కంటి చూపు మెరగ్గా ఉండాలంటే బాల్యం నుంచే అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు పౌష్టికాహరం అందించడం, బ్లూరేస్ వెదజల్లే బ్లూస్క్రీన్స్ నుంచి దూరంగా ఉంచడం ద్వారా కంటి చూపును కాపాడవచ్చు. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పిల్లలు చూపు కోల్పోవడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మూడేళ్లపాటు జరిపిన అధ్యయనంలో కీలక విషయాలను తెలుసుకున్నారు. కంటిలో తక్కువ మోతాదులో అట్రోపి చుక్కలు వాడడం వల్ల హస్వ దృష్టి లోపంతో బాధపడుతున్న పిల్లల్లో కంటి చూపు మెరుగవుతుందని కనుగొన్నారు.
రోజూ ఒక చుక్క అట్రోపి కళ్లలో వెయ్యడం వల్ల కంటి పాప పెరుగుదల నియంత్రణలో ఉంటుందని కొత్త పరిశోధన రుజువు చేస్తోంది. 6 నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లల్లో దగ్గరి దృష్టి లోపంతో బాధపడేవారికి కంటి అద్దాల కంటే ఇది బెటర్ అని ఈ పరిశోధకులు అంటున్నారు. ఈ దృష్టి లోపాన్ని మయోపియా లేదా హ్రస్వదృష్టి అని అంటారు. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. టీనేజికి వచ్చేసరికి ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. కొంత మందిలో జీవితాంతం విజన్ కరెక్షన్ చికిత్సలు కూడా అవసరమవుతాయి.
మయోపియా వల్ల రెటినల్ డిటాచ్మెంట్, మాక్యూలార్ డీ జెనరేషన్, కాటరాక్ట్ వంటి సమస్యలు మాత్రమే కాదు భవిష్యత్తులో గ్లకోమా వంటి సీరియస్ సమస్యలు కూడా రావచ్చు. ఎంత మంచి లెన్సులు వాడినా సరే కొన్ని సార్లు మయోపియా తీవ్రం కాకుండా నివారించడం సాధ్యపడక పోవచ్చు. కేవలం దృష్టి లోపం సవరించడం మాత్రమే కాదు.. చికిత్స అంటే వారి 70 సంవత్సరాల వయసులో కూడా దృష్టికోల్పోకుండా కాపాడడం అనే అబిప్రాయాన్ని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఆప్టిమెట్రీ ప్రొఫెసర్ కర్లా జాడ్నిక్ వెలువరించారు.
వేలాది మంది మయోపిక్ పిల్లలో సమస్యను పరిష్కరించేందుకు మార్గం సుగమం కాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిశోధనకు ఛాంప్ అని పేరు పెట్టారు. చాంప్ అంటే చైల్డ్ హుడ్ అట్రోపిన్ ఫర్ మయోపియా ప్రొగ్రేషన్ అని అర్ధం. పెద్దవారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు మయోపియాతో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య రెట్టింపు కావచ్చని అంచనా. కాంటాక్ట్ లెన్స్ తో వ్యాధి తీవ్రమయ్యే వేగాన్ని తగ్గించవచ్చని ఒక వాదన కూడా ఉంది.
జంతువుల మీద జరిపిన ప్రయోగాలు ఏళ్ల క్రితమే కంటి పాప పెరుగుదలను నియంత్రించడంలో అట్రోపిన్స్ సమర్థవంతంగా ఉన్నట్టు నిరూపితమయ్యాయి. కానీ మానవ కంటి పాప మీద ఎలా పనిచేస్తాయో నిరూపించేందుకు జరిగిన ఈ కొత్త పరిశోధనల్లో తక్కువ డోస్ లో వాడే అట్రోపిన్ మంచి ఫలితాలు ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొత్త ట్రయల్స్ లో 489 మంది 6 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లల్లో ప్రతి కంటిలో ఒక చుక్క అట్రోపిన్ 0.1 శాతం లేదా 0.2 శాతం సోల్యూషన్ రాత్రి నిద్రకు ముందు ఉపయోగించడం వల్ల దగ్గరి వస్తువుల దృష్టిలో స్పష్టత మెరుగైనట్టు గుర్తించారట.
ప్లెసిబోతో పోల్చినపుడు అట్రోపిన్ సొల్యూషన్ మంచి ఫలితాలను ఇవ్వడం చూసి పరిశోధకులు ఆశ్చర్యానికి గురయ్యారు. మయోపియా తీవ్రం కావడాన్ని నియంత్రించడంలో ప్లెసిబో కంటే అట్రోపిన్ మెరుగ్గా ఉండడం మాత్రమే కాదు, ఫలితాలు స్థిరంగా కూడా ఉన్నాయి. అయితే 0.1 శాతం అట్రోపిన్ వాడిన వారిలో ఫలితాలు మరింత మెరుగ్గా ఉన్నాయని కంటి పాప పెరుగుదల నియంత్రణలో ఉండడం మాత్రమే కాదు తక్కువ పవర్ ఉన్న లెన్స్ సరిపోతున్నాయని జాండిక్ అంటున్నారు.
కంటి పాప పరిమాణం కొలవడమే ఈ పరిశోధనలో ముఖ్యమైన అంశం. కంటి పాప పెరుగుదలను నియంత్రించడం కోసం ఈ పరిశోధన సాగితే వారి 80 సంవత్సరాల వయసులో కూడా వారి కంటిపాప పరిమాణం నియంత్రణలో ఉండడమనేది చాలా ముఖ్యమైన విషయమవుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తల ఉద్దేశ్యం.
ఈ దిశగా సాగిన పరిశోధనల్లో చాంప్ మొదటి పరిశోధన మాత్రమే కాదు విజయవంతమైన ఫలితాలు కూడా సాధించిందని చెప్పాలని ఈ నిపుణులు అంటున్నారు.
Also read : డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.