ప్రశ్న: నేను నా పెళ్ళికి ముందు ప్రేమలో ఉన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అది పెళ్లి వరకు చేరలేదు. దీంతో పెద్దలు చూపించిన అబ్బాయిని వివాహం చేసుకున్నాను. నా భర్త చాలా మంచివాడు. నాకు అన్ని సౌకర్యాలను అందించాడు. నేను కష్టపడకూడదని ఉద్యోగం కూడా మానిపించాడు. నా భర్త నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ ఎందుకో ఈ బంధం నా మనసును నింపలేకపోతోంది. ఇంకా నాకు నా మాజీ లవర్ ప్రేమనే గుర్తుకొస్తోంది. అతను చేసే చిలిపి పనులు జ్ఞాపకాల్లో వెంటాడుతున్నాయి. అతన్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తోంది. నా భర్తతో నేను సంతోషంగానే ఉన్నాను. కానీ నా మాజీ లవర్ మనసుకు దగ్గర అయినంతగా నా భర్త నా మనసుకు దగ్గర అవ్వలేదు. నా భర్త చాలా తక్కువగా మాట్లాడతాడు. నాకు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. పెళ్లయ్యాక కూడా ఇలా మాజీ లవర్ గుర్తు రావడం నాలో అపరాధ భావం పెంచుతోంది. ఇది తప్పని తెలుసు, అయినా అతని ఆలోచనలు, ఊహల నుంచి తప్పించుకోలేకపోతున్నా. నాకు అతనితో తిరిగి మాట్లాడే, కలిసే ఉద్దేశం లేదు కానీ మనసులో, మెదుడులో అతని ఆలోచనలు నిండి ఉన్నాయి. ఇప్పటికి మాకు పెళ్లయి ఏడాది దాటుతోంది. అయినా నేను ఇంకా అతనిని తలచుకోవడం నా భర్తను మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మాకు ఇంకా పిల్లలు లేరు. ప్లానింగ్లో ఉన్నాం. కానీ నేను ఈ అపరాధ భావంతో పిల్లల్ని కనలేను. ఏం చేయమంటారో చెప్పండి.


జవాబు: మీ భర్త మంచివాడని మీరే చెబుతున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని కూడా అంటున్నారు, మీరు కష్టపడకూడదని ఉద్యోగం కూడా మాన్పించాడని,  మీకు కావాల్సినవన్నీ అందుబాటులోనే ఉంచుతారని అంటున్నారు. ఇంత చెప్పిన మీరు ఇంకా అతనిపై ప్రేమ పూర్తిగా పుట్టలేదని చెప్పడంలో అర్థం లేదు. మీరు మీ భర్తని ప్రేమిస్తున్నారు కాబట్టే అతని మంచిగుణాలను గుర్తించి, చెప్పగలుగుతున్నారు.  కాకపోతే మీ భర్త వ్యక్తిత్వం, మీ మాజీ లవర్ వ్యక్తిత్వం రెండు విభిన్నంగా ఉన్నాయి. మీ భర్త మీతో తక్కువ కమ్యూనికేట్ చేసి ఎక్కువ సౌకర్యాలను, ప్రేమను అందిస్తున్నారు. కానీ మీ మాజీ లవర్ ఎక్కువ మాట్లాడుతూ, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉండేవాడు. మీకు ఆ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మిస్ అయింది. అదే మిమ్మల్ని ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ను కలిగిస్తుంది. మీ భర్త తక్కువ మాట్లాడే వ్యక్తి కావడమే ఈ సమస్యకు కారణంగా కనిపిస్తోంది. అంతే తప్ప పెద్ద సమస్య ఏమీ లేదు. ముందుగా మీరు మీ భర్తతో లోతుగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి. రోజులో రెండు నుంచి మూడు గంటల పాటు మాట్లాడుకోండి. ఎంతగా కమ్యూనికేషన్ పెరిగితే అంతగా ప్రేమ పెరుగుతుంది.


మీ భర్త తక్కువగా మాట్లాడుతున్నారని మీరు కూడా మాట్లాడడం తగ్గిస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కాబట్టి మీ భర్తకు మాట్లాడడం మీరే నేర్పించండి. దగ్గరుండి నవ్వించండి. ఎక్కువసేపు మీ సాంగత్యంలోనే ఉండేలా చూసుకోండి. ఇద్దరూ కలిసి బయటికి ఎక్కువగా వెళుతూ ఉండండి. అతనిలో ఉన్న హ్యూమరస్ కోణాన్ని మీరు బయటకి తీయడానికి ప్రయత్నించండి. మీ మెదడుకు, మనసుకు ఆలోచించే తీరికను ఇవ్వకండి. ఏదో ఒక పనిని చేస్తూ ఉండండి. ముఖ్యంగా మీ భర్త గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం కేటాయించండి. అతనిలోని మంచి గుణాలను ఎక్కువగా తలుచుకోండి. అలాగే పిల్లలు పుట్టాక ఎలాంటి సౌకర్యాలు అందించాలి, వారిని ఎలా పెంచాలి వంటి ఆలోచనలతో మీ మెదడును నింపుకోండి. ఇక మీ మాజీ లవర్ గుర్తుకు వచ్చే అవకాశం ఉండదు. మీకు ప్రేమకు లోటు లేదు కానీ ఆ ప్రేమను మీరు చూడలేకపోతున్నారు. అందరూ అబ్బాయిలు ఒకేలా ప్రేమించాలని లేదు, మీ భర్త తనకు తెలిసిన విధంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు ఆ ప్రేమను మాజీ ప్రేమతో పోల్చడం, ఒంటరిగా బాధపడడం చాలా తప్పు. అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి, మరింత అందంగా మార్చుకోండి. 



Also read: మెరుస్తున్న పుట్టగొడుగులను చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే, మన దేశంలోనే ఉంది ఈ ప్రదేశం

























































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.