డయాబెటిస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న మరో ఆరోగ్య సమస్య. ఒకసారి డయాబెటిస్ నిర్ధారణ అయ్యిందంటే ఇక పూర్తిగా జీవన విధానం మార్చుకోవాల్సి ఉంటుంది. బద్దకానికి వీడ్కోలు చెప్పాల్సిందే. కాస్త వర్కవుట్, తీసుకునే ఆహారంలో కొద్దిపాటి మార్పులతో జీవితాన్ని ఆరోగ్యంగా గడపవచ్చు. అప్పటి వరకు ఎలాంటి ఆహార నియమాలు ఒకసారి మధుమేహం నిర్ధారణ జరిగిన తర్వాత తప్పనిసరిగా కొన్ని రకాల ఆహార పానీయాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటి అధ్యయనం ప్రకారం.. చక్కెరలు అధికంగా ఉండే ఫిజి డ్రింక్స్ కి బదులుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్న కాఫీ, టీలు తీసుకున్న వారి జీవన నాణ్యత, జీవితకాలం కూడా గణనీయంగా పెరిగిందట. మధుమేహులు కాఫీ, టీలు మానుకోవల్సిన అవసరమే లేదట.


18 సంవత్సరాల పాటు 61 సంవత్సరాల వయసు గల దాదాపు 15 వేల మంది మధుమేహుల అలవాట్లను పర్యవేక్షించిన అధ్యయన ఫలితాలు ఆశ్చర్యకరమైన విషయాలను వెలువరిస్తున్నారు. రోజుకు ఒకటి కంటే ఎక్కువ ఫిజీ డ్రింక్స్ తాగేవారి ఆయు ప్రమాణం గణనీయంగా పడిపోతుందట. అయితే వీటి బదులుగా రోజుకు ఆరు కాఫీలు తాగేవారిలో 26 శాతం వరకు అకాల మరణ ప్రమాదం తగ్గినట్టు గమనించారట. అదే మొత్తంలో టీ తాగేవారిలో 21 శాతం వరకు అకాల మరణ ప్రమాదం తగ్గుతుందట.


హార్వర్డ్ యూనివర్సిటి నిపుణులు జరిపిన ఈ అధ్యయనంలో నీళ్లు తాగడానికి ఇష్ట పడేవారిలో 23 శాతం, స్కీమ్డ్ మిల్క్ తాగేవారిలో 12 శాతం వరకు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని నిర్ధారణ అయ్యింది.


డయాబెటిస్ నిర్ధారణ అయిన తర్వాత ఫీజీ డ్రింక్స్ తగ్గించి కాఫీ, టీలు తాగడం కొనసాగించిన వారిలో అకస్మాత్తుగా మరణించే ప్రమాదం సగటున 18 శాతం వరకు తగ్గిందని ఈ పరిశోధకుల బృందం స్పష్టం చేసింది.


పరిశోధనకు ఎంపిక చేసుకున్న 15 వేల 4 వందల 86 మంది మధుమేహులలో 7 వేల 6 వందల 38 మంది 18 సంవత్సరాల అధ్యయన కాలంలో మరణించారు. ఇది 49 శాతానికి సమానం. 3 వేల 4 వందల 47 మంది గుండెజబ్బుల బారిన పడ్డారు.


కాఫీలో ఉండే కొన్ని రసాయనాలు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. టీలో ఉండే పాలీఫెనాల్స్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాటేచిన్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మాత్రమే కాదు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కావడం మూలంగా కాఫీ, టీలతో కలిగే నష్టాల కంటే లాభాలే ఎక్కువ అని అభిప్రాయం వెలువరించారు ఈ పరిశోధకులు. మధుమేహంతో బాధపడే వారు ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలనే నిర్ణయం మీద వారి జీవన నాణ్యత, జీవిత కాలం ఆధారపడి ఉంటాయని కూడా అంటున్నారు. కానీ చక్కెర, సాచ్యూరేటెడ్ కార్బోహైడ్రేట్ల వినియోగం విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామం కూడా మరవకూడని మరో అంశం.


Also Read: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? జాగ్రత్త, పేగు క్యాన్సర్ కావచ్చు!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.