Cumin vs Fennel Which One Is Healthier : వంటింట్లో తరచుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో జీలకర్ర ఒకటి. చూడడానికి దానిలాగే ఉండే మరో మసాలా దినుసు సోంపు. చూసేందుకు ఒకేలా కనిపించినా.. వాటి రుచి, వాసన, పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కొందరు తెలియక వీటిని తింటే ఒకే రకమైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయి అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం వీటి ఉపయోగాలు వేర్వేరుగా ఉంటాయి.

Continues below advertisement

జీలకర్ర

జీలకర్ర చిన్నగా, సన్నగా, గోధుమ రంగులో ఉంటుంది. దీనికి కాస్త ఘాటైన వాసన, రుచి ఉంటాయి. దీనిని తాలింపు కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. జీలకర్రలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి.

సోంపు

సోంపు చూసేందుకు ఆకుపచ్చ లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది. దీనికి తీపి రుచి, సువాసన ఉంటాయి. చాలామంది భోజనం తర్వాత దీనిని తీసుకుంటారు. ఇది నోటికి సువాసన ఇవ్వడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ C, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి.

Continues below advertisement

జీలకర్ర వల్ల కలిగే లాభాలు

జీలకర్ర జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహించి ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు జీలకర్ర తీసుకుంటే పరిస్థితి మెరుగవుతుంది. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం జీలకర్రను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీవక్రియ పెరిగి.. బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుందని చెప్తారు.

జీలకర్ర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి.. మధుమేహులకు కొంతమేర సహాయం చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. 

సోంపు ప్రయోజనాలు

భోజనం తర్వాత సోంపు తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. సోంపులో ఉండే సహజ సుగంధ పదార్థాలు నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. వేసవికాలంలో సోంపు నీరు లేదా సోంపుతో చేసిన పానీయాలు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం సోంపులోని కొన్ని సమ్మేళనాలు నెలసరి సమయంలో వచ్చే అసౌకర్యాలను తగ్గించడంలో సహాయపడతాయి. సోంపులో యాంటీఆక్సిడెంట్లు కణాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. 

ఏది మంచిదంటే..

జీలకర్ర మంచిదా? సోంపు మంచిదా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే దేనికదే ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపరచడం, ఐరన్ శరీరానికి అందించడం వంటి ప్రయోజనాల కోసం జీలకర్ర హెల్ప్ చేస్తే.. కడుపు ఉబ్బరం తగ్గించడం, నోటి దుర్వాసనను తగ్గించడం, శరీరానికి చల్లదనం అందించడానికి సోంపు ఉపయోగపడుతుంది. ఈ రెండింటినీ సమతుల్యంగా ఆహారంలో చేర్చుకుని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.