Childrens Food Habits : పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. చిన్నతనంలో చేసే ఆహారపు అలవాట్లే పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వారికి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలనేదానిపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. లేదంటే గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

ఢిల్లీకి చెందిన పోషకాహార నిపుణురాలు నేహా బన్సల్ తల్లిదండ్రులకు పిల్లలకు పెట్టాల్సిన ఫుడ్స్​పై కొన్ని నియమాలు సూచించారు. పిల్లల శారీరక, జీవక్రియ పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఆహారాలను నివారించాలని లేదా తగ్గించాలని సలహా ఇస్తున్నారు. ఇంతకీ నేహా చెప్పిన ఫుడ్స్ ఏంటో.. వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో తెలుసుకుందాం. 

  • పెరుగు : సాధారణంగా పిల్లల నుంచి పెద్దల వరకు పెరుగు చాలా మంచిది. కానీ పిల్లల కోసం తయారు చేసే ఫ్లేవర్డ్ పెరుగులో తరచుగా ఎక్కువగా చక్కెర, కృత్రిమ రంగులు మొదలైన కెమికల్స్ ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. పిల్లలకు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ స్వీట్స్ ఇవ్వకూడదు. ఫ్రూట్ యోగర్ట్​ ఒక సర్వింగ్‌లో 20 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. కాబట్టి దానికి బదులుగా.. సాధారణ పెరుగును పిల్లలకు ఇవ్వవచ్చు. 
  • ప్రాసెస్ చేసిన మీట్: బర్గర్, కేఎఫ్​సీ, హాట్ డాగ్స్ వంటివి టేస్టీగానే ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కానీ వీటిలో సోడియం, నైట్రేట్స్ వంటి అనారోగ్యకరమైన సంతృప్త కొవ్వులు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల పిల్లలు యుక్తవయసులోనే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రోటీన్ కోసం వీటిని కాకుండా.. ఇంట్లో ఆరోగ్యకరమైన పద్ధతిలో చేసే చికెన్, గుడ్లు, పప్పులు లేదా చేపలను వారికి తగ్గ మోతాదులో తినిపించాలి. 
  • ప్రాసెస్డ్ స్నాక్స్: మైక్రోవేవ్ పాప్‌కార్న్ వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ స్నాక్స్ రుచికరంగా అనిపించినప్పటికీ.. చాలా బ్రాండ్‌లు వాటిలో సోడియం, కృత్రిమ రుచులు, అన్​హెల్తీ ఫ్యాట్స్​తో తయారు చేస్తారు. ఈ తరహా  ఫుడ్స్ గుండె ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతాయి. వీటివల్ల టీనేజ్​లోనే వాపు, బరువు పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటివి జరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎయిర్ పాప్డ్ పాప్‌కార్న్ లేదా తక్కువ ప్రాసెస్ చేసిన స్నాక్స్ ఆరోగ్యకరమైన ఎంపికలవుతాయి.
  • కూల్ డ్రింక్స్: మార్కెట్‌లో లభించే సెరల్స్​లో చాలా ఎక్కువగా చక్కెర ఉంటుంది. అదేవిధంగా సోడా, ఫ్రూట్-ఫ్లేవర్డ్ డ్రింక్స్ వంటి కూల్ డ్రింక్స్.. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇవి శక్తిని తగ్గించి.. దీర్ఘకాలికంగా బరువు పెరిగేలా చేస్తాయి. CDC ప్రకారం.. పిల్లల ఆహారంలో అదనపు షుగర్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా ఉంటే.. చిన్నతనంలోనే ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతాయని తెలిపింది. దానికి బదులుగా ఓట్‌మీల్ వంటి తృణధాన్యాలు ఇవ్వొచ్చు. స్వీట్ డ్రింక్స్​కు బదులుగా నీరు లేదా చక్కెర తక్కువగా వేసి పాలు ఇవ్వొచ్చు.
  • చిప్స్ : చిప్స్, నగ్గెట్స్ వంటి వేయించిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్‌లలో దొరికే ఫుడ్స్​లో ట్రాన్స్ ఫ్యాట్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అవసరమైన పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలు వాటిని ఇష్టపడినా.. వాటికి పిల్లలను దూరంగా ఉంచే బాధ్యత మీదే. ఎందుకంటే వేయించిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్, వాపు పెరగుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. 

చిన్నప్పటి నుంచే చేయాల్సిన మార్పులివే

చిన్నతనంలోనే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పించాలి. ఇవి జీవితకాలం ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ అవుతాయి. తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారం, ఎక్కువ పోషకాహారం ఉండే ఫుడ్స్ పెడితో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వారి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎనర్జిటిక్​గా ఉంటారు. రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. కాబట్టి వీలైనంత వరకు వైద్యుల సహాయం తీసుకుంటూ హెల్తీగా, టేస్టీ ఫుడ్స్ పిల్లలకు అందించవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.