‘అపరిచితుడు’ సినిమా చూసినప్పుడు.. ఇతడేంటీ ఇలా మారిపోతున్నాడు? మరీ విడ్డూరం కాకపోతే.. ఒక మనిషి తనకు తెలియకుండా అన్ని రకాలుగా మారిపోతాడా? అనే సందేహం చాలామంది వ్యక్తం చేశారు. అస్సలు అలాంటి మనుషులే ఉండరని వాదించేవాళ్లు కూడా ఉన్నారు. అయితే, ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అనేది నిజంగానే ఉనికిలో ఉంది. దీన్నే ‘డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ (DID)’ అని కూడా అంటారు. ఇందుకు జర్మనీకి చెందిన ఈ 22 ఏళ్ల యువకుడే నిదర్శనం. ఇతడు అందరిలా సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నాడు. ఎందుకంటే.. అతడిలో 11 రకాల మనుషులు ఉన్నారు. అతడిలో ఉన్న ఒక్కో మనిషిది ఒక్కో వ్యక్తిత్వం. అంతేకాదు.. ఆ మనుషుల వయస్సులో కూడా చాలా తేడా ఉంది. 4 ఏళ్ల పసివాడి నుంచి 26 ఏళ్ల యువకుడి వరకు.. వివిధ రకాలుగా అతడి వ్యక్తిత్వం ఉంటుంది. వినడానికి చిత్రంగా ఉన్న ఒక చేదు నిజం ఇది.
ఒకే వ్యక్తి 11 వ్యక్తిత్వాలకు 11 పేర్లు: జర్మనీలోని మ్యూనిచ్‌లో నివసిస్తున్న ఆ యువకుడి అసలు పేరు లియోనార్డ్ స్టోక్ల్. అసలు పేరని ఎందుకు చెప్పల్సి వచ్చిందంటే.. అతడిలో ఉన్న పది రకాల మనుషులకు పది రకాల పేర్లు ఉన్నాయి. ఆ మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి.. అతడి తల్లిదండ్రులు ఒక్కో పేరు పెట్టారు. అతడు నాలుగేళ్ల పసిపిల్లాడిలా ప్రవర్తించేప్పుడు అంతా అతడిని కోవు అని పిలుస్తారు. ఎనిమిదేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు హెక్టర్ అని పిలుస్తారు. 16 ఏళ్ల వయస్సు టీనేజర్‌లా ఉన్నప్పుడు అనా అని అంటారు. కాస్మో (17 ఏళ్లు) యాష్ (18) జెస్సీ(19), లియో (21), బిల్లీ (23), లివ్ (24) రెడ్ (26).. ఇలా అతడి ప్రవర్తన బట్టి వయస్సు, పేర్లను నిర్ణయించారు. అతడు ఏ వ్యక్తిత్వంలోకి మారితే ఆ పేరుతో పిలుస్తూ అతడిలో ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తపడుతున్నారు.
11 మందితో సంసారం..: అన్నట్లు లియోనార్డ్‌కు పెళ్లి కూడా అయ్యింది. భార్య మాస్సిమో అతడి పరిస్థితిని అర్థం చేసుకుంది. అయితే, అతడు ఒక్కోసారి కోవు(4), హెక్టార్(8)గా మారినప్పుడు.. ఆమె కాస్త ఇబ్బందిగా ఫీలవ్వుతున్నట్లు చెప్పింది. రొమాన్స్ సమయంలో ఒక్కోసారి అతడి పసిపిల్లాడిలా మారిపోతుంటాడని ఆ సమయంలో అతడితో క్లోజ్‌గా ఉండటం కష్టంగా ఉంటుందని పేర్కొంది. మిగతా వారితో (అతడిలో ఉన్న 8 మందితో) తనకు ఎలాంటి సమస్య లేదని, వారిని తాను మేనేజ్ చేయగలుగుతున్నానని చెప్పింది. ఆమె పెళ్లి చేసుకున్నది ఒక్కరినే కానీ, లియోనార్డ్‌తో కలిపి సుమారు 11 మందితో సంసారం చేస్తోంది.
ఎందుకు అలా మారాడు?: డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్‌ను తెలుగులో ‘బహుళ వ్యక్తిత్వ క్రమరాహిత్యం’ అని చెప్పుకోవచ్చు. అంటే, ఒక వ్యక్తి మరో మనిషిలా మారిపోతుంటాడు. ఒక పద్ధతి, స్థిరత్వం ఉండదు. పైగా, తనలో ఉన్న మరో వ్యక్తి గురించి అతడికి అస్సలు గుర్తుండదు. ఎవరో చెబితే తప్పా.. తనలో అంత మంది మనుషులు ఉన్నారనే సంగతి అతడికి అస్సలు తెలీదు. ఒక వేళ తెలిసినా వ్యక్తిత్వం మారేప్పుడు అవన్నీ మరిచిపోతుంటాడు. లియోనార్డ్ గతేడాది పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో తనకు తెలియకుండా మల్టిపుల్ పర్సనాలిటీస్‌గా మారిపోయేవాడు. చదువు మీద ఫోకస్ చేయలేకపోయేవాడు. చివరికి జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. ఆ తర్వాత క్రమేనా పరిస్థితులు ఘోరంగా మారాయి. అతడిని పరీక్షించిన వైద్యులు లియనార్డో.. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు.
భార్యే దిక్కు: లియోనార్డ్ అసలు వ్యక్తిత్వానికి, అతడిలో ఉన్న మిగత వ్యక్తుల వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంటుంది. లియోనార్డ్ తన భార్య మాస్సిమోను చాలా ఇష్టపడతాడు. కానీ, ఆ 10 మంది వ్యక్తిత్వాలు ఆమెను ఇష్టపడరు. లియోనార్డ్ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు తనలోని మల్టిపుల్ పర్శనాలిటీ గురించి తెలుసుకుని బాధపడుతుంటాడు. వారు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. తనలో ఉన్న ఆ పది మంది వ్యక్తులు ఏ క్షణంలో ఏ చేస్తారనే భయం కూడా లియోనార్డ్‌లో ఉంది. అందుకే, అతడికి ఆ వ్యాధి ఏర్పడిన రోజు నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదు. అతడిలో ఇతర వ్యక్తులకు ఇంటి బయటకు వెళ్లాలని ఉన్నా.. కుటుంబ సభ్యులు ఓర్పుగా సమస్యను వివరించి ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఈ వ్యాధి వల్ల లియోనార్డ్ చదువును కోల్పోయాడు. చివరికి ఉద్యోగం కూడా లేదు. భార్యే ఇప్పుడు అతడి బాగోగులు చూసుకుంటోంది. పైగా ఈ వ్యాధికి చికిత్స కూడా లేకపోవడంతో ఇంకా ఎన్నాళ్లు ఇలా జీవించాలా అని లియోనార్డ్ వాపోతున్నాడు. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు కదూ.
Also Read: రసగుల్లాల కోసం వందలాది రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు, ఏందయ్యా ఇది?
Also Read: సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌కు మధ్య తేడాను ఈ లక్షణాలతో గుర్తించండి