ప్రతి నెలా నెలసరి రావడం మహిళల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో కొంతమంది విపరీతమైన నొప్పి, తిమ్మిరితో ఇబ్బంది పడతారు. దీన్ని డిస్మెనోరియా అంటారు. దీనివల్ల పొత్తికడుపులో తీవ్రంగా నొప్పి, తిమ్మిరి లాంటివి వస్తాయి. చాలా మంది స్త్రీలలో నెలసరికి ముందు తర్వాత కూడా ఈ నొప్పి ఉంటుంది. అందరికీ ఇలా నొప్పి రావాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి ఎలాంటి నొప్పి లేకుండా సాఫీగా సాగుతుంది. అయితే కొన్ని పోషకాహార లోపాల వల్ల ఈ పీరియడ్స్ నొప్పులు భరించలేనంతగా మారుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇతను ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, సర్వైకల్ స్టనోసిస్ వంటి వాటి వల్ల ఈ నొప్పులు అధికమవుతాయి. ఇవి రాకుండా ఉండాలంటే కొన్ని పోషకాహార లోపాల వల్ల ఈ పీరియడ్స్ క్రాంప్స్ భరించలేనంతగా మారుతాయి. ఎలాంటి పోషకాలు లోపించడం వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి పెరుగుతుందో తెలుసుకోండి. 


మెగ్నీషియం 
మెగ్నీషియం లోపం మహిళల్లో తీవ్రమైన పీరియడ్స్ నొప్పికి కారణం అవుతుంది. మెగ్నీషియం డిస్మెనోరియా రాకుండా నిరోధిస్తుంది. గర్భాశయం చుట్టూ ఉండే మృదువైన కండరాలను సడలించడం ద్వారా పీరియడ్స్ నొప్పిని కలిగించే కారణాలను తగ్గిస్తుంది. మెగ్నిషియం అధికంగా అందాలంటే ఆకుకూరలు, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు తినాలి. 


విటమిన్ డి
ప్రోస్టగ్లాండిన్స్ అని పిలిచే హార్మోన్లు పీరియడ్స్ నొప్పిని ప్రేరేపిస్తాయి. విటమిన్ డి ఈ ప్రోస్టగ్లాండిన్స్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. తద్వారా పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. రోజూ 20 నిమిషాల పాటూ ఉదయం ఎండలో నిల్చుంటే విటమిన్ డి అందుతుంది. పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి లభిస్తుంది.


ఒమేగా త్రీ 
ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు నట్స్‌లో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా అవిసె గింజలు, చియా సీడ్స్, నెయ్యి, వాల్ నట్స్ వంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. చేపల్లో కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి స్త్రీలు పీరియడ్స్ నొప్పి నుంచి తప్పించుకోవాలంటే ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.  వీటి కోసం అవిసె గింజలతో చేసిన ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. అలాగే కొవ్వు పట్టిన చేపలు తింటే మంచిది. 


విటమిన్ ఇ 
విటమిన్ E అనేది పీరియడ్స్ సమయంలో తిమ్మిరి, ఆందోళన, విపరీత కోరికలను తగ్గించేందుకు సహాయపడుతుంది. హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా అధిక రక్తం బయటికి పోకుండా కాపాడుతుంది. 


పైన ఉన్న చెప్పిన పోషకాల లోపం రాకుండా చూసుకుంటే నెలసరి సమయంలో వచ్చే రుతునొప్పిని తప్పించుకోవచ్చు. 


Also read: RO నీటిని ఇంట్లో వినియోగిస్తున్నారా? అయితే మీరు ఈ ముఖ్యమైన విటమిన్ లోపం బారిన పడవచ్చు





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.