Tomato Powder: టమాటో ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయడం కష్టం. ఒక్కోసారి కొండెక్కి కూర్చుంటాయి. కిలో రూ.200 వరకు ఈ ఏడాది టమోటాలు పలికాయి. టమోటా ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఓసారి పొడి చేసుకుని దాచుకుంటే ఏడాదంతా వాడుకోవచ్చు. దీని రుచి కూడా బావుంటుంది. కూరల్లో వేసుకుంటే టేస్టీ ఇగురు రావడం ఖాయం. వంటకాలకు కొత్త రుచి కావాలంటే ఇలా టమోటో పొడిని ఓసారి ప్రయత్నించండి.
చేయడం చాలా సులువు
టమోటా ధరలు ప్రస్తుతం తక్కువగానే ఉన్నాయి. టమోటోలు ఎక్కువ కొని పెట్టుకుంటే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఎన్నిరోజులైనా ఉంటాయి. ముందుగా మూడు కిలోల టమోటాలను కొనండి. వాటిని సన్నగా కోసుకోండి. ఏ ఆకారంలో కోసినా ఫర్వాలేదు. కానీ సన్నగా తరగాలి. గుండ్రిని చక్రాల్లా కోసుకుంటే త్వరగా ఎండుతాయి. వీటిని ఎర్రటి ఎండలో ఆరబెట్టండి. ఎంతగా ఇవి ఎండాలంటే ఒక గిన్నెల్లో వేస్తే శబ్ధం రావాలి. ఆ తరువాత మిక్సీలో వేసి పౌడర్ కొట్టండి. కొంతమంది మెత్తటి పొడిలా చేసుకుంటారు. మరికొందరు బరకగా చేసుకుంటారు. ఎలా చేసిన కూరలకు ఇది మంచి రుచిని ఇస్తుంది. చికెన్, మటన్, గుడ్లు కూరలకు కాస్త ఉల్లిపాయలేసి, ఈ టమోటో పొడి వేసి కలిపితే ఇగురు ఎక్కువగా వస్తుంది. కోడి గుడ్లు, టమోటా పొడి కాంబినేషన్ రుచి అదిరిపోతుంది.
టమోటాలను ప్యూరీగా దాచుకునే వారు ఉన్నారు. టమోటాలను మిక్సీలో వేసి మెత్తటి గుజ్జు చేయాలి. ఒక గాలి చొరబడని డబ్బాలో వేసి ఉప్పు కలపాలి. దీన్ని ఫ్రిజ్ లోనే దాచుకోవాలి. ఇది ఒక రెండు నెలలు ఫ్రెష్ గా ఉంటుంది. ఆ తరువాత మాత్రం వాసన మారిపోయే అవకాశం ఉంది. మీ అవసరాన్ని బట్టి పొడిగా దాచుకోవాలో, లేక ప్యూరీగా చేసి దాచుకోవాలో నిర్ణయించుకోండి. ఎలా తిన్నా టమోటాలు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. మధుమేహం ఉన్న వారికి టమోటోలు ఎంతో మేలు చేస్తాయి. ఇదిలో ఉండే క్రోమియం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. టమోటోలు తినడం వల్ల చాలా రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. టమోటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి అత్యవసరమైనది. టమోటాలను ప్రతి రోజూ తినడం వల్ల ఎన్నో అనారోగ్యాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. టమోటాల ధరలు ఇప్పుడు అందరికీ అందుబాటు ధరలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే టమోటో పొడి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
Also read: బాత్రూమ్‌లోకి ఫోన్ తీసుకువెళుతున్నారా? భవిష్యత్తులో ఈ వ్యాధి వచ్చే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.