Diwali 2023 in Telangana: పిల్లలకు, పెద్దలకు ఇష్టమైన వేడుక దీపావళి. ఈరోజున ఇళ్లు, వీధులు, గ్రామాలు, నగరాలు దీపాల వెలుగులో మిలమిలలాడుతాయి. నిజానికి ఇప్పుడు ఎన్నో రకాల దీపాలు వచ్చాయి. కొవ్వొత్తులతో కూడా దీపాలను వెలిగిస్తున్నారు. కానీ మట్టి ప్రమిదలలో నూనె పోసి ఒత్తిపెట్టి దీపాన్ని వెలిగించడమే సరైన పద్ధతి. ఇల్లు నిండుగా కనిపించాలని ఇంటిముందు ఎక్కడ పడితే అక్కడ దీపాలను పెట్టేసేవారు ఎంతోమంది. నిజానికి దీపాల లెక్క ఒకటి ఉంది. పెద్దలు చెబుతున్న ప్రకారం దీపావళి నాడు కచ్చితంగా ఇంటి ముందు 13 దీపాలను వెలిగించాలి. అయితే అవి ఎక్కడెక్కడ పెట్టాలో కూడా చెబుతున్నారు పెద్దలు.


పూర్వపు పద్ధతుల ప్రకారం దీపావళి నాడు 13 దీపాలను వెలిగించాలి. ఆ ఒక్కో దీపానికి ఒక్క అర్థం ఉంది. Diwali 2023 Vastu Tips To Place Mud Lamps In House


1. మొదటి దీపం మీ కుటుంబానికి రక్షగా నిలిచేది. మీ కుటుంబాన్ని అకాల మరణం నుంచి కాపాడుతుంది. అందుకే మొదటి దీపాన్ని మీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో వెలిగించాలి. ఆ దీపాన్ని మీరు చెత్త వేసే డస్ట్ బిన్ దగ్గర ఉంచాలి. ఆ డస్ట్ బిన్ కచ్చితంగా దక్షిణం వైపు ఉండేలా చూడాలి.


2. ఇక రెండో దీపాన్ని కచ్చితంగా నెయ్యితోనే వెలిగించాలి. ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చే దీపం. ఈ దీపాన్ని మీ పూజ మందిరంలో ఉంచండి.


3. మూడో దీపం మీ కుటుంబానికి సంపదను, శ్రేయస్సును అందించేది. లక్ష్మీదేవి కోసమే ఈ మూడో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించాక లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి.


4. ఇక నాలుగో దీపం మీ ఇంటిని ప్రశాంతంగా, సంతోషంగా ఉంచేది. కాబట్టి ఆ దీపాన్ని వెలిగించి తులసి మొక్క ముందు ఉంచి నమస్కరించండి.


5. ఐదో దీపం విషయానికి వస్తే ఇంట్లో ప్రేమను, ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. దీన్ని కచ్చితంగా మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచండి.


6. ఆరో దీపం విషయానికొస్తే దీన్ని ఆవనూనెతో వెలిగించాలి. ఈ దీపం చాలా శుభాన్ని తెస్తుంది. మీ ఇంట్లోని ఆర్థిక సంక్షోభాలను, అనారోగ్యాలను, కీడును దూరం పెడుతుంది. అలాగే మీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది. సంపదను ఇస్తుంది. కాబట్టి ఈ దీపాన్ని నేరుగా తీసుకెళ్లి రావి చెట్టు ముందు ఉంచండి. మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి.


7. ఏడవ దీపాన్ని మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే అక్కడ దేవునికి నమస్కరించి ఆ దేవాలయంలో ఉంచి రండి.


8. ఇక ఎనిమిదో దీపాన్ని మీరు ఎక్కడైతే ఇంటి నుండి చెత్తను ఏరి పడేసి వస్తారో ఆ ప్రదేశంలో వెలిగించి రావాలి.


9. తొమ్మిదో దీపం చాలా ముఖ్యమైనది. ఇది మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో ప్రవహించేలా చేస్తుంది. కాబట్టి తొమ్మిదో దీపాన్ని మీ బాత్రూంలో గుమ్మం దగ్గర ఉంచండి.


10. పదో దీపం మీ ఇంటి రక్షణ బాధ్యతను మోస్తుంది. కాబట్టి దాన్ని తీసుకెళ్లి మీ ఇంటికి కాస్త ఎత్తు భాగంలో ఉంచండి. ఇంటి పై కప్పు పైన ఉంచినా పర్వాలేదు.


11. పదకొండవ దీపం ఇంట్లోని వారందరూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి దీన్ని మీ ఇంటికి కిటికీల వద్ద ఉంచండి.


12. పన్నెండవ దీపం వీధిలోని ప్రజలందరికీ కనిపించేలా వెలిగించాలి. అందరికీ కనబడేలా ఆ దీపాన్ని వెలిగించి పెట్టండి. ఇంటి టెర్రస్ మీద పెట్టినా పర్వాలేదు. కానీ వీధిలో వాళ్లకి కనిపించేలా ఉండాలి. ఇది పండుగ అందరూ కలిపి చేసుకునేదని చాటి చెప్పే దీపం.


13. ఇక పదమూడో దీపాన్ని మీ ఇంటికి వెళ్లే దారిలో మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు.


దీపావళి రోజున పదమూడు దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. ఇల్లు ఎక్కువగా మెరిసిపోవాలని అధికంగా దీపాలు వెలిగించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ముఖ్యంగా కొవ్వొత్తులకు దూరంగా ఉండండి. మట్టి ప్రమిదల్లో ఒత్తి వేసి వెలిగించడానికి ప్రయత్నించండి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.