Bottle Hygiene in Summer : వేసవి కాలం మొదలైపోయింది. చలి తగ్గిపోయి వేడిగాలులు వస్తోన్న సమయంలో ఎక్కువమంది నీళ్లు తాగడం మొదలుపెడతారు. చలికాలంలో నీటిని తక్కువగా తీసుకున్నా.. వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకుంటాము. అయితే ఈ సమయంలో నీటితో పాటు.. దానిని క్యారీ చేసే బాటిల్ శుభ్రత కూడా అంతే ముఖ్యం. రోజూ వాడే వాటర్ బాటిల్.. ముఖ్యంగా రీయూజబుల్ వాటర్ బాటిళ్లు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వాటిని సరైన రీతిలో శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి.. ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుంది.

Continues below advertisement

రోజూ ఉపయోగించుకునే బాటిల్‌ను నింపుకుంటూ.. వాడుతూ.. శుభ్రం చేయకపోతే.. ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ బాటిల్ శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే తేమ, వేడి, బాటిల్ మూసివేస్తాం కాబట్టి.. బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. బాటిల్ బయటకు చూసేందుకు క్లీన్​గానే కనిపించినా.. మన నోరు, చేతులు, చుట్టుపక్కల వాతావరణం నుంచి జర్మ్స్ లోపల చేరుతాయి.

వాటర్​ బాటిల్ శుభ్రంగా లేకుంటే.. బాక్టీరియా పెరిగి గొంతు ఇన్ఫెక్షన్లు, కడుపు సమస్యలు, నోటి దుర్వాసన, తేలికపాటి అనారోగ్యం తరచుగా వస్తాయి. మరి బ్యాక్టీరియా పేరుకుపోకుండా ఉండేందుకు వాటర్ బాటిల్ ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

వాటర్ బాటిల్ శుభ్రత

వాటర్​ బాటిల్​ను ప్రతిరోజూ కడగాలి. గోరువెచ్చని నీటిలో లిక్విడ్ డిష్ సోప్ కలిపి బాటిల్ లోపల భాగాన్ని బాగా బ్రష్‌తో రుద్దాలి. ముఖ్యంగా అడుగు భాగాన్ని శుభ్రం చేయాలి. బాటిల్ మూత, మౌత్‌పీస్ భాగంలో ఎక్కువ బ్యాక్టీరియా పేరుకుపోతుంది. రబ్బర్ రింగ్ ఉంటే వేరు చేసి శుభ్రం చేయాలి.

గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ లేదా 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి బాటిల్​లో వేసి.. 15–20 నిమిషాలు ఉంచాలి. తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. దీనిని పూర్తిగా ఆరనివ్వాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేసుకుంటే మంచిది. బాటిల్ లోపల తేమ మిగలకుండా పూర్తిగా ఎండబెట్టాలి. తడిగా ఉన్నప్పుడే మూత పెట్టకూడదు. లేదంటే బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది.

అదనపు జాగ్రత్తలు

పార్క్ చేసిన కారులో బాటిల్‌ను ఎక్కువరోజులు వదిలేయకూడదు. ఇన్సులేటెడ్ బాటిళ్లు అయితే వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ చేయాలి. ప్లాస్టిక్ బాటిళ్లను 6–8 నెలలకోసారి మార్చడం మంచిది. 

బాటిల్ ఎప్పుడు మార్చాలంటే.. 

వాటర్​ బాటిల్ ఎప్పుడు మార్చాలనేది చాలామందికి తెలియదు. కొందరు ఎక్కువకాలం వాటర్ బాటిల్ ఉపయోగిస్తారు. కానీ బాటిల్ కొన్ని లక్షణాలు ఇస్తున్నప్పుడు కచ్చితంగా మార్చాలని చెప్తున్నారు నిపుణులు. ఎంత శుభ్రం చేసినా.. దుర్వాసన పోనప్పుడు. లోపల గీతలు, రబ్బర్ రింగ్ కింద మోల్డ్ వస్తే.. మార్చేయాలంటున్నారు. 

శుభ్రమైన బాటిల్‌తో తాగిన నీరు మాత్రమే నిజమైన హైడ్రేషన్ ఇస్తుంది. వాతావరణ మార్పుల సమయంలో చిన్న హైజీన్ అలవాట్లు పాటిస్తే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.