గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వారిలో కాబోయే తల్లులు, చంటి బిడ్డల అమ్మలు కూడా ఉన్నారు.  వారిలో చాలా మంది కరోనా నెగిటివ్ వచ్చాక కూడా పిల్లలకు పాలిచ్చేందుకు భయపడుతున్నారు. అలాంటివారికి ఓ అధ్యయనం శుభవార్తను చెబుతోంది. కరోనా వచ్చి తగ్గిన తల్లుల రొమ్ముపాలల్లో దాదాపు పదినెలల పాటూ కరోనా వైరస్ ను న్యూట్రలైజ్ చేసే యాంటీ బాడీలు కలిగి ఉంటాయని కొత్త పరిశోధన తేల్చింది. కాబట్టి తల్లి పాల ద్వారా పిల్లలకు కూడా ఆ యాంటీబాడీలు చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఆ చంటి బిడ్డలు కరోనాను తట్టుకునే శక్తిని మరింత పుంజుకుంటారు. కాబట్టి కరోనా నుంచి తేరుకున్న తల్లులు ఎలాంటి సందేహం లేకుండా పిల్లలకు పాలివ్వడం మంచిదే. 


న్యూయార్క్ కు చెందిన మౌంట్ సినాయ్ ఆసుపత్రికి చెందిన రెబెక్కా పావెల్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఆమె బృందం కోవిడ్ 19 నుంచి కోలుకున్న 75 మంది తల్లుల నుంచి తల్లి పాల నమూనాలను సేకరించింద. వారి విశ్లేషణలో 88 శాతం పాలలో కరోనా వైరస్ ను నిరోధించగల యాంటీబాడీలు ఉన్నాయని కనుగొన్నారు. ఆ పాలల్లో ‘ఇమ్యునోగ్లోబిన్ ఎ’ అనబడే యాంటీబాడీని గుర్తించారు. ఇది పాలు తాగిన పిల్లల శ్వాసకోశ, పేగు గొట్టాల గోడలకు అంటుకుని ఉండి, వైరస్ ను శరీరంలో చేరకుండా అడ్డుకుంటుందని వారి పరిశోధనలో తేలింది. అంతేకాదు ఆ ప్రతిరోధకాలు తల్లి పాలల్లో దాదాపు పదినెలల పాటూ ఉంటాయని గుర్తించారు. 


కరోనా వచ్చి తగ్గాక ఆ తల్లుల్లో సాధారణంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఆ తల్లులు టీకా కూడా వేయించుకుంటే యాంటీ బాడీలు ప్రేరేపణకు గురవుతాయి. మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.  కరోనా నుంచి కోలుకుని, టీకా కూడా వేయించుకున్న పసిబిడ్డల తల్లులు యాంటీబాడీలను భవిష్యత్ తరాలకు అందించే మహత్తరమైన పనిని కొనసాగించగలరని అభిప్రాయపడుతున్నారు అధ్యయన సారథి రెబెక్కా. 


ముఖ్య గమనిక: అధ్యయనం వివరాలను యథావిధిగా అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు. మీ ఆరోగ్యం, డైట్ కు సంబంధించిన ఏ సందేహాలున్నా వైద్యుడిని సంప్రదించగలరు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also read: కుంభకర్ణుడి విలేజ్.. రోజుల పాటూ నిద్రపోయే గ్రామస్థులు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు


Also read: ఈ ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారచ్చు... జాగ్రత్త పడండి


Also read: ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా... వెల్లుల్లితో తరిమికొట్టండి