మనం ఈ భూమ్మీదకి వచ్చేసరికే మన శరీరం ఆనందం, బాధ, కోపం వంటి సహజగుణాలతో ముందే ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. వయసును బట్టి అవన్నీ బయటపడుతూ ఉంటాయి. ఆ గుణాలను, కోరికలను పెంచి, వయసును బట్టి బయటపడేలా చేసేవి నాలుగు రకాల హార్మోన్లు. అవే మీలో ప్రేమను పుట్టేలా చేస్తాయి, సెక్స్ కోరికలను కలిగిస్తాయి, నచ్చిన వాళ్లు కౌగిలించుకుంటే హాయిగా ఉండే అనుభూతినిస్తాయి. ఈ హార్మోన్లకు హార్వర్డ్ శాస్త్రవేత్తలు‘ఫీల్ గుడ్ హార్మోన్స్’ అని పేరుపెట్టారు. అంత ముఖ్యమైన హార్మోన్ల గురించి తెలుసుకోకపోతే ఎలా?
ఇవే ఆ నాలుగు
1. డోపమైన్
2. సెరోటోనిన్
3. ఎండార్ఫిన్స్
4. ఆక్సిటోసిన్
డోపమైన్
ఇది మన శరీరంలో సహజంగానే ఉత్పత్తి అవుతుంది. ఆనందాన్ని కలిగించడంలో డోపమైన్ పాత్ర ప్రధానమైనది. సెక్స్, షాపింగ్, అప్పుడే వండిన వంటలు మంచి సువాసన వెదజల్లడం వంటివి డోపమైన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయని హార్వర్డ్ నివేదిక పేర్కొంది. డోపమైన్ తక్కువగా ఉత్పత్తి అయితే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉన్మాదులుగా, భ్రాంతి చెందేవారిలా మారతారని పరిశోధన తెలిపింది. డోపమైన్ తగినంత శరీరంలో ఉత్పత్తి అవ్వాలంటే చికెన్, పాలు, జున్ను, పెరుగు, అవకాడోలు, అరటిపండ్లు, గుమ్మడికాయలు, నువ్వులు, సోయా వంటివి తినాలి.
సెరోటోనిన్
ఈ హార్మోన్ మూడ్ బూస్టర్ లా పనిచేస్తుంది. డిప్రెషన్ ను దూరం చేస్తుంది. ఉత్సాహాన్ని పెంచుతుంది. అంతేకాదు మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. భయం, ఒత్తిడి, జీర్ణక్రియ, లైంగిక కార్యకలాపాలు, నిద్ర, శ్వాస, శరీర ఉష్ణోగ్రత వంటి విధుల్లో కూడా సెరోటోనిన్ పనిచేస్తుంది. తక్కువ సెరోటోనిన్ లెవెల్స్ డిప్రెషన్ తో ముడిపడి ఉంటాయి. కాబట్టి సెరోటోనిన్ స్థాయిలు పెంచుకోవడానికి కూరగాయలు, పండ్లు, చిక్కుళ్లు, తృణధాన్యాలు వంటివి తినాలి.
ఎండార్ఫిన్లు
హార్వర్డ్ నివేదిక ప్రకారం మెదడులో సహజ పెయిన్ కిల్లర్స్ గా ఉపయోగపడతాయి ఎండార్ఫిన్లు. ఒత్తిడిని తగ్గించే హార్మోన్లలో ఎండార్ఫిన్లు కూడా ఒకటి. నవ్వడం, ప్రేమలో పడడం, భోజనాన్ని ఆస్వాదించడం, సెక్స్... సమయాల్లో ఎండార్ఫిన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. చాకోలెట్లు, స్ట్రాబెర్రీలు, ఆరెంజ్ లు, ద్రాక్షలు, వివిధ రకాల నట్స్ తినడం ద్వారా ఎండార్ఫిన్లు ఎక్కువ విడుదలయ్యేలా చేసుకోవచ్చు.
ఆక్సిటోసిన్
దీన్నే లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ప్రియమైనవారితో బంధం మరింత బలపడేందుకు ఈ హార్మోనే కారణం. నచ్చిన వాళ్లు మనల్ని తాకినప్పుడు లవ్ హార్మోన్ అధికంగా విడుదలవుతుంది. సంగీతం, వ్యాయామం చేసినప్పుడు ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది హైపోథాలమస్ లో ఉత్పత్తి అవుతుంది, పిట్యూటరీ గ్రంథి ద్వారా రక్తప్రవాహంలోకి విడుదల అవుతుంది. ప్రసవాన్ని సులభతరం చేసే హార్మోన్ కూడా ఇదే. ఆక్సిటోసిన్ ను సహజం ఉత్పత్తయ్యేలా చేయాలంటే వ్యాయామం చేయడం, నచ్చినవాళ్లని కౌగిలించుకోవడం, ఎవరినైనా ప్రేమించడం వంటివి చేయాలి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: సాయిపల్లవి జీరో సైజ్ ఫిగర్ వెనుక రహస్యాలివే...
Also read: ఒత్తిడి ఎక్కువైపోతుందా.... వీటిని తినడం అలవాటు చేసుకోండి
Also read: విటమిన్ సి వల్ల జలుబు తగ్గుతుందా? నిజమేనా?
Also read: ఇంతవరకూ డెంగ్యూ వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేకపోయారు? వచ్చే అవకాశం ఉందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి