మానవ శరీరంలో ‘కొవ్వు’ పాత్ర చాలా కీలకమైనది. అది మంచిగాను, చెడుగా కూడా పని చేస్తుంది. మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. LDL రకం కొవ్వును చెడు కొలెస్ట్రాల్ గా భావిస్తారు. ఎందుకంటే ఇది ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి గుండెకి హాని కలిగిస్తుంది. గుండెకి రక్త ప్రసరణ సక్రమంగా జరగకుండా అడ్డుపడుతుంది. HDL అనేది మంచి కొలెస్ట్రాల్. శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్ ను బయటకి పంపించేందుకు ఇది సహాయపడుతుంది. మనం రోజువారీ తినే ఆహార పదార్థాల వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ పదార్థాలేమిటో చూసేయండి. 


ప్రొసెస్ చేసిన మాంసం


ప్రాసెస్ చేసిన మాంసంలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి ఇది మరింత చేటు చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.


మాంసం (రెడ్ మీట్)


గొడ్డు మాంసం, పంది మాంసం, గొర్రె మాంసాన్ని రెడ్ మీట్ లేదా ఎరుపు మాంసం అంటారు. వీటిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అసలు మాంసం తినడం మానెయ్యకూడదు. నిల్వ చేసిన మాంసం కంటే, తాజా మాంసాన్ని తినడమే ఆరోగ్యకరమని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు చెప్తున్నారు. దీనికి బదులుగా స్కిన్ లెస్ చికెన్, టర్కీ బ్రెస్ట్, బీన్స్ వంటి సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ప్రోటీన్లు గల పదార్థాలు ఎంచుకోవడం ఉత్తమం.


బేకరీ ఫుడ్


కుకీస్, బ్రెడ్ వంటివి తినేందుకు చాలా రుచిగా ఉంటాయి. కానీ అవి ఆరోగ్యానికి మాత్రం చాలా చెడు చేస్తాయి. ఇవి రుచిగా ఉండేందుకు అధిక మొత్తంలో బటర్, చక్కెర కలపడం వల్ల అవి శరీరానికి హాని చేస్తాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళు వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.


ఫ్రైడ్ ఫుడ్ 


కంటికి ఇంపుగా కనిపిస్తూ ఎంతో ఆకర్షించే విధంగా ఉండే ఫ్రైడ్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అతిగా డీప్ ఫ్రై చెయ్యడం వల్ల అందులో ఉన్న కేలరీల సంఖ్య తగ్గుతుంది. దానితో పాటు వాటిని ఫ్రై చేసేందుకు ఆరోగ్యకరమైన వంట నూనెని ఉపయోగించరు.


ఫాస్ట్ ఫుడ్


రుచిగా ఉంటున్నాయి కదా అని జంక్ ఫుడ్ తెగ లాగించేస్తారు. వీటితో గుండె జబ్బులు, ఊబకాయంతో సహ అనేక దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఫాస్ట్ ఫుడ్స్ రెగ్యులర్ గా తినేవారిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది.


డెసర్ట్


ఐస్ క్రీం, కేకులు, పేస్ట్రీలలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా కేలరీలు ఉంటాయి. అవి తరచుగా బరువు పెరగడానికి దారితీస్తాయి. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు మరియు కొన్ని రకాల క్యాన్సర్‌లకు కూడా కారణం అవుతాయి.


గమనిక: పలు అధ్యయనాలుపరిశోధనలుహెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి


Also read: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి