Cradle Cap in Newborns : అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే కొన్ని సమస్యల్లో తలపై పొలుసులు కనిపించడం కూడా ఒకటి. నవజాత శిశువులు చూసేందుకు చాలా సున్నితంగా ఉంటారు. ఆ సమయంలో వారికి ఏమి ఇబ్బంది కలిగినా పేరెంట్స్ తెగ టెన్షన్ పడిపోతుంటారు. అలాంటి వాటిలో మాడుపై పొలుసు కనిపించడం కూడా ఒకటని చెప్తున్నారు నిపుణులు. పేరెంట్స్ పిల్లల్లో ఈ సమస్యను గుర్తించినప్పుడు తెగ టెన్షన్ పడిపోతారట. ఇంతకీ ఇది సాధారణ సమస్య? వైద్యులు ఇస్తోన్న సలహాలు, సూచనలు ఏంటో చూసేద్దాం.
పిల్లల తలపై పొలుసులు కనిపించడాన్ని వైద్య పరిభాషలో 'క్రెడిల్ క్యాప్' (Cradle Cap) అంటారు. ఇది చూడటానికి తలపై అసహ్యంగా కనిపిస్తుంది. కానీ ప్రమాదకరమైనది కాదని చెప్తున్నారు. కానీ సమయానికి దానిపై దృష్టి పెట్టాలని.. లేకుంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. సాధారణంగా ఈ సమస్య చాలామంది పిల్లల్లో కనిపిస్తుందని.. కాబట్టి దాని గురించి అంత చింతించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకుంటే కొన్ని ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చట. కానీ సమస్య ఎక్కువ ఉంటే వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలట.
పిల్లల తల మీద పొలుసులు ఏర్పడడానికి కారణాలివే
డా ఇమ్రాన్ పటేల్ ప్రకారం.. నవజాత శిశువుల తల మీద పొలుసులు ఏర్పడటానికి ప్రధాన కారణం తల్లి హార్మోన్ల ప్రభావం. పుట్టిన తర్వాత కూడా శిశువు.. తల్లి నుంచి కొన్ని హార్మోన్లు పాల రూపంలో తీసుకుంటాడట. దీనివల్ల చర్మం పొడిగా మారడం ప్రారంభించి... అదనంగా ఉన్న నూనె కారణంగా డెడ్ స్కిన్ సెల్స్ దగ్గరై పొలుసులగా మారతాయట. కొన్నిసార్లు 'ఫంగల్ ఇన్ఫెక్షన్' (Fungal Infection) కూడా దీనికి కారణం అవుతుంది. ఆ సమయంలో పొలుసులతో పాటు చర్మం ఎరుపుగా మారి, వాపుగా కనిపిస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
నవజాత శిశువుల్లో ఈ సమస్య గుర్తిస్తే ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి. మృదువైన నూనెను అంటే బాదం లేదా కొబ్బరి నూనెతో శిశువు తలపై సున్నితంగా మసాజ్ చేసి 15 నిమిషాలు వదిలేయండి. ఇది పొలుసులను మృదువుగా చేస్తుంది. తర్వాత బేబీ షాంపుతో (Baby Shampoo) కడిగిన తర్వాత మెత్తటి బ్రష్ లేదా దువ్వెనతో నెమ్మదిగా దువ్వండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల తలలో నూనె నిల్వ ఉండదు. పొలుసులు క్రమంగా తగ్గుతాయి.
వైద్యుడిని ఎప్పుడు కలవాలంటే..
చాలా కేసులలో 'క్రెడిల్ క్యాప్' (Cradle Cap) తానంతట అదే నయమవుతుంది. ఇంటి చిట్కాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ పొలుసులతో పాటు దురద, వాపు, ఎరుపు పెరిగితే లేదా వ్యాప్తి చెందితే వెంటనే శిశువైద్యుడిని సంప్రదించండి. ఇది ఒక తాత్కాలిక సమస్య. సరైన సంరక్షణ తీసుకుంటే.. త్వరలోనే మాడు మెరుస్తూ, ఆరోగ్యంగా మారతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.