ఇంట్లో చిన్న పిల్లలకు జ్వరం వస్తే తల్లిదండ్రులకు కాళ్ళు చేతులూ ఆడవు. చిన్న జ్వరానికి కూడా భయపడిపోయి హడావుడి చేస్తారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని అతి జాగ్రత్తలు పాటిస్తారు. భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు చేసే తప్పులు ఉన్నాయి. కానీ అవి తప్పులని వాళ్ళకి తెలియదు. తమ పిల్లలు ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటారు. కానీ మీరు మాత్రం అలాంటి తప్పులు చేయకండి.
⦿ జ్వరం వచ్చిన పిల్లల్ని వేడి గదిలో కూర్చోబెట్టకూడదు. ఇంట్లో గది ఉష్ణోగ్రతలో చల్లగా ఉండేలా చూడాలి. వారిని ఆ గదిలో ఉంచితే జ్వరం అదుపులోకి వస్తుంది.
⦿ అటువంటి టైమ్ లో ఆహారం తీసుకోలేరని వేడి వేడి పాలు తాగిస్తారు. కానీ వాస్తవానికి వేడి లేదా చల్లని పదార్థాలు లేదా డ్రింక్స్ ఇవ్వడం వల్ల అది వాళ్ళ శరీర ఉష్ణోగ్రత మీద ఎటువంటి ప్రభావం చూపదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
⦿ శరీరం కాస్త వేడిగా అనిపిస్తే జ్వరం తగ్గలేదని స్నానం చేయించరు. ఒళ్ళు రుద్దితే శరీరం అలిసిపోతుందని స్నానం చేయించకుండా పడుకోబెట్టేస్తారు. అయితే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. గోరు వెచ్చని నీరు లేదా స్పాంజ్ బాత్(తడి బట్టతో ఒళ్ళు తుడవడం) స్నానం చేయించడం వల్ల టెంపరేచర్ అదుపులోకి వస్తుంది. అంతే కాదు వాళ్ళు పరిశుభ్రంగా ఉంటే త్వరగా కోలుకుంటారు.
⦿ జ్వరం రాగానే ప్రతి తల్లిదండ్రులు చేసే పని సొంతంగా పారాసెటమాల్ వేసేస్తారు. అది అసలు సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా చైల్డ్ స్పెషలిస్ట్ ని సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మందులు ఉపయోగించాలి. సొంత వైద్యం ఎప్పుడూ పిల్లల మీద చేయకూడదు.
⦿ ఎక్కువ మంది తల్లిదండ్రులు చేసే పొరపాటు.. యాంటీ బయాటిక్స్ వాడటం. కొన్ని సార్లు మీ పిల్లల శరీరానికి యాంటీ బయాటిక్స్ అవసరం లేకపోవడచ్చు. అయినప్పటికీ వాడితే అది ఇతర దుష్ప్రభావాలను చూపిస్తుంది. మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎప్పుడూ యాంటీ బయాటిక్స్ వినియోగించకూడదు. అవి తట్టుకునే శక్తి పిల్లల శరీరానికి ఉండకపోవచ్చు.
⦿ నిండుగా బట్టలు వేసేసి కప్పేసి ఉంచుతారు. ఇలా అసలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పొరలు పొరలుగా దుస్తులు వేయడం వల్ల వారి శరీరంలోని వేడి బయటకి వెళ్ళకుండా అడ్డుపడుతుంది. దీని వల్ల జ్వరం తగ్గదు. అందుకే వారికి వదులుగా ఉన్న దుస్తులు వేయాలి.
⦿ జ్వరం రాగానే భయపడకూడదు. మీరు భయపడితే ఆలోచనా శక్తి మందగిస్తుంది. టెన్షన్ లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కూడా అర్థం కాదు. ముఖ్యమైన విషయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది.
⦿ టెంపరేచర్ చూడకుండానే కొంతమంది తల్లిదండ్రులు మెడిసిన్ వాడేస్తారు. అది తప్పు ఆలోచన. ముందుగా జ్వరం ఎంత ఉందో చెక్ చేసి ఆ తర్వాత దానికి తగిన మందులు వాడాలి.
⦿ జ్వరం కొంచెమే కదా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించేస్తారు. కానీ అది మంచి ఆలోచన కాదు. ఇన్ఫెక్షన్ ఇతర పిల్లలకి వ్యాపించే ప్రమాదం ఉంది. అలాగే మీ పిల్లల హెల్త్ మరింత దిగజారే అవకాశం ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: షాకింగ్ స్టడీ - మైక్రోప్లాస్టిక్ వల్ల పిల్లలు పుట్టడం కష్టమేనట!