Rabies Prevention Tips : ఇటీవలె కుక్క కరవడం వల్ల ఓ కబడ్డీ ప్లేయర్ చనిపోయాడనే వార్తను చూసే ఉంటాము. అయితే ఈ నేపథ్యంలో చాలామందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. కుక్క కరిస్తేనే కాదు.. దాని గోళ్లతో రక్కినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స ఏంటి? వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఎంత ఉంది వంటి అంశాలపై ఏబీపీ లైవ్ ఇంటర్వ్యూ చేసింది. 

హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్​లో ఎమర్జెన్సీ వైద్య విభాగంలో సీనియర్ కన్సల్టెంట్​గా చేస్తోన్న డాక్టర్ పి శివకూమార్​తో ABP లైవ్ ఇంటర్వ్యూ చేసింది. దీనిలో ఆయన రేబిస్​కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అవేంటో చూసేద్దాం. 

  • ABP లైవ్ : రేబిస్ అంటే ఏమిటి?

డాక్టర్ పి శివ కుమార్ : రేబిస్ అనేది ఒక ప్రాణాంతక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మెదడులో వాపు వస్తుంది. లక్షణాలు కనిపించడం ప్రారంభమైతే ఇది ప్రాణాంతకమే అవుతుంది. కానీ కుక్కకాటు తర్వాత సకాలంలో టీకాలు వేయించుకోవడం ద్వారా దీనిని 100% నివారించవచ్చు.

  • ABP లైవ్ : రేబిస్ సాధారణంగా కుక్క కాటుల వల్లే వస్తుందా?

డాక్టర్ పి శివ కుమార్ : అవును, చాలా వరకు రేబిస్ కేసులు కుక్క కాటుల వల్లే వస్తాయి. ముఖ్యంగా ఇండియాలో కేసులు కుక్క కాటు వల్లే నమోదు అవుతున్నాయి. అయితే పిల్లులు, కోతులు, రేబిస్ సోకిన పక్షులనుంచి కూడా రావచ్చు.

  • ABP లైవ్: రేబిస్ లక్షణాలు కనిపించే రోగిని అత్యవసర విభాగంలోకి తీసుకువచ్చినప్పుడు ఏమి జరుగుతుంది?

డాక్టర్ పి శివ కుమార్ : రేబిస్ సోకిన వ్యక్తిలో నీటిని చూస్తే భయం, గందరగోళం లేదా దూకుడు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే అప్పటికే చాలా ఆలస్యమైందని అర్థం. అయితే ఆ సమయంలో మేము సహాయక సంరక్షణను మాత్రమే అందించగలము. కాబట్టి కుక్క కాటు వేసిన వెంటనే.. స్పందించడం చాలా ముఖ్యం.

  • ABP లైవ్: ఆ దశలో వ్యక్తిని రక్షించే అవకాశం ఎంత ఉంటుంది?

డాక్టర్ పి శివ కుమార్ : రేబిస్ లక్షణాలు కనిపించిన తర్వాత వ్యక్తిని కాపాడే అవకాశాలు చాలా తక్కువ. దురదృష్టవశాత్తు లక్షణాలు ప్రారంభమైతే.. మనుగడ సాగించే అవకాశాలు దాదాపు సున్నా. అందుకే మేము ఎల్లప్పుడూ ఆలస్యం చేయవద్దనే చెప్తున్నాము. ఏదైనా అనుమానాస్పద జంతువు కాటు వేసిన వెంటనే టీకా తీసుకోవాలి.

  • ABP లైవ్ : కుక్క లేదా జంతువు కాటుకు ప్రథమ చికిత్స ఏమిటి?

డాక్టర్ పి శివ కుమార్ : ముందుగా గాయాన్ని సబ్బుతో, టాప్ కింద నీటితో కనీసం 10–15 నిమిషాలు కడగాలి. ఈ సింపుల్ చర్య నిజంగా చాలా సహాయపడుతుంది. తరువాత గాయాన్ని శుభ్రం చేసి.. వీలైనంత త్వరగా టీకా కోసం వైద్యుడిని సంప్రదించాలి. 

  • ABP లైవ్ : జంతువుల కాటులకు చికిత్స విధానం ఏమిటి?

డాక్టర్ పి శివ కుమార్ : గాయాన్ని శుభ్రపరిచిన తర్వాత.. వ్యక్తి షెడ్యూల్ ప్రకారం యాంటీ-రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కాటు లోతుగా లేదా ముఖానికి లేదా తలకు దగ్గరగా ఉంటే, వైద్యులు అదనపు రక్షణ కోసం రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ (RIG) కూడా ఇవ్వవచ్చు.

  • ABP లైవ్: ఒక వ్యక్తికి బలమైన రోగనిరోధక శక్తి ఉంటే, యాంటీ-రేబిస్ టీకాను దాటవేయవచ్చా?

డాక్టర్ పి శివ కుమార్ : లేదు, ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. రేబిస్ మీ రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉందో పట్టించుకోదు. కాబట్టి ఏ జంతువైనా కరిస్తే టీకా తప్పనిసరి. సురక్షితంగా ఉండటానికి ఇదే ఏకైక మార్గం.

  • ABP లైవ్: పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులకు జంతువుల కాటులను దాచిపెడతారు. ప్రమాదాన్ని వారికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి?

డాక్టర్ పి శివ కుమార్ : మీ పిల్లలతో సున్నితంగా మాట్లాడండి. వారిని మందలించడం కాకుండా.. సురక్షితంగా ఉండటం గురించి చెప్పాలి. జంతువు వారిని కాటు వేసినా లేదా గోకినా మీకు చెప్పాలని సూచించాలి. మీరు భయపెడితే వారు చెప్పడానికి మరింత భయపడతారు. పరిస్థితి చేయి దాటిపోతుంది. 

గమనిక: ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.