ఉదయాన్నే లేవగానే చాలా మంది టీ, కాఫీ వంటివి తాగుతూ ఉంటారు. అవి తగాకపోతే యాక్టివ్ గా ఉండలేమని కొందరు అనుకుంటారు. కానీ అవి ఆరోగ్యానికి అంతా శ్రేయస్కరం కాదని అంటున్నారు పోషకాహార నిపుణులు. వాటికి బదులుగా పొద్దున్నే అల్లం రసం తాగితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. చిన్న అల్లం ముక్క తినాలంటేనే మంట అని అల్లాడిపోతాం మరి ఏకంగా అల్లం రసం తాగాలంటే మా వల్ల కాదు బాబోయ్ అని అనుకుంటున్నారా? కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పొద్దున్నే పరగడుపున కొద్దిగా అల్లం రసం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరి చెరవని చెప్తున్నారు నిపుణులు. 


కొద్దిగా అల్లం రసంలో నిమ్మకాయ రసం, తేనె, మిరియాల పొడి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది జింక్, ఫాస్పరస్, విటమిన్ B, B3, B6, ప్రోటీన్లు మరియు డైటరీ ఫైబర్‌లను అందిస్తుంది. అంతే కాదు పరగడుపున దీన్ని తీసుకోవడం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. 


వికారాన్ని తగ్గిస్తుంది: మనలో కొంతమందికి నిద్రలేవగానే వికారంగా వాంతి అయ్యే విధంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు పరగడుపున కొద్దిగా అల్లం రసం తీసుకుంటే వికారం తగ్గుతుంది. పచ్చి అల్లంలో ఉండే జింజెరాల్స్ వికారం మరియు అజీర్ణం వంటి కడుపు సమస్యలు లేకుండా చేస్తుంది. గర్బిణి స్త్రీలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలకి కూడా మంచిది. 


రుతుక్రమంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది: అల్లంలో ఉండే జింజెరోల్స్, షోగోల్ మరియు పారాడోల్ రుతుస్రావంలో వచ్చే కండరాల నొప్పితో పోరాడుతున్న మహిళలకు చాలా సహాయకారిగా ఉంటుంది. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందేలా చేస్తుంది. అందుకే ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు అల్లం రసం తీసుకోవడం చాలా మంచిది. తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. 


ఎనర్జీ ఇస్తుంది: పొద్దున్నే లేవగానే బద్ధకంగా, అలసటగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఇది తీసుకుంటే యాక్టివ్ గా ఉంటారు. శరీరానికి అదనపు శక్తిని ఇవ్వడంతో పాటు రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది. 


అజీర్ణ సమస్యలకు చెక్: కడుపు నొప్పి, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు అల్లం రసం గొప్ప ఔషధంగా పని చేస్తుంది. పొద్దున్నే పరగడుపున దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అందుకే చాలా మంది కడుపులో గ్యాస్ ఫామ్ అయినప్పుడు చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకుని నమిలి మింగేస్తారు. ఇలా చెయ్యడం వల్ల జీర్ణ సమస్యలు రావని పెద్దలు చెబుతారు. 


రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ: కొద్దిగా అల్లం రసం సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఇది సహాయపడుతుంది.  


Also Read: మెరిసే చర్మం, ఎర్రటి పెదవులు కావాలనుకుంటున్నారా? ఈ పదార్థాన్ని మీ డైట్లో భాగం చేసుకోవాల్సిందే


Also Read: ముఖానికి పసుపు రాసుకునేటప్పుడు ఈ తప్పులు మాత్రం చెయ్యకండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకుఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.