Common Krait Symptoms | భారత్‌లో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాములలో కట్లపాము(Common Krait) ఒకటి. శాస్త్రీయంగా దీనిని Bungarus caeruleus అని పిలుస్తారు. కట్లపామును 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు. ఎందుకంటే దీని కాటు ఏమాత్రం పెద్దగా నొప్పి అనిపించదు. కేవలం దోమ లేదా చీమ కుట్టినట్లు అనిపిస్తుంది. దాంతో పాటు కాటుకు గురైనప్పటికీ బాధితుడు దానిని సాధారణ గాయంగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. కాటువేస్తే పాము విషం నేరుగా మానవ నాడుల వ్యవస్థపై దాడి చేస్తుంది. రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఈ పాము కరిస్తే, చాలామందికి కాటు వేసిన విషయమే తెలియక నిద్రలోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చాలానే ఉన్నాయి.

Continues below advertisement

 పాముకాటు వేసిన తర్వాత కనిపించే లక్షణాలు

పాము కరిచిన తరువాత ఆ ప్రదేశంలో సాధారణ నొప్పి లేదా కొంచెం వాపు ఉంటుంది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే విషం శరీరం అంతటా వ్యాపించి కనురెప్పలు మూతపడుతుంటాయి. చూపు మసకబారడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం మొదలవుతుంది. మాట్లాడటం, ఏదైనా మింగడంలో తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. నోటిలో లాలాజలం ఎక్కువ కావడం,  కాళ్లు చేతుల్లో బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. సకాలంలో ట్రీట్మెంట్ అందించకపోతే శ్వాసకోశ కండరాలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయి వ్యక్తి ప్రాణాలు పోతాయి.

Continues below advertisement

పాము కరిచినప్పుడు ఏం చేయాలి?బాధితుడిని ముందుగా మానసికంగా ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం. వీలైనంత తక్కువగా పాముకాటు బాధితులను కదిలేలా చూడాలి. కాటుకు గురైన చెయ్యి లేదా కాలును అస్సలు కదల్చకుండా స్థిరంగా ఉంచి, సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఒకవేళ వీలైతే, ఆ సమయంలో సురక్షితమనిపిస్తే మాత్రమే ఆ పాము ఫోటో తీయడానికి ప్రయత్నించాలి. అయితే పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవద్దు. 

Also Read : మహిళల్లో ఈ వయసు తర్వాత ప్రెగ్నెన్సీ కష్టమా? ఫెర్టిలిటీ నిపుణులు ఏమంటున్నారంటే..

పాటు కాటు వేస్తే ఏం చేయకూడదు?గాయం ఉన్న చోట కోయడం లేదా నోటితో విషాన్ని పీల్చడానికి ప్రయత్నించడం లాంటి పనులు అసలు చేయకూడదు. రక్తప్రసరణను పూర్తిగా నిలిపివేసేలా తాడు లేదా గుడ్డతో గట్టిగా కట్టకూడదు. అలాగే మంచు ముక్కలు పెట్టడం, పసర్లు రాయడం, మట్టి రాయడం లేదా భూతవైద్యం పై ఆధారపడటం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పాము ఏ రకమో చెబితే డాక్టర్లు వేగంగా అందుకు సంబంధించిన చికిత్స ప్రారంభిస్తారు.

పాముకాటుకు ట్రీట్మెంట్..కామన్ క్రైట్ (కట్లపాము) కాటుకు పరిష్కారం యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్ ఇవ్వడం మాత్రమే. దీనిని కేవలం ఆసుపత్రిలోని డాక్టర్ల పర్యవేక్షణలోనే ఇవ్వాలి. యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు బాధితుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఆక్సిజన్ అందించడం లేదా అవసరాన్ని బట్టి వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తారు. బాధితుని గుండె వేగం, శ్వాసక్రియ,  రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తూ డాక్టర్లు చికిత్స అందిస్తారు. 

Also Read : ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా ఫెయిల్ అవుతున్నారా? సంతాన్నాన్ని దూరం చేస్తోన్న అలవాట్లు ఇవే