పోషకాలతో నిండిన గుడ్లను చాలామంది ఇష్టపడతారు. ఆమ్లెట్ నుంచి ఎగ్ బుజీ వరకు అనేక రకాల వంటలు చేసుకుని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. ఫిట్ నెస్ ఔత్సాహికులు ప్రోటీన్ పొందటం కోసం తప్పనిసరిగా గుడ్లు తీసుకుంటారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. కానీ గుడ్లులో ఉండే కొలెస్ట్రాల్ గుండె జబ్బులు కలిగిస్తుందని నమ్ముతారు. అది ఎంత వరకు నిజం? గుడ్లు తినడం వల్ల కొవ్వు పేరుకుపోతుందా?


గుడ్లు అధిక స్థాయిలో చెడు కొలెస్ట్రాల్ కి దారి తీస్తాయని అందుకే వాటిని నివారించాలని అంటారు. ఇతర ఆహారాల కంటే వీటిలో కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ నిజానికి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది. గుడ్లు తినడానికి హృదయ సంబంధ వ్యాధులు (CVD) రావడానికి ఎటువంటి సంబంధం లేదని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. దీనిపై జరిపిన అధ్యయనం జరిపిన బృందం మాట్లాడుతూ గుద్దుకు, సీవీడీ ప్రమాదానికి ఎటువంటి లింకు ఉన్నట్టు తాము కనుగొనలేదని వెల్లడించారు.


వారానికి 12 గుడ్లు తీసుకోవడం వల్ల మధుమేహులలో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె జబ్బుల ప్రమాదాన్ని ప్రభావితం చేయలేదని చెప్పుకొచ్చారు. గుడ్లు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని సూచిస్తున్నారు. హెల్త్ లైన్ ప్రకారం ఆరోగ్యకరమైన పెద్దలు రోజుకు 1-2 గుడ్లు తీసుకోవచ్చు. ఇది ఎటువంటి దుష్ప్రభావాలకి దారి తీయదు. గుడ్లు హానికరం కానప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం సమస్యలు వస్తాయి. చెడు కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు గుండె జబ్బులకి దారి తీస్తుంది.


అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న వెన్న, చీజ్, ప్రాసెస్ చేసిన మాంసాలు వంటి సంతృప్త కొవ్వులతో కూడిన ఆహారం, ట్రాన్స్ ఫ్యాట్ కొవ్వులు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడుతుంది. గుండెకి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు రోజువారీ కేలరీలు తీసుకోవడం పరిమితం చేయడం ముఖ్యం.


అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్, ఇతర ఆరోగ్య సంస్థల చెప్పిన దాని ప్రకారం గుడ్డు మితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఏ విధమైన హాని తలపెట్టదు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలపై గుడ్డు పరిమిత ప్రభావాన్ని మాత్రమే చూపుతుందని పరిశోధనలో తేలింది. అందుకే మితంగా వాటిని తీసుకుంటే గుడ్డు వల్ల పొందే ప్రయోజనాలు అన్నీ శరీరానికి అందుతాయి.


శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే రోజుకొక ఉడకబెట్టిన గుడ్డు తింటే సరిపోతుంది. ఒక రోజులో ఎక్కువ గుడ్లు తింటే మాత్రం శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళు గుడ్డులోని పచ్చసొన తీసేసి తినొచ్చు. మితంగా గుడ్లు తినడం వల్ల డయాబెటిస్, రక్తపోటు వచ్చే అవకాశం తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: స్నానం చేసేటప్పుడు ఈ శరీర భాగాలు శుభ్రం చేసుకోవడం లేదా?