RO Wastewater Reuse Tips:ఆధునిక కాలంలో పట్టణ ప్రాంతాల్లో ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫైయర్‌ ప్రతి ఇంట్లో ఒక నిత్యవసర వస్తువుగా మారింది. భూగర్భ జలాలు కలుషితం  కావడం, నీటిలో లవణాల శాతం పెరగడంతో ఆరోగ్యం కోసం ప్రజలు ఈ టెక్నాలజీపై ఆధారపడుతున్నారు.అయితే ఈ శుద్ధి ప్రక్రియలో మనకు తెలియకుండానే భారీ స్థాయిలో నీరు వృథా అవుతోంది. నివేదికల ప్రకారం ఒక లీటరు  స్వచ్ఛమైన నీటిని పొందడానికి ఆర్‌ఓ సిస్టమ్‌ సుమారు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని బయటకు పంపుతుంది. ఈ నీరు నేరుగా డ్రైనేజీలోకి వెళ్లడం వల్ల ఏటా వేల లీటర్ల జలం వృతా అవుతోంది. 

Continues below advertisement

ఆర్‌ఓ నీరు ఎందుకు వృథా అవుతుంది?

ఆర్‌ఓ ప్యూరిఫైయర్లు సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనే సాంకేతికతతో పని చేస్తాయి. నీటిలోని కలుషితాలను, భార లోహాలను, బ్యాక్టీరియాను ఈ మెంబ్రేన్ అడ్డుకుంటుంది. ఈ మెంబ్రేన్ పాడవకుండా ఉండటానికి , అి నిరంతరం తనను తాను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా కలుషితాలు అధికంగా ఉన్న నీటిని బయటకు పంపిస్తుంది. దీనినే మనం రిజెక్ట్ వాటర్‌ లేదా వేస్ట్ వాటర్ అంటాం. ఈ నీటిలో టీడీఎస్‌ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలు అధిక సాంధ్రతలో ఉంటాయి. 

ప్రభాత్‌ విజయన్ స్ఫూర్తిదాయక ప్రయాణం

బెంగళూరుకు చెందిన ప్రభాత్ విజయన్ అనే వ్యక్తి తన ఇంట్లో ఆర్‌ఓ ప్యూరిఫైయర్‌ నుంచి వృథా అయ్యే నీటిని చూసిన చలించిపోయారు. కేవలం ఒక డ్రమ్‌, ఒక స్క్రూడ్రైవర్‌తో ఆయన ఒక సింపుల్‌ డీఐవై సెటప్‌్ తయారు చేసుకున్నారు. తద్వారా ఏడాదికి ఏకంగా 24వేల లీటర్ల నీటిని ఆదా చేస్తున్నారు. మనకు నీటి ఎద్దడి పెరుగుతున్న తరుణంలో, ఇలాంటి చిన్న మార్పులు భారీ ఫలితాలను ఇస్తాయని ఆయన నిరూపించారు. 

Continues below advertisement

ఆర్‌ఓ వేస్ట్ వాటర్‌ను వినియోగించుకునే పది మార్గాలు 

ఫ్లోర్‌ క్లీనింగ్ 

ఆర్‌ఓ వేస్ట్ వాటర్‌  ఫ్లోర్ తుడవడానికి అత్యంత అనువైంది. ఇందులో ఉండే స్వల్ప లవణీయత మొండి మరకలను తొలగించడానికి కూడా సహయపడుతుంది. రోజూ ఒక బకెట్‌లో ఈ నీటిని సేకరించి, ఇల్లు కడగటానికి వాడటం ద్వారా మంచి నీటిని ఆదా చేయవచ్చు. 

టాయిలెట్ ఫ్లషింగ్

ఇంట్లో అత్యధికంగా నీరు ఖర్చు అయ్యేది టాయిలెట్‌లోనే ఆర్‌ఓ వేస్ట్ వాటర్‌ను నేరుగా ఫ్లష్‌ ట్యాంకుల్లో పోయవచ్చు. లేదా బకెట్‌తో ఫ్లషింగ్ కోసం ఉపయోగించవచ్చు. 

మొక్కల పెంపకానికి 

ఈ నీటిని మొక్కలకు పోయవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం. కలబద, మందార, గన్నేరు వంటి ఎక్కువ లవణాలను కట్టుకునే మొక్కలకు ఈ నీరు అనువైంది. అయితే సున్నితమైన మొక్కలు లేదా ఆర్కిడ్స్‌ వంటి వాటికి ఈ నీటిని వాడకూడదు. సాధారణ నీటితో కలిపి వాడటం మంచిది. 

వాహనాల క్లీనింగ్‌ 

కారు లేదా బైక్ కడగడానికి భారీగా నీరు అవసరం అవుతుంది. ఆర్‌ఓ నుంచి వచ్చే నీటిని సేకరించి, వాహనాల టైర్లు, బయటి భాగాలను శుభ్రం చేయడానికి వాడవచ్చు. వాహనం తుడిచి తర్వాత మచ్చలు పడకుండా పొడి బట్టతో తుడవటం మంచిది. 

బట్టలు నానబెట్టడానికి 

మురికి ఎక్కువగా ఉన్న బట్టలను నానబెట్టడానికి ఈ నీటిని వాడవచ్చు దీని వల్ల వాషింగ్ మెషిన్‌లో తక్కువ మంచినీరు అవసరమవుతుంది. అయితే పట్టు వస్త్రాలు లేదా సున్నితమైన రంగులున్న బట్టలకు ఈ నీటిని వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. 

పాత్రల శుభ్రత 

వంట పాత్రలలోని జిడ్డును, ఆహార పదార్థాలను వదలగొట్టడానికి ఆర్‌ఓ వేస్ట‌ వాటర్‌ను వాడుకోవచ్చు. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగితే సరిపోతుంది. 

పెస్ట్ కంట్రోల్ 

తోటలలో లేదా ఇంటి మూలల్లో ఈ నీటిని చల్లడం వల్ల కొన్ని రకాల కీటకాలు దరిచేరవు. ఇందులో లవణాలు సహజమైన కీటక నివారిణిగా పని చేస్తాయి.

పనిముట్ల శుభ్రత కోసం 

తోటలో వాడే పనిముట్లపై ఉన్న మట్టిని తొలగించడానికి ఈ నీటిని ఉపయోగించడం ద్వారా మంచినీటిని వృథా కాకుండా చూడవచ్చు. ఇంటి ముందు మెట్లు, డ్రైవ్‌వే లేదా పోర్చ్‌ను శుభ్రం చేయడానికి ఈ నీరు చక్కగా పని చేస్తుంది. 

కూలర్‌లలో వినియోగం

ఎయిర్‌ కూలర్లలో సాధారణ నీటికి బదులు ఈ నీటిని వాడవచ్చు. అయితే కూలర్ ప్యాడ్లపై లవణాలు పేరుకుపోయే అవకాశం ఉన్నందున క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. 

ఆర్‌ఓ వేస్ట్ వాటర్‌తో చేయకూడని పనులు 

ఆర్‌ఓ వేస్ట్ వాటర్‌లో టీడీఎస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు. వంటకు, స్నానానికి , తల స్నానానికి వాడకూడదు. ఎందుకంటే చర్మం, వెంట్రుకలపై ప్రభావం చూపుతుంది. జంతువులకు తాగించవద్దు.