మనలో కొంతమందికి పడుకునే టైమ్ లో లైట్ ఉంటేనే నిద్రపడుతుంది. మరి కొంతమందికి లైట్ ఉంటే అస్సలు నిద్ర పట్టదు అంటారు. అయితే లైట్ ఉంచుకుంటే మంచిదా? లేకపోతే మంచిదా అంటే.. లైట్ లేకుండా పడుకోవడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. చికాగోకి చెందిన ఒక యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం లైట్ ఉంచి పడుకుంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తేలింది.
రాత్రి పూట లైట్ వేసుకుని పడుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్త పోటు వచ్చే ప్రమాదం ఉన్నట్టు తేలింది. చికాగోలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఫీన్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ దీని మీద అధ్యయనం చేసింది. ఆక్స్ ఫర్డ్ అకడమిక్ స్లీప్ ప్రచురించిన కథనం ప్రకారం.. 63 నుంచి 84 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 552 మందిని 7 రోజుల పాటు పరిశీలించి ఈ అధ్యయనం చేశారు.
అధ్యయనం చేసిన డా. మింజే కిం ‘మెడికల్ న్యూస్ టుడే’తో మాట్లాడుతూ ‘‘రాత్రి పూట లైట్ వేసుకుని పడుకోవడం వల్ల పెద్ద వాళ్ళలో అనారోగ్య సమస్యలు వచ్చినట్లు మేం గమనించాం. వారిలో ఎక్కువ మంది ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక ఒత్తిడిని వాళ్ళు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. తక్కువ కాంతిలో వాళ్ళు పడుకుంటే సరిగా నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నట్టు మేం గ్రహించాం” అని ఆయన చెప్పుకొచ్చారు.
“నిద్రలేవడానికి కొన్ని గంటల ముందు ఫ్రాగ్మెంటేడ్ స్లీప్ లోకి మనం వెళ్తాం. గది చీకటిగా ఉండటం వల్ల నిద్రాభంగం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది” అని ముంబయిలోని జైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిటికల్ కేర్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. రాకేశ్ రాజ పురోహిత్ చెప్పుకొచ్చారు. నిద్రించే సమయాల్లో లైట్ ఉండటం వల్ల ఆ కాంతి మన నిద్రకి ఆటంకం కలిగించడం తో పాటు నిద్రించే సమయం తగ్గుతుందని మరో డా. అంకిత మూలే అంటున్నారు. “గది చీకటిగా ఉంచుకుని నిద్రపోవడం వల్ల మన శరీరం నుంచి melatonin హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రొమ్ము, ప్రొస్టేట్ కాన్సర్ సహ ఇతర వ్యాదులతో పోరాడేందుకు సహాయపడుతుంది. గది చీకటిగా ఉండటం వల్ల ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటును నియంత్రించడంతో పాటు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది” అని డా. షా తెలిపారు. అంతే కాకుండా మన కళ్ళకి విశ్రాంతిని ఇవ్వడంతో పాటు వాటిని కాపాడుతుందని ఆయన అన్నారు. మీకు లైట్ లేకుండా నిద్రపట్టదు అని అనుకుంటే కొద్దిగా వెలుతురు ఉండేలాగా చూసుకోవడం ఉత్తమం. చిన్న బెడ్ లైట్ పెట్టుకుని కొద్దిసేపటి తర్వాత అది పూర్తిగా ఆరిపోయే విధంగా ఉండేలా చూసుకోవాలి.
Also Read: దెయ్యాలు ఉన్నాయా? ఆత్మలు కనిపిస్తాయా? ఈ వాస్తవాలు మిమ్మల్ని షేక్ చేస్తాయ్!