చేపల వేపుడు అంటే ఇష్టమా? సులువుగా ఎలా చేయాలో తెలుసా? ఇదిగో ఇక్కడ మేం అదే చెప్పాం. చేపల కర్రీ కన్నా చేపల వేపుడు చేయడమే చాలా సులువు. చేప ముక్కను మాడిపోకుండా మంచిగా వేయించుకుంటే ఆ రుచే వేరు. అసలే వర్షకాలంలో సాయంత్రం అయితే చాలు వాతావరణం చల్లగా మారిపోతుంది. ఆ సమయంలో వేడివేడి చేప వేపుడు తింటే ఆ కిక్కే వేరు. 


కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక చెంచా
పసుపు - చిటికెడు
కారం - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు


తయారీ ఇలా
1.  చేపను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పసుపు, ఉప్పు కలిపి కడగడం వల్ల వాసన పోతుంది. 


2. ఇప్పుడు ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు కలిపి ముద్దలా చేయాలి. కాస్త నీళ్లు కలిపి మరీ చిక్కగా కాకుండా చేయాలి.


3. చేపముక్కలకి ఈ మిశ్రమాన్ని పట్టించి ఓ అరగంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. 


4. తరువాత వెడల్పుగా ఉండే కళాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి చేప ముక్కలు వేయాలి. 


5. ఒక్కో చేపముక్క వేసి రెండు వైపులా వేయించుకోవాలి. కరివేపాకులు కూడా వేయాలి. 


6. రెండు వైపులా బ్రౌన్ రంగులోకి మారేవరకు ఉంచి తీసేయాలి. 


7. గోరువెచ్చగా చేపల వేపుడు తింటే ఆ మజాయే వేరు. 


చేపలు తింటే ఎన్ని లాభాలో...
1. చేపలు తినడం వల్ల మతిమరుపు అంత త్వరగా రాదు. అందుకే చదువుకునే పిల్లలకు చేపలు తినిపించడం మంచిది. 2016లో చేసిన ఓ పరిశోధనలో చేపల వల్ల పిల్లల  జ్ఞాపక శక్తి పెరుగుతుందని తేలింది.


2. చేపల్లో ఉండే పోషకాల వల్ల వయసు మీరాక గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందని కూడా అధ్యయనాలు చెప్పాయి. 


3. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండు ట్రైగ్లిజరైడ్లను అడ్డుకుంటాయి. రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాయి. 


4. చేపలు తరచూ తినడం వల్ల డిప్రెషన్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. డోపమైన్, సెరోటోనిన్ వంటి సంతోషాన్ని కలిగించే హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. 


5. మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి విముక్తి కలగాలంటే చేపలు అధికంగా తినాలి. 


6. మహిళల్లో సమయానికి రుతక్రమం రావాలన్న చేపలు తినాలి. ఇవి ఇతర అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 


Also read: అచ్చు అలియా భట్‌లాగే ఉంది కదా, అదే ఆ పిల్లకు శాపమైంది, ఓ మోడల్ కథ


Also read: ఏసీలో ఎక్కువ సమయం ఉంటున్నారా? అయితే త్వరగా ముసలోళ్లయిపోతారు