ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి ఒక భాగం అయిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, మహిళలు ఇలా అంతా ఒత్తిడికి చిత్తవుతున్నారు. దాంతో ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకున్నారు. దీనికోసం రోజువారీ జీవితంలో పూర్వకాలపు ఆరోగ్య పద్ధతులను చేర్చుకుంటున్నారు. వీటిలో ఒకటి చాలా ప్రాచుర్యం పొందింది. అదే రాగి పాత్రల్లో (Copper Vessels)లో మంచి నీళ్లు తాగడం.
కొందరు ఇంట్లో రాగి బిందెలు, రాగి చెంబులలో నీళ్లు పోసి తాగుతుంటారు. కొందరు పని ప్రదేశాలలో రాగి బాటిల్స్ వినియోగిస్తుంటారు. ఆయుర్వేద సంప్రదాయంలో రాగి పాత్రలలో నీరు నిల్వ ఉంచి త్రాగడాన్ని ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని భావిస్తారు. కానీ శాస్త్రీయ పరంగా సైతం రాగి పాత్రలలో నీళ్లు తాగడం సురక్షితమా? ఇక్కడ తెలుసుకోండి..
రాగి పాత్రలో నీరు తాగడం ఎలా ప్రారంభమైంది?
రాగి పాత్రల్లో తాగునీటిని నిల్వ చేసుకునే ఆచారం ప్రాచీన భారతదేశానికి ఈజిప్టు నుండి వచ్చింది. ఆయుర్వేదంలో దీన్ని తామ్రజలం అంటారు. ఇది శరీరంలోని మూడు దోషాలను (వాతం, పిత్తం, కఫం) సమతుల్యం చేయడంలో దోహదం చేస్తుంది. శరీరాన్ని శుద్ధి చేయడంలో, మీ శక్తిని పెంచడంలో సహాయపడుతుందని భావిస్తారు.
నీటిలో రాగి కరుగుతుందా?
నీటిని రాగి పాత్రలో 6 నుండి 8 గంటలు లేదా రాత్రంతా నిల్వ చేసినప్పుడు, కొద్ది మొత్తంలో రాగి అయాన్లు నీటిలో కలిసిపోతాయి. ఈ ప్రక్రియను ఒలిగోడైనమిక్ ఎఫెక్ట్ అంటారు. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి.
ఇవి ప్రయోజనాలు
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది: రాగిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వాపు లాంటివి రాకుండా పోరాడటంలో సహాయపడతాయి.
- జీర్ణక్రియ: రాగి హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. మన కడుపులో వాపు, పుండ్లు, జీర్ణక్రియ సమస్యలు దూరం చేస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
- బరువు నియంత్రణ: రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు ప్రతిరోజూ తాగినే మీ బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఇది శరీరంలో అదనపు కొవ్వును సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది.
- ఆరోగ్యకరమైన చర్మం: శరీరంలో రాగి మెలనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని పునరుత్పత్తి చేయడంతో పాటు మచ్చలను తొలగిస్తుంది.
- థైరాయిడ్ సమతుల్యత: థైరాయిడ్ గ్రంధి పనితీరుకు రాగి కావాలి. దాని లోపం అసమతుల్యతకు దారితీస్తుంది.
రాగి పాత్రలను ఎలా ఉపయోగించాలి?
- రాగి సీసాను శుభ్రమైన నీటితో నింపాలి. దాన్ని రాత్రంతా లేదా కనీసం 6 గంటలు ఉంచండి.
- రాగి పాత్రలోని నీటి ద్వారా ఫలితాలు పొందాలంటే ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి
- రాగి అధికంగా శరీరంలో చేరకుండా ఉండటానికి, రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆ పాత్రలో పోసిన నీళ్లు తీసుకోవాలి.
- ఆమ్ల ద్రవాలను (ఉదాహరణకు నిమ్మరసం) లాంటివి రాగి పాత్రల్లో నిల్వ చేసి తాగవద్దు
ఎంత మోతాదులో రాగి తీసుకోవాలి
అధిక మోతాదులో రాగి శరీరంలో చేరడం సైతం ఇన్‌టాక్సినేషన్ కు దారితీస్తుంది. తద్వారా వికారం, వాంతులు, కడుపు నొప్పి, కాలేయ సమస్యలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. పెద్దలు రోజుకు 0.9 మిల్లీగ్రాముల రాగి శరీరంలోకి చేరినా ఏ సమస్య ఉండదు. దీన్ని ఆహారం ద్వారా సైతం పొందవచ్చు.
గమనిక: వార్తలో పేర్కొన్న సమాచారం కొన్ని వైద్య నివేదికల ఆధారంగా ఇక్కడ అందించాం. ఇందులోని విషయాలకు ఏబీపీ దేశం బాధ్యత వహించదు. మీరు ఏదైనా వైద్య, ఆరోగ్య సలహాను పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.