ప్పుడు స్మార్ట్ ఫోన్లే మనుషులను నడిపిస్తున్నాయి. ఫోన్ లేకుండా ఒక్క గంట కూడా ఉండలేని పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు కీబోర్డు ఫోన్ ఉందంటేనే చాలా గొప్పగా చూసే వాళ్ళు. టెక్నాలజీ పెరిగే కొద్ది ఫోన్స్ లోనూ మార్పులు వచ్చాయి. మొదట 2 జీ.. 3 జీ.. 4 జీ.. ఇప్పుడు 5 జీ కి వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ మన జీవితాల్ని శాసిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఫోన్ రేడియేషన్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ఉన్న వాదన. సెల్ ఫోన్ టవర్స్ రేడియేషన్ వల్లే పిచ్చుకలు వంటి పక్షుల జాతులు అంతరించిపోతున్నాయని పర్యావరణ వేత్తలు మొత్తుకుంటున్నారు. ఆ రేడియేషన్ ప్రభావం మనుషుల శరీరం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాదిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ చర్చ తెర మీదకి వచ్చింది. కారణం 5 జీ రావడమే.


అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్?


5 జీ ఫోన్స్ రేడియేషన్ వల్ల మెదడు క్యాన్సర్ లేదా శరీరంలోని ఇతర భాగాలకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందేమో అని చర్చ తెరమీదకి వచ్చింది. ఐదో తరం(5 జీ) సెల్ ఫోన్లు 80 GHz వరకు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించగలవని అంచనా వేస్తున్నారు. మొబైల్ ఫోన్లు రేడియేషన్ ని విడుదల చేస్తాయి. ఇవి విడుదల చేసే రేడియో తరంగాల వల్ల వచ్చే అనారోగ్య ప్రభావాల గురించి ఎప్పటి నుంచో పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. 2016లో ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనం, 2019లో MSKC క్యాన్సర్ రీసెర్చ్ సొసైటీ నిర్వహించిన అధ్యయనాలు సెల్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల మానవ శరీరానికి అంత హాని కలిగించడం లేదని వెల్లడించాయి.


యూకేలో నిర్వహించిన ఒక అధ్యయనం మాత్రం సెల్ ఫోన్ రేడియేషన్ గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్ అనే బ్రెయిన్ ట్యూమర్‌కు కారణమవుతుందని పేర్కొంది. ఇది కాస్త ఆందోళన కలిగించినప్పటికి చివరకి అది వాస్తవం కాదని తేలింది. సెల్ ఫోన్స్ వినియోగం పెరగడం వల్లే క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుందనేది పూర్తిగా అవాస్తవం. ఫోన్ ఎంత దగ్గరగా వాడుతున్నామనేది, టవర్ కి ఎంత దూరంగా లేదా దగ్గరగా ఉంటున్నాం, ఫోన్ మోడల్ వంటి అనేక అంశాలు రేడియేషన్ కు గురికావడాన్ని నిర్ణయిస్తాయి.  


X-కిరణాలు ప్రమాదకరమేనా?


సెల్ ఫోన్ రేడియేషన్ తో పాటు X-Ray కిరణాల వల్ల హాని కలుగుతుందా అనే అనుమానం అందరికీ ఉంటుంది. రేడియేషన్ తో పోల్చుకుంటే ఇది హానికరమైనది. కణజాల నష్టాన్ని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. X-Ray కిరణాలు, CT స్కాన్లు కోసం ఎక్కువగా ఉపయోగించే పరికరాలు హానికరం అని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ కిరణాలు శరీరం గుండా వెళ్ళినప్పుడు అందులోని కొంత భాగం శరీర అంతర్గత నిర్మాణాల ద్వారా వెళ్ళడం జరుగుతుంది. కానీ వైద్యులు సూచిస్తే మాత్రమే ఇటువంటి పరీక్షలు చేయించుకోవాలి. 


అన్ని రేడియేషన్ పరీక్షలలో అత్యంత సురక్షితమైనది MRI స్కాన్ పరీక్ష. దీనికి రేడియేషన్ ఎక్స్‌పోజర్ ఉండదు. అవసరమైతే గర్భిణీ స్త్రీలు కూడా MRI చేయించుకోవచ్చు. డయాగ్నస్టిక్ ప్రాక్టీస్‌లో గ్రహించిన రేడియేషన్ మోతాదుల నుంచి ప్రతికూల ప్రభావాలు చాలా అరుదు అని US నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: డయాబెటిస్ అదుపులో ఉండాలా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చెయ్యండి