Turmeric Water Side Effects : ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ ఉదయం పసుపు నీరు తీసుకుంటారు కొందరు. పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్ని వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను దూరం చేసే సూపర్​ ఫుడ్​గా చెప్పవచ్చు. అయితే దీనిని సరైన మోతాదులో తీసుకోకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. అంటే ప్రతిరోజూ అవసరమైన దానికంటే ఎక్కువ పసుపు నీరు తాగితే.. దానివల్ల కలిగే అనేక నష్టాలు శరీరంలో కనిపిస్తాయట. పసుపులో ఉండే కర్కుమిన్ అధిక మొత్తంలో శరీరంలోకి వెళితే.. అది కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుందట. అంతేకాకుండా ఎసిడిటీ, నొప్పి, గ్యాస్, మంట వంటి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని చెప్తున్నారు.

Continues below advertisement

ఐరన్ లోపం 

పసుపు శరీరంలో ఐరన్ శోషణను తగ్గిస్తుంది. అంటే మీరు ఎక్కువ మొత్తంలో పసుపు తీసుకుంటే.. ఆహారంలో ఉండే ఐరన్ శరీరానికి సరిగ్గా అందదు. దీనివల్ల రక్తహీనత సమస్య వస్తుంది. అందుకే ఇప్పటికే ఐరన్ లోపం లేదా రక్తహీనత సమస్య ఉన్నవారికి పసుపు ఎక్కువగా తీసుకోవడం హానికరం.

కాలేయంపై ప్రభావం

పసుపును పాలతో అయినా లేదా నీటితో అయినా.. కలిపి ఎక్కువగా తీసుకుంటే.. కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రక్తాన్ని శుభ్రపరచడానికి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అవసరమైన దానికంటే ఎక్కువ పసుపు కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

Continues below advertisement

చర్మ సమస్యలు

ఎక్కువ మొత్తంలో పసుపు నీరు తాగడం లేదా పచ్చి పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, ఇతర చర్మ వ్యాధులు వస్తాయి.

కిడ్నీలో రాళ్ల ప్రమాదం

మీకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే.. పసుపును ఎక్కువగా తీసుకుంటున్నారా లేదా అని ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. పసుపులో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో అధిక మొత్తంలోకి ప్రవేశించినప్పుడు.. కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్​ను ఏర్పరుస్తుంది. ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. పసుపు పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. కానీ ప్రతిరోజూ అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవడం కిడ్నీలపై ప్రభావం చూపుతుంది.

రక్తంలో చక్కెరపై ప్రభావం

పరిశోధన ప్రకారం పసుపు నీరు అధిక రక్త చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. సరైన మోతాదులో పసుపు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర, రక్తపోటు స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కానీ మీరు ఎక్కువ మొత్తంలో పసుపు నీరు తీసుకుంటే అది రక్తంలో చక్కెర స్థాయిని అవసరమైన దానికంటే ఎక్కువగా తగ్గించవచ్చు. ఇది ప్రమాదకరంగా ఉంటుంది.

రక్తం పలుచబడటం

పసుపు సహజంగానే రక్తాన్ని పలుచగా చేస్తుంది. కానీ మీరు ఇప్పటికే రక్తం పలుచబడే మందులు తీసుకుంటుంటే.. పసుపును చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువ పసుపు తీసుకోవడం వల్ల రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి.

ఎంత మోతాదులో తీసుకోవాలి?

పసుపు మన ఆరోగ్యానికి అవసరం. ఆయుర్వేదం, వైద్య శాస్త్రం రెండూ దీనిని ఉపయోగకరంగానే చెప్తాయి. కానీ మీరు ప్రతిరోజూ పసుపు నీటిని మందులా తీసుకుంటే.. అది శరీరంలో అనేక వ్యాధులకు కారణం కావచ్చు. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల కోసం పసుపు నీరు తాగాలనుకుంటే.. దాని పరిమాణాన్ని పరిమితం చేయండి. ప్రతిరోజూ ఒక చిటికెడు లేదా అర టీస్పూన్ పసుపును శరీరానికి అందించండి. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.