ప్రతి కూరలో పసుపు పడనిదే రుచి, రంగు రాదు. అందుకే బిర్యానీ నుంచి ఫ్రైడ్ రైస్ దాకా అన్నింట్లో ఎంతోకొంత పసుపును వేస్తూనే ఉంటారు. చిటికెడు పసుపు కూడా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఉంటుంది. అయితే మనం వాడే పసుపు నిజంగా స్వచ్ఛమైనదేనా? కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లో ఎక్కువవుతున్నాయి. మనం వాడే పసుపు స్వచ్ఛమైనదో కాదో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది . చిటికెడు పసుపుతో మీరు కొన్న పసుపు స్వచ్ఛమైనదో, కల్తీదో తెలుసుకోవచ్చు. పురాతన కాలం నుంచి అత్యంత శక్తివంతమైన మసాలా దినుసుల్లో పసుపు ఒకటి.


పసుపును చాలా విరివిగా వాడతారు. కాబట్టి పసుపు కలిపి అయ్యే అవకాశం ఎక్కువ. కల్తీ పసుపును అమ్ముతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. పసుపులో కృత్రిమ రంగులు జోడించడం, మెటానిల్ అనే రసాయనాన్ని కలిపి పసుపు రంగు వచ్చేలా చేయడం, లెడ్ క్రోమేట్లతో కలిపి పసుపు రంగు వచ్చేలా చేసి అమ్మడం వంటివి చేస్తున్నారు. ఈ రసాయనాలు వాడడం వల్ల ఆ పసుపు ఆరోగ్య దాయకం కాదు. అలాగే పసుపు పొడిలో చాక్ పౌడర్ ను కలిపి లేదా అడవి పసుపును కలిపి కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి హానికరమైనవే.


పసుపు పొడి కల్తీదో కాదో తెలుసుకోవడం కోసం ఇలా చేయండి. ఒక టీ స్పూన్ పసుపు పొడిని నీటిలో కలపండి. ఆ పసుపంతా నీటి దిగువకు చేరి, లేత పసుపు రంగులోకి మారితే అది నిజమైన స్వచ్ఛమైన పసుపు. అదే కల్తీ పొడి అయితే నీటిలో వేసిన తర్వాత ముదురు పసుపు రంగులోకి మారిపోతుంది.


పసుపు ప్రకాశవంతమైన అత్యంత పసుపు రంగుతో మెరుస్తూ ఉంటే దానిలో మెటానిల్ రసాయనం కలిపారేమో చెక్ చేయాలి. దీని కోసం ఒక టెస్ట్ ట్యూబ్ లో చిటికెడు పసుపును జోడించండి. దానిలో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. బాగా షేక్ చేయండి. ఆ ద్రావణం గులాబీ రంగులోకి మారితే అది మెటానిల్ కలిపిన పసుపు. అంటే కల్తీ పసుపు అని అర్థం. అది రంగు మారకుండా అలానే ఉంటే స్వచ్ఛమైన పసుపు అని అర్థం. మెటానిల్ కలిపిన పసుపును తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


మీ అరచేతిలో చిటికెడు పసుపును వేసి బొటనవేలితో గట్టిగా 20 సెకండ్ల పాటు మర్దన చేయండి. ఆ తర్వాత చేతులను దులిపేసుకోండి. మీ చేతిపై పసుపు మరక అలానే ఉంటే అది స్వచ్ఛమైన పసుపు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లోనే కొన్ని నిమిషాల్లో చేయగలిగే ఒక సాధారణ పరీక్ష కూడా ఉంది. ఒక గాజు కూజాను గోరువెచ్చటి నీటితో నింపండి. అందులో ఒక స్పూన్ పసుపు వేయండి. కాసేపు దాన్ని వదిలేయండి. పసుపు పొడి అడుగుభాగాన చేరితే ఆ పసుపు స్వచ్ఛమైనదని అర్థం. అలా కాకుండా పసుపు నీటిలో కలిసిపోయి ముదురు పసుపు రంగులో మారితే అది కల్తీ పసుపు అని అర్థం.


పసుపు పొడిలో చాక్ పౌడర్ కలిపారో లేదో కూడా చెక్ చేయొచ్చు. దీనికోసం ఒక టెస్ట్ ట్యూబ్‌లో కొన్ని చుక్కల నీటిని హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వేయండి. అందులో 1 టీ స్పూన్ పసుపు పొడిని వేయండి. ఆ ద్రావణంలో బుడగలు ఉన్నట్లయితే ఆ పసుపు కల్తీదని అర్థం. అందులో సుద్ధ పొడి కలిసిందని అర్థం చేసుకోవాలి. 


Also read: తేనెటీగలే కాదు చీమలు కూడా తేనెను తయారు చేస్తాయి, ఈ తేనే ఎంతో ఖరీదు







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.