గుండె జబ్బులు ఎప్పుడు, ఎవరిని ఎలా ఎటాక్ చేస్తాయో చెప్పలేం. అందుకే వయసు ముదిరిన వారే కాదు, యుక్త వయసులో ఉన్న వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ‘జర్నల్ ఆఫ్ ద అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ ప్రకారం వారానికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు అవకాడో పండ్లు తినడం వల్ల గుండెను కాపాడుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో అవకాడో  పండ్లు ముందుంటాయి. అవకాడో పండ్లలో డైటరీ ఫైబర్, అసంతృప్త కొవ్వులు, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ (ఆరోగ్యకరమైన కొవ్వులు) నిండుగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ, హృదయసంబంధ వ్యాధుల విషయంలోనూ అవకాడోలు సానుకూల ప్రభావాలను చూపిస్తున్నట్టు తాజా అధ్యయనం తేల్చింది.


మొక్కల ఆధారిత ఆహారం
అవకాడోలు మొక్కల ఆధారిత ఆహార జాబితాలోకి వస్తుంది. మొక్కల మూలంగా లభించే ఆహారంలో అసంతృప్త కొవ్వులు ఆ ఆహార నాణ్యతను పెంచుతాయి. అవి హృదయ సంబంధ వ్యాధులను అడ్డుకోవడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముప్ఫై ఏళ్లుగా పరిశోధకులు 68,780 మంది స్త్రీలు, 41,700 మంది పురుషులపై అధ్యయనం నిర్వహించారు. వారి వయసులు 30 నుంచి 75 ఏళ్లలోపు ఉన్నాయి. అధ్యయనం ప్రారంభంలో అంటే ముప్పై ఏళ్ల క్రితం వీరంతా క్యాన్సర్, కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ వంటి ఆరోగ్యసమస్యలు లేకుండా ఉన్నారు. తరువాతి కాలంలో 9,185 మందిలో కరోనరీ హార్ డిసీజ్, 5,290 మందిలో స్ట్రోక్ వచ్చిన సందర్భాలను నమోదు చేశారు.అధ్యయనంలో పాల్గొన్న అందరి ఆహారపు అలవాట్లను ఏ రోజుకారోజు నమోదు చేసేలా ఏర్పాటుచేశారు. వాటిని ప్రతి నాలుగేళ్లకోసారి చూసి ఎలాంటి ఆహారాన్ని వారు అధికంగా తింటున్నారో అంచనా వేసేవారు. 


ఆహారంలో భాగంగా అవకాడోను తీసుకుంటున్న వారిలో గుండె సంబంధ వ్యాధులు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రతి వారం కనీసం రెండు సార్లు అవకాడోలు తింటే గుండె వ్యాధులు 16 శాతం తగ్గినట్టు గుర్తించారు. అలాగే కరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పు 21 శాతం తక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు. నిజానికి చాలా మంది అవకాడోను తినరు. కానీ తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులను తప్పించుకోవచ్చని ఈ పరిశోధన తేల్చింది. 


మనదేశంలో అవకాడోల వాడకం చాలా తక్కువ. అవి మన దేశంలో పండేవి కాకపోవడం వల్లే  ఎక్కువమందికి అందుబాటులో లేకుండా ఉన్నాయి. సూపర్ మార్కెట్లలో, ఆన్ లైన్ గ్రోసరీలలో మాత్రం అవకాడోలు లభిస్తుంటాయి. కానీ రేట్లు మాత్రం అధికంగా ఉంటాయి. 


Also read: మీకు ఈ బొమ్మలో ఏ జంతువు కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడులో ఏ వైపు బాగా పనిచేస్తుందో చెప్పొచ్చు


Also read: పెళ్లికి వెళుతున్నారా? ఇలాంటి పెళ్లికూతుళ్లు చేసే పనికి మీరు బలైపోగలరు జాగ్రత్త