గర్భవతిగా ఉన్నప్పుడు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే పుట్టే పిల్లలు తెల్లగా మంచి రంగులో పుడతారని పెద్దలు చెప్తూ ఉంటారు. పురాతన సంస్కృతి నుంచి కుంకుమ పువ్వు శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఔషధాల్లో విరివిగా ఉపయోగిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడం దగ్గర నుంచి మానసిక శ్రేయస్సుని పెంపొందించే వరకు కుంకుమ పువ్వు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. దీన్ని రోజూ నీటిలో కలుపుకుని తాగడం వల్ల అనేక రోగాలని నయం చేసుకోవచ్చు.
యాంటీ డిప్రెసెంట్
కుంకుమ పువ్వు నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెదడు కణాలని నయం చేసి పునరుత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇందులో యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి మెదడుని బలోపేతం చేస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. నిరాశ, ఆందోళన లక్షణాలని తగ్గించడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియ
కుముకుం పువ్వు నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం సమస్యలని తగ్గించడంలో సహాయపడుతుంది. పొద్దునే కాఫీ, టీ తాగడానికి బదులుగా కుంకుమ పువ్వు నీటిని తాగితే మంచిది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆకలిని అణచివేసే లక్షణాలు కలిగి ఉంది. ఈ నీటిని తాగడం వల్ల చిరుతిండి తినాలనే కోరిక తగ్గిపోతుంది. బరువు నిర్వహణలో సమర్థవంతంగా పని చేస్తుంది. శరీరంలో కొవ్వు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు
కుంకుమపువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. గోరు వెచ్చని నీటిలో కుంకుమ పువ్వు వేసుకుని తాగడం వల్ల శరీరంలోని మంటని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని దీర్ఘకాలిక మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కంటి ఆరోగ్యం
ఇందులో కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే సమ్మేళనాలు ఉన్నాయి. ఒక చిటికెడు సొంపు గింజలతో కుంకుమ పువ్వు టీ లేదా నీటిని తీసుకోవడం వల్ల వయసు సంబంధిత మచ్చలు తగ్గించుకోవచ్చు. కంటి శుక్లం అభివృద్ధి చెందకుండా నివారించవచ్చు.
రుతుస్రావం నొప్పులు తగ్గిస్తుంది
గోరు వెచ్చని కుంకుమ పువ్వు నీటిని సిప్ చేయడం వల్ల రుతుస్రావంలో వచ్చే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్, రుతు తిమ్మిరి లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కుంకుమ పువ్వు నీళ్ళు ఎలా తయారు చేయాలి?
- కుంకుమపువ్వు- 5,6 రేకులు
- దాల్చిన చెక్క- ఒక అంగుళం ముక్క
- యాలకులు- రెండు
- బాదం- 4 లేదా 5
- తేనె
తయారీ విధానం
దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, యాలకులు నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. వేడి నీటిలో తేనె కలపడం వల్ల విషపూరితం అవుతుంది. అందుకే కొద్దిగా చల్లబడిన తర్వాత వాటిని వడకట్టి అందులో తేనె కలుపుకోవచ్చు. చివరగా బాదం పప్పు పొడి వేసుకుని తాగాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మీ కిచెన్‌లో ఉండే ఈ వస్తువులు క్యాన్సర్ కారకాలని మీకు తెలుసా?