బిజీ జీవితంలో ఫేస్‌ప్యాక్‌లు, ట్యాన్ రిమూవర్లు, స్క్రబ్ పూసేంత సమయం ఎక్కడ ఉంది? అలాగని చర్మాన్ని పట్టించుకోకుండా వదిలేయలేం. ఎక్కడికి వెళ్లినా అందరూ మొదట చూసేది మన ముఖమే కదా. బిజీగా ఉండే వారు చర్మసంరక్షణకు అధికం సమయం వెచ్చించలేకపోతున్నారా? అయితే రోజూ ఓ గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులు తినండి చాలు. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం. ఏడెనిమిది బాదం పప్పులు ముందు రోజు నానబెట్టుకుని మరుసటి రోజు ఉదయం తినేయండి. వీటితో పాటూ నీరు అధికంగా తాగుతూ, పండ్లు తినండి చాలు. మీరు బ్యూటీపార్లర్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. 


సర్వే చెబుతున్నదిదే
ఓ కన్సల్టింగ్ సంస్థ గతేడాది డిసెంబర్లో ఓ సర్వే నిర్వహించారు. అందులో మనదేశంలోని 72శాతం మంది మహిళలు అందమైన చర్మం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేందుకు, ఆహారంలో మార్పులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు సౌందర్య ఉత్పత్తుల ద్వారా కాకుండా మంచి ఆహారం ద్వారా అందంగా మారాలనుకుంటున్నట్టు తవవారు తెలిపారు. దాని వల్ల ఆరోగ్యం కూడా లభిస్తుందని వారి నమ్మకం. ఢిల్లీ, లక్నో, జైపూర్, ఇండోర్, కోల్ కతా, కోయంబత్తూర్, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఈ సర్వే నడిచింది. 


పండ్లు, బాదం
ఆడవాళ్లు అందాన్ని పెంచుకోవడం కోసం పండ్ల మీదే అధికంగా ఆధారపడుతుంటారు. వారు బాదం గింజల ప్రాధాన్యత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పండ్లతోపాటూ రోజూ బాదం గింజలు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అదనంగా అందంగా కూడా దక్కుతుంది. బాదం గింజల్లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మ రక్షణకు చాలా అవసరం. వీటిని తరచూ తినడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు తగ్గడం, చర్మం మెరుపు సంతరించుకోవడం జరుగుతుంది. బాదం పప్పు తినడం మొదలుపెట్టిన నెలరోజుల్లోనే చర్మంలో మార్పు కనిపిస్తుంది. ఆరునెలలకు పైగా తిన్నవారిలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 


బాదంపప్పుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మంపై చర్మంపై వృద్ధాప్య లక్షణాలు కనిపించకుండా చేస్తాయి. అందుకే కనీసం రోజుకు గుప్పెడు తినలేని వారు కనీసం నాలుగైదు తినేందుకైనా ప్రయత్నించాలి.