Dusshera Special Chakkera Pongali Recipe : దసరా (Dusshera 2024) సమయంలో అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. అందుకే వీటిని నవరాత్రులు అంటారు. ఈ సమయంలో అమ్మవారికి వివిధ రకాల టేస్టీ వంటకాలను నైవేద్యాలుగా పెడతారు. తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్ధినిగా కనిపిస్తారు. ఇదే రోజు అమ్మవారు మహిషాసురుని సంహరించినట్లు పురాణాలు చెప్తాయి. ఈ సమయంలో అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు. ఈ టేస్టీ రెసిపీని అమ్మవారికి ఎలా తయారు చేసి పెట్టాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


పెసరపప్పు - పావు కప్పు


బియ్యం - ముప్పావు కప్పు


నీళ్లు - రెండు కప్పులు


ఉప్పు - చిటికెడు


బెల్లం తురుము - ఒకటిన్నర కప్పు


నీళ్లు - అరకప్పు


నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్


యాలకుల పొడి - అర టీస్పూన్


పచ్చ కర్పూరం - చిటికెడు 


నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు


జీడిపప్పు - 10


ఎండు కొబ్బరి - పావు కప్పు


ఎండుద్రాక్ష - 10


తయారీ విధానం


ముందుగా స్టౌవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. దానిలో పొట్టులేని పెసరపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. చల్లారిన తర్వాత దానిలో బియ్యం వేసుకోవాలి. బియ్యం, పప్పుని రెండుసార్లు కడిగి.. దానిలో నీళ్లు వేయాలి. పెసరపప్పు, బియ్యం కలిపి కప్పు వస్తే.. దానికి రెండు కప్పుల నీళ్లు వేయాలని గుర్తించుకోండి. మీరు ఎన్ని కప్పులు తీసుకుంటే.. వాటికి డబుల్ నీళ్లు పోయాలి. ఎంత చేసినా ఇదే కొలత. 


ఇలా నీళ్లు వేసుకుని చిటికెడు ఉప్పు వేసుకుని కుక్కర్ మూతపెట్టి స్టౌవ్ వెలిగించి రెండు విజిల్స్ రానివ్వాలి. అన్నం కాస్త పలుకుగా ఉంటేనే బెటర్. ఇలా చేసుకున్న పొంగలిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి మరో కడాయి పెట్టి.. దానిలో బెల్లం తురుము వేసి.. నీళ్లు వేయండి. బెల్లంకరిగి.. కాస్త పాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి. పూర్తిగా పాకం కావాల్సిన అవసరం లేదు. 


బెల్లం కాస్త తీగపాకం వచ్చిన తర్వాత దానిని వడకట్టి ఉడకబెట్టిన పొంగలిలో వేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పొంగలి పెట్టుకోవాలి. బెల్లంతో పాటు దీనిని ఉడికించుకోవాలి. అప్పుడు అన్నం పూర్తిగా ఉడికిపోతుంది.  దానిలో నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునేప్పుడు దానిలో పచ్చకర్పూరం వేసుకోవాలి. మీరు నార్మల్​గా వండుకునేప్పుడు దీనిని వేసుకోకపోయినా పర్లేదు. అనంతరం కుక్కర్​ని స్టౌవ్​పై నుంచి దించేయాలి.



ఇప్పుడు స్టౌవ్​పై చిన్న కడాయిని పెట్టుకోవాలి. దానిలో నెయ్యి వేసి.. జీడిపప్పు, ఎండుకొబ్బరి ముక్కలు, ఎండుద్రాక్షలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని పొంగలిలో వేసి కలిపేయాలి. అంతే టేస్టీ టేస్టీ చక్కెర పొంగలి రెడీ. దీనిని నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. దీనిని కేవలం నైవేద్యంగానే కాకుండా రెగ్యూలర్​గా కూడా చేసుకోవచ్చు. పైగా రెగ్యూలర్ ప్రసాదాల కోసం కూడా ఈ చక్కెర పొంగలి బెస్ట్ ఆప్షన్. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ టేస్టీ వంటకాన్ని మీరు కూడా ట్రై చేసేయండి. 


Also Read :  నిమ్మకాయ పులిహెర టెంపుల్ స్టైల్ రెసిపీ.. నవరాత్రుల్లో ఎనిమిదో రోజు నైవేద్యంగా చేసేయండి