అమ్మాయిలు చర్మం తర్వాత అంతగా కేర్ తీసుకునేది జుట్టు సంరక్షణ విషయంలోనే. జుట్టు రాలకుండా, పెరిగేందుకు ఏవేవో అయిల్స్ రాస్తారు. ఎప్పటికప్పుడు జుట్టు చివర్ల కట్ చేసుకుంటూ ఉంటే జుట్టు బాగా పెరుగుతుందని అంటారు. ఇదే కాదు జుట్టు చివర్ల మడుచుకున్నా (మడత పెట్టినా) పెరుగుతుంది అని అనుకుంటారు. అయితే ఇలా చేస్తే నిజంగానే జుట్టు పెరుగుతుందా? అంటే కాదని అంటున్నారు బ్యూటీ కేర్ నిపుణులు. ఇది కేవలం అపోహ మాత్రమే అలా చేస్తే జుట్టు పెరిగేందుకు ఎటువంటి ఆస్కారం లేదని చెప్తున్నారు. రెగ్యులర్ గా జుట్టు చివర్ల ట్రిమ్మింగ్ చెయ్యడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జుట్టు పెరిగేది మాడు నుంచి అలాంటప్పుడు అది మీ జుట్టును ఎలా పెంచుతుంది.  


జుట్టు కత్తిరించుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా?


ఎప్పటికప్పుడు జుట్టుని ట్రిమ్మింగ్ చేసుకోవడం వల్ల జుట్టు పెరగకపోవచ్చు కానీ అది జుట్టుని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. క్రమం తప్పకుండా జుట్టును కత్తిరించడం వల్ల అది సరైన దిశలో పెరిగేందుకు దోహదపడుతుంది. ఇది జుట్టు ఆకృతిని అందంగా ఉండేలా చేస్తుంది. జుట్టు చివర్ల స్ప్లిట్ అయ్యేవాళ్ళు రెగ్యులర్ గా కత్తిరించుకోవడం చాలా మంచిది. స్ప్లిట్స్ కారణంగా జుట్టు బలహీనపడుతుంది. దీని వల్ల జుట్టు త్వరగా రాలిపోయేందుకు ఆస్కారం ఉంది.


స్ప్లిట్స్ కత్తిరించడం వల్ల జుట్టు అందంగా కనిపిస్తుంది. 1 సెం.మీ. కత్తిరించడం వల్ల ఏమి కాదు ఎందుకంటే ప్రతి నెలా సగటున 1 నుంచి 1.5 సెం. మీ వరకు పెరుగుతుంది. అందువల్ల జుట్టు పొడవు తగ్గిపోతుందనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలా చెయ్యడం వల్ల జుట్టు పొడవుగా మరింత అందంగా కనిపిస్తుంది.


జుట్టు పెరిగేందుకు ఏం చెయ్యాలి


జుట్టుకి మంచిగా నూనె రాసి మసాజ్ చెయ్యడం ఉత్తమమైన పని. మసాజ్ చెయ్యడం వల్ల జుట్టు పెరుగుదలని ప్రోత్సహించే ఫోలికల్స్ సహజంగా పని చేస్తాయి. మసాజ్ వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు కావలసిన పోషకాలు, ఆక్సిజన్ ను అందిస్తుంది. అందుకే కొబ్బరి నూనె, ఆముదం, బాదం నూనె, హెడ్ మసాజ్ ఆయిల్ ఏదైనా వాటితో తరచూ మాడుకు మసాజ్ చేసుకోవడం మంచిది. జుట్టు అందంగా కనిపించేందుకు మంచి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. ప్రోటీన్, ఒమేగా 3 ఆమ్లాలు, జింక్ ఎక్కువగా అందె ఆహారపదార్థాలు తీసుకోవాలి. అందుకు ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా మీ డైట్‌లో భాగం చేసుకోవాలి.


జుట్టు పెరిగేందుకు ఉసిరి


వెంట్రుకలు పెరిగేందుకు ఉసిరి చక్కని ఉపాయం. ఇది జుట్టుకే కాదు చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరి పొడి లేదా ఉసిరి కాయలు రెండింటితో జుట్టు పెంచుకోవచ్చు. ఇక గిన్నెలో 2 టీ స్పూన్ల ఉసిరి పొడి, 2 టీ స్పూన్ల కుంకుడుకాయ పొడి తీసుకుని అందులో కొంచెం నీళ్ళు కలపాలి. దాని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని తలకి అప్లై చేసుకోవాలి. 45 నిమిషాల పాటు తలకి ఉంచుకుని తర్వాత సాధారణ షాంపూతో తల స్నానం చెయ్యడం వల్ల చక్కటి ఫలితం కనిపిస్తుంది.


జుట్టు రాలాడానికి కారణాలు


కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపాలు, చుండ్రు, జిడ్డు చర్మం, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత, రసాయనాల షాంపూల వాడకం తదితర కారణాల వల్ల జుట్టు రాలే అవకాశం ఉంది.


జుట్టు రాలడం.. చిట్లడానికి మధ్య తేడా


జుట్టు రాలడానికి చిట్లడానికి మధ్య చిన్న తేడా ఉంది. జుట్టు చివర్ల చిట్లి పోవడానికి కెమికల్ లోషన్స్, అధిక వేడి, రబ్బరు బ్యాండ్లు వాడకం, పొడి బారడం వల్ల ఇలా జరుగుతుంది. కానీ జుట్టు రాలడం అనేది కుదుళ్ల నుంచి జరుగుతుంది. సహజంగానే జుట్టు రాలుతుందంటే ఆందోళన పడుతూనే ఉంటాం. రోజుకి కనీసం 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతాయి. అది ఎక్కువగా రాలిపోయిందంటే జుట్టు సన్నబడుతుంది. అందుకే జుట్టు రాలే సమస్య నుంచి బయట పడేందుకు సరైన ఆహారం తీసుకుంటూ కేశాల సంరక్షణ జాగ్రత్తగా చూసుకోవాలి.