అల్యూమినియం వంటపాత్రలు వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. కళాయిలు, బిర్యానీలు వండే పాత్రలు, అన్నం పాత్రలు అధికంగా అల్యూమినియంలోనే దొరుకుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ పాత్రలు కనిపిస్తునే ఉంటాయి. అయితే అల్యూమినియం పాత్రల్లో వండే ఆహారాలను దీర్ఘకాలంగా తినడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం. ఈ విషయాన్ని వడోదరలో ఉన్న ఎమ్మెస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆహారపరిశోధకులు కనుగొన్నారు. అల్యూమినియం కళాయిల్లో వండే డీప్ ఫ్రై వంటల వల్ల అల్యూమినియం సూక్ష్మమైన కణాల రూపంలో శరీరంలో చేరే అవకావం ఉంది. దీని వల్ల మతిమరుపు వ్యాధితో పాటూ ఆస్టియోపోరోసిస్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే ఇది మెదడు కుచించుకుపోయేలా చేస్తుంది. మెదడు కణాలు కూడా చనిపోయే పరిస్థితి కలుగుతుంది.
అధ్యయనం ఇలా..
వడోదరలో నివసిస్తున్న 90 మంది అల్టీమర్స్ రోగులపై ఈ పరిశోధన సాగింది. వీరంతా తేలికపాలి నుంచి తీవ్రమైన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అలాగే వీరి వయసు కూడా 60 ఏళ్లు దాటిన వారే.వీరు ఎన్నో ఏళ్లుగా అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారాన్ని తింటున్న వారే. మతిమరుపు వ్యాధికి, అల్యూమినియం పాత్రలకు మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవాలనుకున్నారు అధ్యయయనకర్తలు. వారు చెప్పిన ప్రకారం అధిక ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం పాత్రలు కంటికి కనిపంచకుండా కరగడం ప్రారంభమవుతుంది. చాలా చిన్న చిన్న కణాలుగా విడిపోయి ఆహారంలో కలిసిపోతుంది ఈ లోహం. దీని వల్లే అనేక సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థకు కూడా హాని కలిగిస్తుంది. కేవలం అల్యూమినియం పాత్రల్లో వండడమే కాదు, అల్యూమినియం ఫాయిల్ పేపర్లలో బేకింగ్ చేయడం వల్ల కూడా ఆహారసమస్యలు ఎదురవుతాయి.
అంత ప్రమాదమా?
ఏజెన్సీ ఫర్ టాక్సిక్ సబ్‌స్టాన్సెస్ అండ్ డిసీజ్ రిజిస్ట్రీ (ATSDR) ప్రకారం, అల్యూమినియం పాత్రల్లో వండుకునే వారు ఆహారంతో పాటూ 0.01 నుండి 5 శాతం వరకు అల్యూమినియం శరీరంలో చేరుతుంది. కానీ ఇందులో అధిక భాగం రక్త ప్రవాహంలోకి మాత్రం చేరదు. ఎవరి రక్తంలో అయితే అవసరమైన దానికంటే అధికంగా అల్యూమినియం చేరుతుందో వారిలో శ్రద్ధ,అభ్యాసం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఈ పరిస్థితి ఎక్కువగా అల్యూమినియం పరిశ్రమలలో పనిచేసే కార్మికులలో కనిపిస్తుంది. అయితే ఇంతవరకు అల్యూమినియం పాత్రలకు, మతిమరుపు వ్యాధికి మధ్య ఉన్న బంధం బయటపడలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని అధ్యయనం ద్వారా బయటపెట్టారు పరిశోధకులు.
ఏ పాత్రలు బెటర్?
ఆరోగ్యానికి ఏది మంచిదో అదే చేయాలి. ఆరోగ్యాన్ని పణం పెట్టడం మంచిది కాదు కాబట్టి అల్యూమినియం పాత్రలు వాడడం మానేసి ఇనుము లేదా స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలు వాడడం మంచిది.
Also read: మామిడి పొడి కూడా మసాలానే, వంటల్లో కలుపుకుంటే ఎన్ని లాభాలో, నియంత్రణలోనే మధుమేహం
Also read: ఈ ఆరు అలవాట్లు వదలకపోతే, త్వరగా ముసలివాళ్లవ్వడం ఖాయం