WHO On Ebola Outbreak : ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో మరోసారి ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు విషయాలు వెల్లడించింది. ఇప్పటివరకు 600కు పైగా ఎబోలా అనుమానిత కేసులు నమోదు కాగా.. 139 మరణాలు జరిగినట్లు WHO (World Health Organization) తెలిపింది. ఈ పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించి.. పలు సూచనలు చేసింది.

Continues below advertisement

బుండిబుగ్యో రకం..

ఈసారి వ్యాపిస్తోన్న ఎబోలా వైరస్ స్ట్రెయిన్ బుండిబుగ్యో. ఇది చాలా అరుదైన రకమని చెప్తున్నారు నిపుణులు. ఇది సాధారణ ఎబోలా కంటే తక్కువగా కనిపించినా.. చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదని అంటున్నారు.

ఎబోలా ఎలా వ్యాపిస్తుంది?

ఎబోలా వైరస్ సోకిన వ్యక్తి రక్తం, శరీర ద్రవాలు లేదా కలుషిత వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదని నిపుణులు చెబుతున్నప్పటికీ.. దగ్గర సంబంధాల ద్వారా వేగంగా సోకే అవకాశం ఉంటుందని మాత్రం హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రులు, సంరక్షణ కేంద్రాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు.

Continues below advertisement

ఎబోలా లక్షణాలు ఇవే

వైరస్ సోకిన 2 నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు కనిపించొచ్చు. ప్రారంభంలో జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత తీవ్రమైన వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం కూడా జరగొచ్చు. పరిస్థితి విషమిస్తే అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

అప్రమత్తమవుతోన్న దేశాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల మేరకు.. ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా CDC అప్రమత్తమైంది. ఇటీవల DRC, ఉగాండా, సౌత్ సూడాన్ వెళ్లి వచ్చిన విదేశీయులపై ప్రయాణ ఆంక్షలు విధించింది. అలాగే అక్కడికి వెళ్లొద్దని అమెరికా ఇప్పటికే తన పౌరులకు సూచించింది.ప్రస్తుతం అమెరికా వంటి దేశాలకు ముప్పు తక్కువగానే ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఎబోలా కరోనా లాగా గాలి ద్వారా వ్యాపించదు. అయినప్పటికీ భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎబోలా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేవారు అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. చేతుల పరిశుభ్రత పాటించడంతో పాటు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.