా హోటల్స్ గదుల్లో కాఫీ మెషిన్లను ఉంచుతాయి. పొద్దున కాఫీతో పాటు, మీరు లైట్ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ కు ఈ హాట్ వాటర్ ను వాడుకోవచ్చు. ఓట్ మీల్, ఇన్స్టాంట్ ఫుడ్ తయారు చేసుకోవటానికి ఈ వాటర్ పనికొస్తాయి.


ఒకటి కంటే ఎక్కువ డివైజ్ లు చార్జ్ చేయాలా?
 
బయటకు వెళ్లినపుడు ఫోన్, ల్యాప్టాప్ చార్జింగ్ పెద్ద సమస్య. ఒక్కరు కంటే ఎక్కువ మంది గదిలో ఉన్నపుడు, అందరికి ఒక్కసారే ఫోన్ చార్జ్ అవసరమైనా కష్టమవుతుంది. అలాంటపుడు, కొన్ని హోటల్లలోని టీవీ వెనకాల USB పోర్ట్ ఉంటుంది అక్కడ ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు.