గంటల తరబడి స్క్రీన్ చూస్తున్నప్పుడు మీ కళ్ళు ఎప్పుడైనా వణికినట్టు లేదంటే అదిరినట్టుగా అనిపించిందా? వేడి చేసినప్పుడు కళ్ళు అదురుతాయని కొందరు చెప్తారు. ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుందని, కుడి కన్ను అదిరితే ఏదో చెడు జరగబోతుందని సంకేతం అంటుంటారు. కానీ ఇవన్నీ మూఢ నమ్మకాలు మాత్రమే. కళ్ళు వణికినప్పుడు చూపు కాసేపు మసక బారిపోతుంది. ఇది చికాకు కలిగించే విషయం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కళ్ళు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు మీకు తగినంత నిద్ర లేదని, లేదంటే ల్యాప్ టాప్ నుంచి విరామం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే సంకేతం కావచ్చు. తరచుగా కంటి మూలల్లో నొప్పిగా అనిపిస్తుంది. కళ్ళు మెలితిప్పిన భావన కలుగుతుంది. అందుకు కారణాలు..


☀ ఒత్తిడి, ఆందోళన


☀ అలసట


☀ కెఫీన్ లేదా ఆల్కహాల్ తాగడం


☀ కొన్ని మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు


☀ అధిక స్క్రీనింగ్ టైమ్


జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం ఇది చాలా చికాకు కలిగించే విషయం. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.


ఐలిడ్ మయోకిమియా: ఇది చాలా సాధారణంగా అందరూ ఎదుర్కొనే సమస్య. రోగి చికిత్స అవసరం ఉండదు. కాసేపు కంటికి విశ్రాంతి ఇస్తే నయం అవుతుంది


బ్లెఫారోస్పాస్మ్: ఇది బాధాకరంగా ఉంటుంది. కంటిని పాక్షికంగా లేదా పూర్తిగా ఇబ్బంది పెట్టేస్తుంది. కాసేపు కళ్ళు నొప్పులతో ఇబ్బంది పెట్టినా చికిత్స కూడా అవసరం అవుతుంది.


2020లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బ్లెఫారోస్పాస్మ్ ఉన్న వారిలో 20 నుంచి 30 శాతం మందికి ఈ పరిస్థితి గతంలో తమ కుటుంబ చరిత్రలో ఉందని తేలింది. మీరు నివసించే ప్రాంతం, చేసే ఉద్యోగం మీద కూడా ఈ వ్యాధి ఆధారపడి ఉంటుంది. నగరాల్లో నివసిస్తూ, ఒత్తిడితో కూడిన ఉద్యోగాన్ని చేస్తున్న వాళ్ళు, స్క్రీన్ లేదా టీవీ ముందు ఎక్కువ సమయం గడపడం వంటివి బ్లెఫారోస్పాస్మ్ పరిస్థితిని ప్రభావితం చేస్తుంది.


ఈ సమస్యని అధిగమించడం ఎలా?


కళ్ళు వణకడం అనేది కొద్ది సేపు ఉండి పోతుంది. ఈ సమస్య రాకుండా చూసుకోవాలంటే కళ్లకి కావలసినంత విశ్రాంతి ఇవ్వాలి. టీ, కాఫీ వంటి కెఫీన్ ఉన్న పానీయాలు తాగడం తగ్గించాలి. ఆల్కహాల్ కూడా ఈ పరిస్థితికి దోహదపడుతుంది. కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల అని అనిపిస్తే వైద్యులని సంప్రదించి వాటిని మార్చుకోవడం మంచిది. ప్రస్తుత ఉద్యోగాల రీత్యా ఎక్కువ మంది అధిక సమయం స్క్రీన్ ముందే గడుపుతున్నారు. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా 20-20-20 నియమం పాటించడం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.


ప్రతి 20 నిమిషాలకి కనీసం 20 సెకన్ల పాటు స్క్రీన్ నుంచి విరామం తీసుకోవాలి. 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువులు లేదంటే పచ్చని మొక్కలు చూడటం మంచిది. రెప్పవేయడం మరచిపోవద్దు. స్క్రీన్ చూసే వాళ్ళు మిగతా వారితో పోలిస్తే తక్కువగా రెప్ప వేస్తారు. కానీ అది కంటిని దెబ్బతీస్తుంది. కళ్ళు రీఫ్రెష్ గా ఉంచుకోవాలి.


బుపా హెల్త్ క్లినిక అసోసియేషన్ చెప్పిన దాని ప్రకారం కళ్ళు వణకడం అనేది దీర్ఘకాలం పాటు ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులని సంప్రదించాలి. మల్టిపుల్ స్క్లెరోసిస్ లేదా పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభ సూచికలు కావచ్చు. ఒక్కోసారి మెదడు మీద కూడ దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే సమస్య తీవ్రంగా అనిపిస్తే వెంటనే కంటి సంబంధిత నిపుణుల్ని కలవడం ముఖ్యం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: వేగంగా నిలబడినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయా? కారణం ఇదే!