కోవిడ్-19 గతేడాది ఎంతగా భయపెట్టిందో తెలిసిందే. అయితే, ఈ ఏడాది వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియెంట్ సాధారణ మందులతోనే నయమవుతోంది. ముఖ్యంగా పారాసెటమల్, డోలో వంటి మందులతో ఉపశమనం లభిస్తోంది. దీంతో చాలామంది వైద్యులను ఆశ్రయించకుండా.. డోలో వేసుకుని తిరిగేస్తున్నారు.
పారాసెటమాల్ అనేది సాధారణ జ్వరానికి ఉపయోగించే మందు. దేశంలో జ్వరం వస్తే ఎక్కువ మంది ఉపయోగించేది ఈ ఔషదమే. ఇది నొప్పులను నివారించడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది వైద్యులు రోగులకు ఈ ఔషదాన్ని సూచిస్తున్నారు. అయితే, దీన్ని రోజులో రెండు లేదా నాలుగు సార్లు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.
కోవిడ్-19 వల్ల చాలామంది తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో జ్వరం తగ్గించుకోవడం కోసం అంతా పారాసెటమాల్‌ను విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యంగా ‘డోలో 650’ వాడుతున్నారు. ఇది కూడా పారాసెటమాల్ మందే. పేరు ఒక్కటే తేడా. దీన్ని కూడా జ్వరం, నొప్పులకు ఉపయోగిస్తారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో చాలామంది డోలోకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ డోలో వేసుకుని కోవిడ్‌ను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ‘డోల్-650’కు ఏర్పడిన డిమాండ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ షికారు చేస్తున్నాయి. అవి చూస్తే కరోనా కూడా నవ్వి నవ్వి చచ్చిపోతుంది.