పోషకాహారం మీద అవగాహనతో ఇప్పుడు చాలా మంది తృణధాన్యాలతో చేసన ఆహారం తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫైబర్, అమైనో ఆమ్లాలు, విటమిన్ బితో పాటు శరీరానికి ముఖ్యమైన ఖనిజాలు అందించడంలో చిరు ధాన్యాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. గోధుమలు తినలేని వాళ్ళకి ఇవి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. కొర్రలు, రాగులు, సజ్జలతో చేసిన ఆహార పదార్థాలు తింటున్నారు. వాటి ప్రాముఖ్యతను ప్రజల్లోకి మరింతగా తీసుకుని వెళ్లేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నపుడే 2022-23 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది.
చిరుధాన్యాలు తీసుకోవడం అనేది ఇప్పుడిప్పుడే వస్తున్న ఆచారం కాదు. పూర్వకాలంలో అయితే మిల్లెట్స్(చిరు ధాన్యాలు) తో చేసిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకునే వాళ్ళు. రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, కొర్రలు ఇలా వాటిని పిండి చేసుకుని కూడా తినొచ్చు. చిరు ధాన్యాల్లో శరీరానికి కావలసిన పూర్తి స్థాయి పోషకాలు అందుతాయి. చిరు ధాన్యాలు చేసిన పిండితో రొట్టెలు, సంకటి ఇలా ఏది చేసుకున్నా రుచిగానే ఉంటుంది. మిల్లెట్స్ తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మిల్లెట్ తోతయారు చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఈ మధ్య కాలంలో వారి బియ్యానికి బదులుగా కొర్రలతో చేసిన అన్నం తినేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. డయాబెటిస్ రోగులకి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పీచు పదార్థం, కాల్షియం, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం ఫుష్కలంగా ఉంటాయి. ఉదర సంబంధ సమస్యలు నివారించేందుకు ఇది గొప్ప ఔషధంగా పని చేస్తుంది.
ఎన్నో పోషకాలను అందించే చిరు ధాన్యాలు తినడం వల్ల ప్రయోనాలు ఉన్నప్పటికీ తిన్న తర్వాత చాలా మందికి మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కడుపులో నొప్పి, వికారం, గ్యాస్ సమస్యలు వస్తూ ఇబ్బంది పెడతాయి. వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల ఆ సమస్యలను అధిగమించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. పచ్చిగా ఉన్న వాటిని నేరుగా తినడం వల్ల ఇవి వాతాన్ని పెంచుతాయి. అందువల్లే మలబద్ధకం, ఉబ్బరానికి దారి తీస్తాయని నిపుణులు చెప్పుకొచ్చారు. వాతంతో బాధపడుతున్న వాళ్ళని ఇవి మరింత ఇబ్బందులకి గురిచేస్తాయి. అందుకే వీటిని తీసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచించారు.
చిరు ధాన్యాలు ఇలా తీసుకోవాలి
మలబద్ధకం, ఉబ్బరం నివారించడానికి ఈ చిట్కాలు పాటిస్తే సమస్య ఉండదు.
తినడానికి ముందుగా కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు బాగా నీటిలో నానబెట్టాలి
వాటిని వండేటప్పుడు నెయ్యి, రాళ్ళ ఉప్పు, అల్లం పొడి(శొంఠి) వేయాలి
చిరుధాన్యాలతో చేసుకున్న పదార్థాలు తినేటప్పుడు బాగా ఉడికించిన కూరగాయలతో కలిపి తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నెయ్యి నుంచి వెన్న కావాలా? అయితే ఇలా చేస్తే సరి
Also Read: 'విటమిన్- డి' సప్లిమెంట్స్ కరోనాని నిజంగానే అడ్డుకుంటాయా? క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయ్