బట్టతల.. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో చిత్రవధ చేస్తుంది. అయితే, బట్టతల ఉంటే బెడ్ రూమ్‌లో తమ పార్టనర్‌తో బాగా రాణిస్తారనే వార్త ఒకటి ఇటీవల చక్కర్లు కొడుతోంది. ఇంతకీ బట్టతలకు, మగతనానికి లింకేమిటీ? బట్టతల ఉంటే నిజంగానే బెడ్ రూమ్‌లో కింగ్‌ రెచ్చిపోతారా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు? 


బట్టతల పురుషులకు వరమని, పడక గదిలో తమ పార్టనర్‌ను బాగా సుఖపెడతారనే విషయం ఇప్పటిది కాదు.. కొన్ని శతాబ్దాలుగా దీనిపై చర్చ నడుస్తోంది. బట్టతల గలవారిలో టెస్టోస్టేరోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని, అందుకే బట్టతల ఉన్నవారు ఆ విషయంలో మెరుగ్గా ఉంటారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. చివరికి నీళ్లు చల్లారు. 


బట్టతలకు, లైంగిక శక్తికి లింకేమిటీ?


బట్టతలకు లైంగిక శక్తికి అస్సలు సంబంధమే లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. జుట్టు కోల్పోతే మగతనం పెరగదని స్పష్టత ఇచ్చారు. యూకేకు చెందిన ఓ వైద్యుడు మీడియాతో మాట్లాడుతూ.. బట్టతలకు, పురషత్వానికి చాలామంది లింకు పెడుతున్నారు. వాస్తవానికి పురషత్వం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తి సామర్థ్యం వంటివి ఉంటాయి. ఇవన్నీ మెరుగ్గా ఉండాలంటే.. భౌతిక, మానసిక, లైఫ్‌స్టైల్ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అయితే, బట్టతల ఉంటే పురుషత్వం మెరుగ్గా ఉంటుందనే విషయాన్ని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. 


బట్టతలకు కారణాలు అనేకం


అమెరికన్ హెయిర్ లాస్ అసోషియేషన్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రపంచంలో 85 శాతం మంది పురుషులు 50 ఏళ్లు రాగానే జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. బట్టతలకు చాలా అంశాలు కారణం కావచ్చు. కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉన్నట్లయితే.. అది వారి వారసులకు కుడా సంక్రమించవచ్చు. అలాగే, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, అనారోగ్యం, బరువు తగ్గడం ఇలా.. అనేక కారణాల వల్ల బట్టతల ఏర్పడవచ్చు. 


లైంగికంగా చురుగ్గా ఉంటే బట్టతల?


డైహైడ్రోటెస్టోస్టెరోన్ (DHT) అని పిలువబడే టెస్టోస్టెరాన్ బైప్రొడక్ట్ జన్యు లోపం వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఇటీవల మెడికల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కూడా బట్టతల గల పురుషుల్లో లైంగికశక్తి అంశాన్ని ప్రస్తావించింది. బట్టతలకు, పురుషత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. బట్టతల కలిగిన పురుషులు.. తమ జీవితంలో నలుగురి కంటే ఎక్కువ మంది మహిళలతో లైంగిక సంబంధం కలిగి ఉండే అవకాశాలు చాలా తక్కువ అని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. 18 నుంచి 20 ఏళ్ల వయస్సులోనే అతిగా లైంగిక కార్యకలాపాలకు పాల్పడే యువతకు బట్టతల వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఓ సర్వే పేర్కొంది. ఈ సర్వే వల్లనే బట్టతల గల పురుషులు ఎక్కువ లైంగిక శక్తిని కలిగి ఉంటారనే ప్రచారం ఊపందుకుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ప్రమాదంలో ఆరోగ్యం - వర్షాకాలంలో ఇమ్యునిటీ కోసం ఈ పానీయాలు తాగండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial