ఒక కిలో బరువుండే పుచ్చకాయ ఎంత ధర ఉంటుంది? రూ.16 నుంచి రూ.20 వరకు ఉంటుంది కదూ. కొన్ని పుచ్చకాయలను పరిమాణం బట్టి రూ.100 వరకు ధర పలుకుతాయి. అయితే, ఈ పుచ్చకాయ మాత్రం కొన్ని లక్షల విలువ చేస్తుంది. సంపన్నులు ఎగబడి మరీ ఈ పుచ్చకాయను కొనుగోలు చేస్తారు. దీన్ని కొనేందుకు ఎన్ని లక్షలైనా వెచ్చించేందుకు సిద్ధమవుతారు. మరీ అంత డబ్బు పోసి కొనేంత ప్రత్యేకత ఈ పుచ్చకాయలో ఏముందనేగా మీ సందేహం? అయితే, చూడండి.
జపాన్‌లో సుమారు 1,200 రకాల పుచ్చకాయలు పండుతాయి. వాటిలో ‘డెన్సుకే బ్లాక్ వాటర్ మిలన్’ (డెన్సుకే నల్ల పుచ్చకాయ)కు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఏడాది మొత్తంలో కేవలం 100 డెన్సుకే పుచ్చకాయలు మాత్రమే పండుతాయి. పైగా ఇవి సాధాసీదా మార్కెట్లలో లభించవు. వీటిని ప్రత్యేకంగా వేలం పాట ద్వారా విక్రయిస్తారు. దీన్ని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలనే పట్టుదలతో ఉండేవారు ఈ వేలం పాటలో పాల్గొంటారు. అలాగే తమకు ఇష్టమైన వ్యక్తులకు కానుకగా ఇచ్చేందుకు కూడా పుచ్చకాయను కొనుగోలు చేస్తారు. గొప్పింటివారు ఈ పుచ్చకాయలను తమ ఇళ్లలో అతిథులకు రుచి చూపించడం స్టేటస్‌గా భావిస్తారు. అందుకే, పోటీపడి మరీ ఈ పుచ్చకాయలను సొంతం చేసుకొనే ప్రయత్నం చేస్తారు.
2019లో ఈ పుచ్చకాయ విలువ రూ.750,000 జపనీస్ యెన్‌లు పలికింది. భారత కరెన్సీ ప్రకారం.. రూ.4,45,972. ఈ డబ్బుతో మనం లారీ లోడ్ పుచ్చకాయలను కొనేయొచ్చు కదూ. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో దీని ధరలు బాగా పడిపోయాయి. అయితే, ఈ ఏడాది మళ్లీ ధరలు పుంజుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ప్రపంచంలో అత్యధిక ధర కలిగిన పుచ్చకాయ రికార్డు ఈ డెన్సుకే పుచ్చకాయల పైనే ఉంది.
Also Read: దాహానికి, డయాబెటిస్‌కు లింకేమిటీ? నోటిలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
ప్రత్యేకత ఏమిటీ: ఈ పుచ్చకాయ ఇంత రేటు ఉందంటే తప్పకుండా అందులో ఔషద గుణాలు ఉండి ఉండాలని మీరు అనుకుంటున్నారా? అయితే, పప్పులో కాలేసినట్లే. డేన్సుకే పుచ్చకాయలో కూడా సాధారణ పుచ్చకాయలు ఇచ్చే ప్రయోజనాలే ఉంటాయి. అయితే, ఈ పుచ్చకాయలో విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా సాధారణ పుచ్చకాయలతో పోల్చితే చాలా తియ్యగా, రుచికరంగా ఉంటాయి. దీని గుజ్జు కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఇది ఇంత ధర పలకడానికి కారణం.. దాన్ని పెంచే విధానం. ఈ పుచ్చకాయను సాధారణ పుచ్చకాయాల్లా కాకుండా ప్రత్యేకమైన వాతావరణంలో పండిస్తారు. అన్నీ సమపాళల్లో అందేలా చూస్తారు. ఆ తర్వాత వాటిని బాగా ఫాలిష్ చేసి ప్యాక్ చేస్తారు. ఫలితంగా ఈ పుచ్చకాయలు భలే నిగనిగలాడుతూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ పుచ్చకాయ విత్తనాలు యూరప్, ఉత్తర అమెరికాలో అందుబాటులో ఉన్నాయట. ఈ రకం పుచ్చకాయకు ఆయా దేశాల్లో రూ.20 వేలు వరకు దర పలుకుతుందట. అయినా సరే, ఒక పుచ్చకాయ అంత ధర చెల్లించడం విడ్డూరమే కదూ.
Also Read: వేసవిలో ఏసీ వాడాలంటే వణికిపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!