Mobile Addiction in Children: వయసుతో నిమిత్తం లేకుండా ఫోన్ బారిన పడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే.. కచ్చితంగా లేరనే చెప్పాలి. ముఖ్యంగా పిల్లల ఫోన్ వ్యసనం చాలా ఆందోళనకరంగా మారింది. ఈ వ్యసనం సాంఘిక, మానసిక, శారీరక ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ వ్యసనాన్ని వదిలించడం ఎలాగో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. పిల్లలను దండించకుండా ఫోన్ నుంచి దూరంగా ఉంచేందుకు కొన్ని మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి వివరాలు ఇక్కడ...


మీరే ఆదర్శం


పిల్లలు చాలా విషయలు తల్లిదండ్రులను అనుకరించడం ద్వారానే నేర్చుకుంటారు. ముందుగా మీరు అవసరం లేకపోయినా ఫోన్ చూడడం మానెయ్యాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తే, పిల్లలకు కూడా అది అలవాటుగా మారుతుంది. మీరు ఫోన్‌ వినియోగం తగ్గించడం వల్ల పిల్లల్లో కూడా ఆ అలవాటు నెమ్మదిగా తగ్గుతుంది.


నిర్ణీత స్క్రీన్ సమయం


పిల్లలకు ఫోన్ లేదా ఇతర గాడ్జెట్స్ వాడకం కోసం ప్రత్యేకంగా నిర్ధుష్టమైన సమయం కేటాయించాలి.  ఉదాహరణకు, రోజుకు 30 నిమిషాలు లేదా ఒక గంటకు మించి సమయం ఫోన్ లేదా మరే ఇతర గాడ్జెట్స్ ఉపయోగించకూడదని నియమం పెట్టాలి. ఈ సమయపాలన అలవాటయ్యే వరకు కొంచెం కఠినంగా వ్యవహరించాలి. క్రమశిక్షణను పాటించాలి.


ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్


పిల్లలకు ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లోనే ఎక్కువగా ఫోన్లలో సమయం గడుపుతుంటారు. కాబట్టి, వారిని ఫోన్ కాకుండా, ఇతర ఆకర్షణీయమైన కార్యకలాపాల వైపు మళ్లించాలి. ఆర్ట్స్, స్పోర్ట్స్, ఆటలు, పుస్తకాలు చదవడం వంటి పనులతో వారిని ఎంగేజ్డ్ గా ఉంచాలి.


పిల్లలను  ఎక్కువగా ఫోన్ చూడకూడదని కట్టడి చేయటానికి ముందు  వారితో పాటు కొన్ని ఆటలు ఆడటం కాని,  మరేదైనా ఇతర సృజనాత్మక పనులు కానీ చేయ్యాలి. ఇలా చేయడం వల్ల వారు ఫోన్ నుంచి దృష్టి మరలిస్తారు.


రివార్డ్స్


పిల్లలు ఫోన్ చూడడం తగ్గిస్తే లేదా కేటాయించిన సమయం ముగిసిన తర్వాత ఫోన్ వాడకుండా ఉన్నప్పుడు వారికి చిన్న రివార్డ్స్ ఇవ్వాలి. ఉదాహరణకు, వారు ఒక రోజు ఫోన్ వినియోగం తగ్గిస్తే, వారికి గేమ్స్ ఆడుకోవటానికి లేదా వీలైతే వారి ఇష్టమైన పనులు చేయడానికి అవకాశం ఇవ్వాలి లేదా బయటికి తీసుకువెళ్లడం, ఇష్టమైన తినుబండారాలు ఇవ్వడం వంటి రివార్డ్స్ వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది.


సాంకేతిక పరిమితులు


పిల్లలు ఫోన్‌ను ఎంతసేపు వాడుతున్నారో తెలుసుకోవడం, ఏ యాప్‌లను వాడుతున్నారు? వాటిని అనుమతించవ్చా? లేక వాటిని సాంకేతికంగా అనుమతించడం లేదా నిరోధించడం వంటి సాంకేతిక పరిమితులు ఉపయోగించాలి. ఈ పరిమితులు వారి ఆన్‌లైన్ సమయాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి.


టైమర్ సెట్ చేయడం


ప్రత్యేక యాప్‌లు లేదా ఫోన్‌లో టైమర్ ఉపయోగించడం ద్వారా, పిల్లల పాస్‌టైమ్ గేమ్స్ లేదా వీడియోల కోసం వినియోగించే సమయాన్ని నియంత్రించవచ్చు.


ఫోన్ ఉపయోగం తెలియజేయండం


పిల్లలకు ఫోన్ అంటే ఏమిటి? దాని నిజమైన ఉపయోగం ఏమిటి? పరిమితికి మించి వాడడం ఎందుకు తగదు, దాని వల్ల ఏలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో వివరంగా చెప్పాలి. మానసిక ఆరోగ్యం, కంటి ఆరోగ్యం గురించి  వారి ఏజ్‌కు తగిన పనుల పట్ల వారికి అవగాహన కలిగించడం ముఖ్యం.


క్రమంగా తగ్గించడం


ఒకేసారి ఫోన్ పూర్తిగా దూరం చెయ్యడం వల్ల మంచి ఫలితం రాకపోవచ్చు. క్రమంగా తగ్గించడం, నెమ్మదిగా ఇతర కార్యకలాపాల్లో పిల్లలను ఎంగేజ్ చెయ్యడం ద్వారా వారు సులభంగా కొత్త మార్గాన్ని అంగీకరించవచ్చు. మొదట కొన్ని గంటలు ఆపి, తర్వాత పూర్తిగా నియంత్రించండి.


ప్రపంచం అంతా ఫోన్‌నే కాదని చూపించండి


పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను పరిచయం చేయడం అవసరం. వాళ్లకు ప్రకృతిలో గడిపే సమయం లేదా సృజనాత్మకమైన హాబీలను పరిచయం చెయ్యడం వల్ల  ఫోన్ లేకుండా కూడా వారు ఆనందించ వచ్చనే నమ్మకాన్ని కలిగిస్తుంది.



పెద్దల సమయం


పిల్లలతో కలిసి సమయం గడపడం కూడా ముఖ్యమే. వారితో కూర్చుని మాట్లాడటం, పలు విషయాలు చర్చించడం, వారితో కలిసి ఆటలు ఆడటం వంటివి చేస్తే ఫోన్‌ మీద పెద్దగా ఆధారపడకుండా చేయవచ్చు.


నియమాలు మరియు ఆచరణ


ఫోన్ వాడకానికి సంబంధించిన నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలి. పిల్లలకు వారు మీ నియమాలను పాటించకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో స్పష్టంగా తెలియజేయండి. వారితో సున్నితంగా మాట్లాడినా చాలా దృఢంగా, కఠినంగా వ్యవహరించాలి. పిల్లల మొబైల్ అలవాటును తగ్గించడంలో ఓర్పు, క్రమశిక్షణ, మరియు పాజిటివ్ ప్రోత్సాహం అవసరం.


Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పనులు అస్సలు చేయొద్దట.. మొదటి మూడు నెలల్లో ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలట