Viral Video: 



అదుపు తప్పిన స్కార్పియో..


యూపీలోని మీరట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన స్కార్పియో కార్‌ అదుపు తప్పి పల్టీలు కొట్టింది. రోడ్డు పక్కనే బెలూన్‌లు అమ్ముకుంటున్న వ్యక్తిపైకి వేగంగా దూసుకెళ్లింది. అక్టోబర్ 23న అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బెలూన్‌లు విక్రయించే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. స్కార్పియో రోడ్డుపైనే రెండు సార్లు పల్టీ కొట్టింది. అంటే ఎంత వేగంగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతమంతా తనిఖీలు నిర్వహించారు. ఆ తరవాత కార్‌లో లిక్కర్ బాటిల్స్‌ని గుర్తించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని భానుగా నిర్ధరించారు. ఈ ప్రమాదంతో సంబంధం ఉన్న ఐదుగురిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో స్కార్పియో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదం స్థానికంగా అలజడి రేపింది. ఇందుకు బాధ్యులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. 


"ఈ ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఐదుగురిపై కేసు నమోదు చేశాం. స్కార్పియో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికి అతడికి చికిత్స అందిస్తున్నాం. వీలైనంత త్వరగా నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కచ్చితంగా వాళ్లను త్వరలోనే అరెస్ట్ చేస్తాం"


- పీయూష్ సింగ్, మీరట్ ఎస్‌పీ