అధిక కాలుష్యం వల్ల ఊపిరందక ఇబ్బంది పడడం సహజం. శ్వాస కోశ సమస్యలు, కంటి సమస్యలు, గుండెపై ప్రభావం చూపిస్తుందని చాలా మందికి తెలుసు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఏ పురుషులైతే కాలుష్యాన్ని ఎక్కువగా గురవుతారో, వారికి లైంగిక సమస్యలతో పాటూ పునరుత్పత్తి వ్యవస్థలో కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా నగరాల్లో గాలి నాణ్యత తగ్గిపోతుంది. దట్టమైన పొగమంచు, వాహనాల నుంచి వచ్చే ప్రమాదకర వాయువులు పురుషులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. వారిలో  లైంగిక కోరికలు కలగకుండా చేస్తున్నాయి. వీర్యనాణ్యతను తగ్గిస్తున్నాయి. 


ప్రతి ముగ్గురిలో ఒకరు
కాలుష్యం వల్ల వంధ్యత్వం (పిల్లలు కలగని సమస్య) బారిన పడుతున్న పురుషుల సంఖ్య ప్రతి ముగ్గురిలో ఒకరు ఉన్నారు. ఈ సమస్య ఆడవాళ్లతో పోలిస్తే మగవారిలోనే ఎక్కువ ఉంది. కానీ పిల్లలు పుట్టకపోతే ఆ నింద ఆడవారిపైనే వేస్తారు. నగరంలో ఉన్న జనాభాలో స్త్రీల కన్నా పురుషులు 15 శాతం అధికంగా సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. 


కాలుష్యం వల్ల ఎలా?
కాలుష్యం ఎలా మగవారిలో వంధ్యత్వానికి కారణం అవుతోంది. విషపూరితమైన గాలిని పీల్చడం వల్ల వీర్య కణాలు క్షీణిస్తాయి.వీర్యకణాల సంఖ్య కూడా  తగ్గిపోతాయి. 
వీర్యకణాలు తక్కువగా ఉండడం, వాటిలో చలనం తక్కువగా ఉండడం వల్ల ఆ కణాలు ఫెలోపియన్ ట్యూబ్ (స్త్రీలలో ఉండే అవయవం) లోకి చేరుకోలేవు. దీనివల్ల ఎన్ని సార్లు ప్రయత్నించినా గర్భం ధరించలేరు. అంతేకాదు లైంగిక ఆసక్తి కూడా తగ్గిపోతుంది. దీని వల్ల తరచూ సెక్స్ లో పాల్గొనరు. కాలుష్యం వల్ల సెక్స్ హార్మోన్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. 


మనం పీల్చే గాలిలో రాగి, జింక్, సీసం కలిసిన నలుసులాంటి పదార్థాలు ఉంటాయి. ఇవి పీల్చడం వల్ల టెస్టోస్టెరాన్, స్పెర్మ్ కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే కాలుష్యంలో అధిక కాలం పనిచేసే మగవారిలో పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. మగవారిలో ఉన్న ఈ సమస్యలు బయటికి కనిపించవు. కానీ నింద మాత్రం ఇంట్లోని ఆడవాళ్లపై పడుతుంది. 


కాలుష్యం వల్ల ఆడవాళ్లలో కూడా చాలా మార్పులు కలుగుతాయి. వారు త్వరగా బరువు పెరిగే అవకాశం ఉందని గతంలో చాలా అధ్యయనాలు చెప్పాయి. కాలుష్యం వల్ల పిల్లల్లో కూడా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


Also read: కొబ్బరి నీళ్లు ఇలా తాగారంటే త్వరగా బరువు తగ్గుతారు






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.