మనదేశంలో తెల్లవారి పాలన అంతమయ్యేలా చేసిన వారిలో నెహ్రూ ఒకరు. గాంధీజీని అనుసరించి ఆయనతో ఎన్నో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. జైలు పాలయ్యారు. దేశానికి స్వాత్రంత్యం లభించాక భారతావనికి మొట్ట మొదటి ప్రధాని అయ్యారు. తాను మరణించే వరకు ప్రధానిగానే కొనసాగారు. ఈయన జీవితం గురించి ఈ కాలం పిల్లలు కచ్చితంగా తెలుసుకోవాలి. 


చాలా నెహ్రూ తన పొడవాటి కోటుకు తాజాగా పూసిన ఎర్ర గులాబీని పెట్టుకుంటారు. మొదట్నించి ఆయనకు ఆ అలవాటు లేదు. మధ్యలో వచ్చినదే. కానీ అది ఆయనకు చాలా ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఆయన భార్య కమలా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు. 1938లో ఆమె మరణించారు. ఆమెకు గుర్తుగా ఆమె మరణించినప్పటి నుంచి ఎర్రగులాబీని తన కోటుకు పెట్టుకోవడం ప్రారంభించారు. 


కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇవిగో...
1. నెహ్రూ తన జీవితాన్ని ఎక్కువగా ఆనంద భవన్లోనే గడిపారు. అప్పట్లో ఈ భవనాన్ని స్వరాజ్ భవన్ అని పిలిచేవారు. దీన్ని అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ 1930లో నిర్మించారు. తరువాత ఇందిరా గాంధీ భవనాన్ని నెహ్రూ ప్లానిటోరియంగా మార్చారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో ఉంది. 


2. నెహ్రూని... ‘పండిట్ నెహ్రూ’ అని కూడా పిలుస్తారు. ఆయనకు ఆ పండిట్ అనే పేరు ఎందుకు జత చేరిందో తెలుసా? ఆయన కాశ్మీరి పండిట్ కుటుంబానికి చెందిన వారు. అందుకే పండిట్ నెహ్రూ అని కొంతమంది పిలిచేవారు. 


3. నెహ్రూ తండ్రి అయిన మోతీలాల్ తన కొడుకు తన పార్టీ అయిన స్వరాజ్ పార్టీలో చేరాలని కోరుకున్నారు. కానీ నెహ్రూ నమ్మకమైన వ్యక్తిగా కాంగ్రెస్‌లోనే గాంధీతో ఉండిపోయారు. ఇది ఆయన నిబద్ధతకు చిహ్నమని చాలా మంది భావిస్తారు. 1919 నుంచి ఆయన చురుగ్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం, దేశ స్వతంత్రం కోసం పనిచేయడం మొదలుపెట్టారు. 


4. ఈయన కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో చదివారు. మూడేళ్ల పాటూ ఆ ప్రఖ్యాత కాలేజీలో చదివి డిగ్రీ పట్టా అందుకున్నారు. దాదాపు ఏడేళ్లు ఆయన ఇంగ్లాండులోనే తన జీవితాన్ని గడిపారు. అందుకే తన గురించి ఆయన చెప్పకుంటూ ‘నేను తూర్పు పడమరల మిశ్రమంగా మారిపోయాను’ అని చెప్పుకున్నారు. 


5. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన్ను నాలుగేళ్లు జైల్లో వేశారు బ్రిటిషర్లు. 1942 నుంచి 1946 వరకు జైల్లోనే ఉన్న ఆయన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకాన్ని రాశారు. 


6. నెహ్రూ తన కుటుంబంతో ఢిల్లీలో జీవించిన భవనం ‘తీన్ మూర్తి భవన్’, తరువాత ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ’గా మారిపోయింది.


7. నెహ్రూ కుటుంబం చాలా సంపన్నమైనది. ఆయన పుట్టే సరికే ఇల్లు భోగభాగ్యాలతో తుల తూగేది. మోతీలాల్ నెహ్రూకు స్వరూప రాణి రెండో భార్య. వీరిద్దరి తొలిసంతానమే జవహర్ లాల్ నెహ్రూ. మోతీలాల్ మొదటి భార్య ప్రసవ సమయంలో మరణించారు. పుట్టిన బిడ్డ కూడా మరణించారు.  


 Also read: కుళ్లిపోయిన మాంసం వాసన వేసే పండు ఇది, అయినా ఇష్టంగా తింటారు