ఒకప్పుడు ప్రపంచాన్ని కమ్మేసిన మహమ్మారి స్మాల్ పాక్స్. ఈ మశూచిని అంతు చూడగలిగాం. దానికి వ్యాక్సిన్ కనిపెట్టి, ప్రపంచంలో ఉన్న అందరికీ వ్యాక్సిన్ అందలే చూశారు. ఆఫ్రికా దేశల్లో పక్కనపెడితే మిగతా దేశాల్లో దాదాపు స్మాల్ పాక్స్ అంతమైందనే చెప్పాలి. అయితే ఇప్పుడు మంకీపాక్స్ ప్రపంచంపై దాడి చేసింది. దీనికి ఇంతవరకు ఎలాంటి మందులు, వ్యాక్సిన్లు లేవు. అయితే చాలా మందికి ఉన్న సందేహం స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ మంకీ పాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుందా? అని. ఈ విషయం గురించి అంతర్జాతీయ వైద్య పరిశోధకులు స్పష్టమైన జవాబును ఇచ్చారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ మంకీ పాక్స్ నుంచి ఎప్పటికీ రక్షణ కల్పించలేదు. ఒకవేళ కల్పించినా అది చాలా స్వల్పకాలానికి మాత్రమే అని చెప్పారు. 


రక్షిస్తుందా?
స్పెయిన్‌లో 181 మంకీపాక్స్ రోగుల క్లినికల్ అసెస్‌మెంట్‌ నిర్వహించారు. మే 11 నుంచి జూన్ 29 వరకు వారి క్లినికల్, వైరోలాజికల్ లక్షణాలను అధ్యయనకర్తుల పరిశోధించారు. వారిలో 32 మంది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్లను తీసుకున్నావారేనని గుర్తించారు. అయినా కూడా వారు మంకీ పాక్స్ బారిన పడ్డారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలను మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ ఓరియోల్ మిట్జా మాట్లాడుతూ ‘మంకీపాక్స్ బారిన పడిన చాలా మంది 45 ఏళ్ల క్రితం మశూచి (స్మాల్ పాక్స్) వ్యాక్సిన్లను స్వీకరించిన వారే. దాన్ని ప్రభావం ఇప్పుడు పూర్తిగా క్షీణించిందనే చెప్పవచ్చు, బాల్యంలో వేసుకున్న టీకాలు జీవితాంతం మనుషులను కాపాడలేకపోవచ్చు’ అని అన్నారు. మంకీపాక్స్ వైరస్ మశూచిని పోలి ఉన్నప్పటికీ, మశూచి వ్యాక్సిన్ మంకీపాక్స్ విషయంలో సమర్థంగా పనిచేయలేదు అని తేల్చి చెప్పారు. 


ఈ జాగ్రత్తలు తప్పవు
మంకీపాక్స్ సోకిన వ్యక్తిని ఐసోలేట్ చేయడం చాలా ప్రధానం. వారిని ఒక గదిలోనే ఉంచాలి. వారు వాడిన దుస్తులు, బెడ్ షీట్లు, గిన్నెలు మీరు వాడకూడదు. శారీరక సంబంధాన్ని పెట్టుకోకూడదు. మంకీపాక్స్ సోకిన చాలా మంది ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. కానీ వారి గాయాలు మాత్రం రోగులను చాలా బాధిస్తాయి. మంకీ పాక్స్ సోకిన వారిలో కొందరు మాత్రం తీవ్రమైన మెదడు వాపు సమస్యలతో మరణిస్తున్నారు. 


ప్రపంచవ్యాప్తంగా, దాదాపు 90 దేశాల్లో 31,000 కంటే ఎక్కువ మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. గత నెలలోప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అమెరికా తమ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆఫ్రికాలోనే మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో పోలిస్తే మాత్రం మంకీపాక్స్ వల్ల మరణించిన వారు చాలా తక్కువ. 


Also read: ఈ లక్షణాలు మీలో కనిపిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం, ఏం తినాలంటే



Also read: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి




































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.