Diseases Causing Cold Feet : మీ పాదాలు తరచుగా మంచులా చల్లగా మారుతున్నాయా? వాతావరణం చల్లగా ఉన్నా.. వేడిగా ఉన్నా.. మీ పాదాలు మాత్రం ఎప్పుడూ చల్లగానే ఉంటున్నాయా? అయితే మీరు దానిని నిర్లక్ష్యం చేయవద్దని చెప్తున్నారు నిపుణులు. చాలామంది దీనినో సాధారణ సమస్యగా భావిస్తారు. ఎందుకంటే.. ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ నెమ్మదిగా ఉండడం లేదా గాలి తగలడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఇలా రెగ్యులర్‌గా జరుగుతుంటే కామన్ కాదని.. శరీరంలో దాగి ఉన్న మరో కొన్ని వ్యాధులకు సంకేతం కూడా కావచ్చని చెప్తున్నారు.
ఆరోగ్య సమస్యలు వాటి లక్షణాలు
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. పాదాలు ఎక్కువ కాలం చల్లగా ఉంటే.. నరాల సమస్య, రక్త ప్రసరణలో ఆటంకం లేదా థైరాయిడ్ వంటి హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం కావచ్చని చెప్తున్నారు. అయితే మీ పాదాలు చల్లగా మారడానికి కారణాలు ఏంటి? వైద్యుడిని ఏ పరిస్థితుల్లో సంప్రదించాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె సమస్యలు
పాదాలకు తగినంత రక్తం సరఫరా కానప్పుడు.. అవి చల్లగా అనిపిస్తాయి. ఈ పరిస్థితి సాధారణంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు, అధిక కొలెస్ట్రాల్ లేదా ధమనులలో బ్లాకేజీల కారణంగా సంభవిస్తుంది.
లక్షణాలు
- పాదాలలో తిమ్మిరి
- పాదాలు మొద్దుబారడం
- నడుస్తున్నప్పుడు అలసట లేదా నొప్పి
మధుమేహం
పెరిఫెరల్ న్యూరోపతి అనే పరిస్థితి ప్రధానంగా మధుమేహానికి సంబంధించినది. ఈ సమస్య ఉన్నవారి పాదాల నరాలు దెబ్బతింటాయి. పాదాలలో చల్లదనం, మంట లేదా తిమ్మిరికి దారి తీస్తాయి. ఆ సమయంలో కనిపించే లక్షణాలు ఇవే..
- పాదాలలో సూదులు గుచ్చినట్లు అనిపించడం
- తేలికపాటి నొప్పి లేదా మంట
- నడవడంలో ఇబ్బంది
హైపోథైరాయిడిజం
థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే.. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ ప్రభావితమవుతుంది. దీనివల్ల చేతులు, పాదాలు చల్లగా మారతాయి. దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే..
- తరచుగా చలిగా అనిపించడం
- అలసట, బరువు పెరగడం
- జుట్టు రాలడం, పొడి చర్మం
రైనోడ్స్ సిండ్రోమ్
ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఈ సమస్య ఉంటే చలి ఉన్నప్పుడు లేదా ఒత్తిడి సమయంలో వేళ్లు, పాదాల రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల పాదాలు మంచులా చల్లగా మారుతాయి.
- పాదాల రంగు నీలం లేదా పసుపు రంగులోకి మారడం
- తిమ్మిరి
- చలిలో తీవ్రమైన ప్రభావం
చల్లని పాదాలు కేవలం ఒక సీజన్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది మీ శరీరంలో జరుగుతున్న వివిధ ఆరోగ్య సమస్యలకి సంకేతం. పాదాలు చల్లగా మారడంతో పాటు ఈ తరహా లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లడం మంచిది. ఈ సమస్య తరచూ కొనసాగితే.. దానిని నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిది. సకాలంలో సరైన పరీక్షలు, చికిత్స అందిస్తే.. పాదాలు చల్లగా మారడం తగ్గడమే కాకుండా.. పలు దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను పెరగకుండా కాపాడుకోగలుగుతారు.