ఆనందకరమైన, సంతృప్తితో నిండిన వివాహాన్ని నిర్మించడానికి భార్యాభర్తలు ఇద్దరూ ముందడుగు వేయాలి. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే కొన్ని రకాల అలవాట్లు చేసుకోవడం ద్వారా మీ వివాహాన్ని సానుకూలంగా, ఆనందంగా మార్చుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో బలమైన బంధాన్ని పెంచుకోవచ్చు. ప్రేమ, ప్రశంసలు భార్యాభర్తల మధ్య ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఒకరిపై ఒకరి నమ్మకం, ఒకరికి ఒకరు మద్దతు వంటివి బలమైన పునాదిని వేస్తాయి. కాబట్టి వైవాహిక జీవితంలో ఉదయం పూట చేసే కొన్ని పనులు ఆరోజు అంతటని ఆనందంగా ఉంచుతాయి. 


ఉదయం లేచిన వెంటనే మీ జీవిత భాగస్వామికి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పండి. ఆ నవ్వు రోజంతా ఆమెలో సానుకూల స్పందనను అందిస్తుంది. అవకాశం ఉంటే గుడ్ మార్నింగ్ చెప్పి ఒక వెచ్చటి కౌగిలిని కూడా ఇవ్వండి. ఒకరికొకరు ఇలా గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం వల్ల మీరు నిద్ర లేవగానే మీ మనసులో ఉన్న మొదటి వ్యక్తి మీ భాగస్వామి అని వారు అర్థం చేసుకుంటారు. ఇది ఒక అలవాటుగా మార్చుకోండి. 


టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే ఇద్దరూ కలిసి తాగండి. లేదా బ్రేక్ ఫాస్ట్ ఇద్దరూ కలిసే చేయండి. ఇలా చేయడం వల్ల మీ వివాహం మరింత బలంగా మారుతుంది. అలాగే ఆ సమయంలో అనవసర వాదనలు వంటివి పెట్టుకోకుండా, అర్థవంతమైన సంభాషణ, ప్రేమ పూరితమైన మాటలతో సంభాషణ ఉండేలా చేసుకోండి.  ముఖ్యంగా మీ పెదాలపై నవ్వును చెరగనివ్వకండి.


ఉదయం లేచాక వ్యాయామం లేదా ధ్యానం వంటివి ఇద్దరూ కలిసి చేయండి. ఉత్తేజపరిచే సంగీతాన్ని వింటూ వ్యాయామం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది ఇతరులను సానుకూల స్పందనలను కలిగిస్తుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టేలా చేస్తుంది.


ఉదయం లేచిన వెంటనే కౌగిలించుకోవడం లేదా చిన్న ముద్దు పెట్టుకోవడం, చేతులు పట్టుకోవడం వంటివి జీవిత భాగస్వామికి చాలా ధైర్యాన్ని నింపుతాయి. శారీరక స్పర్శ మంచి అనుభూతిని కలిగిస్తుంది. సంతోషకరమైన  హార్మోన్లను విడుదల అయ్యేలా చేస్తుంది. కాబట్టి ఉదయం లేచాక చిన్న కౌగిలింత లేదా చిన్న ముద్దుతో ఆమెను లేదా అతడిని విష్ చేయండి. ఆమె వంట చేస్తున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆమె భుజంపై సున్నితంగా చేయి వేయడం  మీ ప్రేమను సూచిస్తుంది.


మీరు ఎంత బిజీగా ఉన్నా లేదా ఉదయం పూట ఎంత బిజీగా ఆఫీస్ కి పరుగులు పెడుతున్నా ఆమె కోసం మాత్రం ఒక ఐదు నిమిషాలు అయినా కేటాయించండి. ఆమెతో నేరుగా కంట్లోకి చూస్తూనే మాట్లాడండి. ఉదయాన త్వరగా వెళ్లాల్సి వస్తే ఈవినింగ్ త్వరగా వస్తానని, బయటకు వెళ్దామని, లేకుంటే కలిసి భోజనం చేద్దామని, కలిసి స్నాక్స్ తిందామని చెప్పండి. ఇది కేవలం భర్తకే వర్తించదు. భార్య అయినా సరే ఇలాంటి ప్రేమపూర్వకమైన పనులు చేయాల్సిందే.


Also read: ఆ గర్భం నా వల్ల వచ్చింది కాదనిపిస్తోంది, ఇప్పుడు ఏం చేయాలి?


Also read: దగ్గు మందులో ఈ హానికర రసాయనం? ఇది లేని దగ్గు సిరప్ ఎంచుకోండి