మధ్య కాలంలో కాయగూరలను కట్ చేయాల్సిన అవసరమే ఉండట్లేదు. సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్‌లో కట్ చేసిన వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వెజిటేబుల్స్ కట్ చేయడానికి టైమ్ లేనివారు, బద్దకస్తులు వీటిని ఆర్డర్ చేసుకుని వంటలు చేసుకుంటున్నారు. కొందరు వాటిని శుభ్రం చేయకుండానే పచ్చిగా తినేస్తున్నారు. అయితే, ఇది చాలా ప్రమాదకరం. తాజాగా అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనే ఇందుకు నిదర్శనం. 


అమెరికా వ్యాప్తంగా సుమారు 73 మంది సాల్మెనెల్లా వ్యాప్తితో అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణాన్ని తెలుసుకున్న వైద్య అధికారులు షాకయ్యారు. కట్ చేసిన ఉల్లిపాయల వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్లు తెలుసుకుని.. సూపర్ మార్కెట్లో ఉన్న ప్రీ-కట్ ఆనియన్స్ విక్రయాలను ఆపాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకటించింది. 


కాలిఫోర్నియాలోని గిల్స్ ఆనియన్స్ విక్రయించిన ఉల్లిపాయాల్లో సాల్మెనెల్లాను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ సంస్థ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని సంస్థను ఆదేశించినట్లు వెల్లడించారు. ఆ ఉల్లిపాయల ముక్కలను అరిజోనా, కాలిఫోర్నియా, ఇడాహో, మోంటానా, ఒరెగాన్, వాషింగ్టన్‌లలోని ఎంపిక చేసిన స్టోర్‌లలో విక్రయించినట్లు తెలుసుకున్నారు. ఆగస్టు నెలాఖరిలో వాటిని కొనుగోలు చేసిన వినియోగదారుల వద్ద ఇంకా అవి నిల్వ ఉన్నట్లయితే వెంటనే నాశనం చేయాలని, తినొద్దని ప్రకటించారు.


సాల్మోనెల్లా థాంప్సన్ వ్యాప్తికి ఉల్లిపాయలకు లింకేమిటీ?


సాల్మోనెల్లా అనేది ఆహారం ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్. ముఖ్యంగా నిల్వ ఉంచే ఆహారంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వాటి పొరపాటున ఎవరైనా తిన్నారంటే ఇన్ఫెక్షన్లతో అస్వస్థతకు గురవ్వుతారు. CDC అంచనా ప్రకారం.. ఏటా 1.35 మిలియన్ ఇన్ఫెక్షన్లకు సాల్మొనెల్లా కారణమవుతోంది. ఈ ఇన్ఫెక్షన్‌ను ‘సాల్మోనెలోసిస్’ అని కూడా పిలుస్తారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారికి ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. ఆహారం తిన్న ఆరు గంటల్లో సాల్మొనెల్లా లక్షణాలు బయటపడతాయి. 


సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ లక్షణాలు


⦿ విరేచనాలు లేదా రక్త విరేచనాలు
⦿ జ్వరం
⦿ కడుపు తిప్పడం లేదా గందరగోళంగా ఉండటం
⦿ వికారం, వాంతులు


ఈ లక్షణాలు నాలుగు నుంచి ఏడు రోజుల వరకు ఉంటాయట. అయితే, కొందరిలో మాత్రం చాలా వారాలపాటు ఈ ఇన్ఫెక్షన్ తిష్ట వేస్తుందట. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనికి చికిత్స అందుబాటులో ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ సొకినప్పుడు నీరు ఎక్కువ తాగాలి. తగినంత విశ్రాంతి అవసరం. అయితే కొందరిలో మాత్రం ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందట. ముఖ్యంగా పిల్లలకు ఇది సోకితే చాలా ఇబ్బందిపడగతారు.


సాల్మొనెల్లా ముప్పు వీరికే ఎక్కువ


⦿ 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు
⦿ తల్లిపాలు తాగని ఏడాది వయస్సు లోపు శిశువులు
⦿ ఐదేళ్లు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు
⦿ రోగ నిరోధక శక్తి తక్కువ కలిగిన వ్యక్తులు
⦿ బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు
⦿ వివిధ వ్యాధులకు మందులు వాడుతున్న రోగులు


ఏం చేస్తే సేఫ్?


మనలో చాలామందికి పచ్చి ఉల్లిపాయలు తినడం అవసరం. అయితే, అవి చాలా శుభ్రంగా ఉండాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఉల్లిపాయలను పచ్చిగా తినకపోవడమే ఉత్తమం. అలాగే పదే పదే ఉల్లిపాయలను కట్ చేయడానికి బద్దకించి.. చాలా మంది టైమ్ దొరికినప్పుడు వాటిని కట్ చేసి ఫ్రిజ్‌లో దాచిపెడతారు. అప్పుడప్పుడు వాటిని వాడతారు. దానివల్ల ఉల్లిపాయలో ఉండే రుచి పోతుంది. అంతేకాదు.. వివిధ బ్యాక్టీరియాలు కూడా త్వరగా ఉల్లిపాయ ముక్కలపైకి చేర్చుతుంది. ఉల్లిపాయను కట్ చేయనంత వరకే పవర్ ఫుల్. కట్ చేసిన తర్వాత అందులో ఏ మాత్రం పవర్ ఉండదు. అందుకే, సూక్ష్మజీవులు త్వరగా తిష్ట వేస్తాయి. కాబట్టి, ఉల్లిపాయలను ముందుగా కోసుకుని నిల్వ ఉంచుకోవద్దు. అలాగే, సూపర్ మార్కెట్లలో దొరికే కట్ చేసిన వెజిటేబుల్స్‌ను అస్సలు కొనొద్దు.. తినొద్దు. అలాగే ఫుడ్ పాయిజన్ బారిన పడకూడదంటే.. తాజా కూరగాయాలను వెంటనే రిఫ్రిజరేట్ చేయాలి. అలాగే, ఏదైనా ఆహారాన్ని వండిన రెండు గంటల్లో ఫ్రిజ్‌లో పెట్టాలి. 


Also Read : ఉదయాన్నే కాఫీకి బదులు ఇది తాగితే చాలా మంచిదట!