Winter Foods for Immunity : వాతావరణం మారగానే చాలామంది వివిధ జబ్బులతో ఇబ్బంది పడతారు. ముఖ్యంగా చలికాలంలో జలుబు, జ్వరం లేదా గొంతు ఇన్ఫెక్షన్ల బారిన ఎక్కువ పడతారు. ఈ ఇన్ఫెక్షన్లు రావడానికి ప్రధానకారణం బలహీనమైన రోగనిరోధక శక్తి. శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు.. అది మారుతున్న ఉష్ణోగ్రతల్లో వచ్చే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోలేదు. కాబట్టి ఇమ్యూనిటీకోసం ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి.  ఫుడ్ శరీరాన్ని లోపలి నుంచి బలంగా మార్చుతుంది. అలాగే మీరు ఎంచుకున్న ఫుడ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరి మెరుగైన ఇమ్యూనిటీకోసం కచ్చితంగా చేర్చుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

బాదం

బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. కాబట్టి వాతావరణం మారే రోజుల్లో ప్రతిరోజూ కొన్ని బాదం నానబెట్టి తినడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు అందుతాయి. అలసట కూడా తగ్గుతుంది.

ఉసిరి

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరి ఉత్తమమైనదిగా చెప్తారు. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లను పెంచుతుంది. రోగనిరోధక కణాలను ఉత్తేజితం చేస్తుంది. ప్రతిరోజూ ఒక ఉసిరి తినడం వల్ల శరీరం బలపడుతుంది. వాతావరణం మారినప్పుడు జలుబు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. మీరు దీనిని జ్యూస్ రూపంలో లేదా కషాయం రూపంలో తీసుకోవచ్చు. 

Continues below advertisement

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో ప్రతిరోజూ రాత్రి పసుపు కలిపిన పాలు తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచి.. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

నారింజ

చలికాలంలో నారింజ కచ్చితంగా తీసుకోవాల్సిన పండులలో ఒకటి. ఇందులో ఉండే విటమిన్-సి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఒక నారింజ తినడం వల్ల జలుబు వంటి సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. 

సీడ్స్, నట్స్

వాల్‌నట్, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలలో జింక్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి సహాయపడతాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

నిమ్మరసం

వాతావరణం మారినప్పుడు మీరు డైట్లో నిమ్మరసం కూడా చేర్చుకోవచ్చు. ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే శరీరానికి చాలా మంచిది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్-సి ఇన్ఫెక్షన్లను నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

లైఫ్​స్టైల్​లో చేయాల్సిన మార్పులు

రోగనిరోధక శక్తికోసం సరైన ఆహారం తీసుకోవడమే కాదు రొటీన్​లో కూడా కొన్ని మార్పులు చేయాలి. అవి కూడా ఇమ్యూనిటీపై ప్రభావం చూపిస్తాయి. అలాంటివాటిలో నిద్ర ఒకటి. సరైన నిద్ర లేకుంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. కాబట్టి రోజూ 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. ఒత్తిడి ప్రభావం కూడా ఇమ్యూనిటీపై ఉంటుంది కాబట్టి.. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం, యోగా చేస్తే మంచిది. తగినంత నీరు తీసుకోండి. చలికాలంలో మేజర్​గా చేసే తప్పు నీళ్లు తీసుకోకపోవడం. హైడ్రేటెడ్​గా ఉంటే శరీరంలోని టాక్సిన్‌లు బయటకుపోతాయి. ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.