ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు గుండె జబ్బుల వల్లే చోటుచేసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మరణాలు గుండె జబ్బుల వల్ల జరుగుతున్నాయి. ఈ సమస్య చుట్టూ చాలా రకాల అపోహలు ఉన్నాయి. వీటికి సంబంధించిన అవగాహన కలిగి ఉండటం అవసరం.


అపోహ: గుండె సమస్యలు వయసు పైబడిన లేదా మద్యవయస్కు వారికి మాత్రమే వస్తాయి


వాస్తవం: యువకుల్లో గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు రావని అనుకుంటారు. ప్రాసెస్ చేసిన ఫూడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం, ఒత్తిడి వంటి కారణాలు.. వయసుతో సంబంధం లేకుండా గుండె ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యం గురించిన శ్రద్ధ అవసరం. ప్రస్తుతం గుండె సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన శైలి అందరికీ అవసరమే.


అపోహ: కుటుంబం గుండె జబ్బుల చరిత్ర ఉంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా నయం కాదు.


వాస్తవం: కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నపుడు హార్ట్ ఎటాక్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తప్పకుండా పెరుగుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు లేదా వాయిదా వెయ్యవచ్చు. పోషకాహారం తీసుకోవడం, తప్పకుండా వ్యాయామం చెయ్యడం, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచుకోవడం, కనీసం ఏడాదికి ఒక్కసారి గుండె సంబంధిత అన్ని పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం పెట్టడం సాధ్యమే.


అపోహ: కేవలం ఛాతిలో వచ్చే నొప్పి మాత్రమే గుండెపోటు


వాస్తవం: చాలా సార్లు ఛాతిలో వచ్చే నొప్పి గుండె పోటుకు సంబంధించింది కావచ్చు. అయితే, కేవలం ఛాతిలో వచ్చే నొప్పి మాత్రమే గుండె పోటుకు సంకేతం అనుకుంటే పొరపాటే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెల్లో మంట, పొత్తి కడుపులో నొప్పి, వికారంగా అనిపించడం, వాంతులు, వెన్ను నొప్పి, దవడ నొప్పి, కళ్లు తిరుగుతున్నట్టుగా ఉండడం, అలసట లాంటి ఇతర లక్షణాలను కూడా అశ్రద్ధ చెయ్యకూడదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం.


Also read: తలకాయ కూర మాంసం ఇలా వండితే లొట్టలేసుకుని తింటారు




చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద ముప్పు నుంచి మనలను కాపాడుతాయి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న పోస్ట్ పాండమిక్ సమయంలో గుండెకు సంబంధించిన పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. పోషకాహార లోపం ఏర్పడకుండా చూసుకోవడం, ముఖ్యంగా విటమిన్ D లోపం ఏర్పడకుండా చూసుకోవడం అవసరం. ప్రతి ఒక్కరూ కనీసం వాకింగ్ లాంటి చిన్న వ్యాయామాన్నైనా క్రమం తప్పకుండా చెయ్యడం అవసరం. తీసుకునే ఆహారంలో ప్రొటీన్ తగినంత ఉండేలా జాగ్రత్త పడడం, నూనేలో వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోకపోవడం, తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించి గుండె ఆరోగ్యాన్ని అందరూ సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.