How to Check Fatty Liver at Home : నేటి ఉరుకుల, పరుగుల జీవితంలో.. ఆహారం లేదా విశ్రాంతి తీసుకోవడానికి సరైన సమయం ఉండట్లేదు. ఈ పరిస్థితిల్లో మన జీవనశైలి వల్ల ముందుగా ప్రభావమయ్యేది కాలేయమే. లివర్​ మన శరీరాన్ని శుభ్రపరచడం, టాక్సిన్లను బయటకు పంపపడం, మెరుగైన జీర్ణక్రియను అందించడం, శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే మన లైఫ్​స్టైల్​ వల్ల దీనిపై కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. పైగా లివర్ సమస్యలు అంత తేలిగ్గా బయటపడవు. కాబట్టి సైలెంట్​గా సమస్య రెట్టింపు అయిపోతుంది. 

లైఫ్​స్టైల్​లో మార్పుల వల్ల కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోతుంది. క్రమంగా ఇది తీవ్రమైన ప్రమాదానికి కారణమవుతుంది. ఈ విషయంపై డాక్టర్ సరీన్ ఏమంటున్నారంటే.. "ఫ్యాటీ లివర్​ను తరచుగా 'సైలెంట్ కిల్లర్' అంటాము. ఎందుకంటే దాని ప్రారంభ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి కాబట్టి.. మనం వాటిని విస్మరిస్తాము. అలా జరిగి పరిస్థితి చేజారకుండా ఉండాలంటే.. ఇంట్లోనే మీకు ఫ్యాటీ లివర్ ఉందా లేదో చెప్పగలిగే సంకేతాలు, ఆదిలోనే దానిని తగ్గించుకునేందుకు ఫాలో అవ్వాల్సిన ఇంటి చిట్కాలు" ఇవేనంటూ తెలిపారు. 

ఫ్యాటీ లివర్ సంకేతాలు ఇవే

  • నిరంతరం అలసట 

ఎటువంటి శ్రమ లేకుండా రోజంతా అలసటగా అనిపిస్తే.. అది ఫ్యాటీ లివర్​కు సంకేతమే కావచ్చు. కాలేయం పనితీరు తగ్గితే శరీరం శక్తిని ఉత్పత్తి చేయదు. దీనివల్ల రోజంతా అలసటగా, నీరసంగా ఉంటుంది. 

  • పొత్తికడుపు పై భాగంలో బరువు

కాలేయం కుడి వైపున ఉంటుంది. అయితే లివర్​ దగ్గర కొవ్వు పేరుకుపోతుంటే.. ఆ ప్రాంతంలో కాస్త ఒత్తిడి లేదా బరువుగా ఉంటుంది. ఇది ఫ్యాటీ లివర్​కు సంకేతం కావచ్చు.

  • బరువు పెరగడం లేదా పొట్ట పెరగడం

కాలేయంలో కొవ్వు పేర్కొన్నప్పుడు జీవక్రియ నెమ్మదిస్తుంది. మెటబాలీజం తగ్గితే కొవ్వు తగ్గదు. దీనివల్ల పొత్తికడుపులో కొవ్వు ఎక్కువ అవుతుంది. లేదా పూర్తి బరువు కూడా పెరిగిపోతుంది. 

  • జీర్ణ సమస్యలు, గ్యాస్ ఇబ్బందులు

తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం.. పదే పదే జీర్ణ సమస్యలు రావడం.. గ్యాస్ ఎక్కువగా ఏర్పడటం వంటివి కాలేయంపై అదనపు భారం పడుతుందని సూచించే సంకేతాలు. 

  • చర్మం లేదా కళ్లు పసుపు రంగులోకి మారడం

కాలేయంపై ఎక్కువ ప్రభావం ఉంటే.. చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. ఇది తీవ్రమైన సంకేతంగా పరిగణించాలి. వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

  • ఉదయాన్నే నిమ్మరసం, గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీనివల్ల కాలేయం డీటాక్స్ అవుతుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. 
  • నూనె, బాగా వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలి. వీలైనంత వరకు నూనెను తగ్గించి తీసుకోవాలి. 
  • ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవడం కాలేయానికే కాదు పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
  • ఈ లక్షణాలు కొనసాగితే కచ్చితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలి. విస్మరిస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ఫ్యాటీ లివర్​ను ఆదిలో గుర్తించకుంటే సైలెంట్​గా పెరిగి.. ప్రమాదకరం అవుతుంది. కాబట్టి వీటిలో ఏ లక్షణాలు మీకు ఉన్న వైద్యుల సహాయం కచ్చితంగా తీసుకోవాలి. ముందుగానే కాలేయ సమస్యను గుర్తిస్తే.. చాలా సులభంగా ఫ్యాటీ లివర్​ను అదుపులోకి తెచ్చుకోవచ్చు. కాబట్టి అస్సలు విస్మరించకండి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.